TMC : బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ బాంబ్..40 ఏళ్ల నమ్మకస్తుడి సంచలన రాజీనామా వెనుక ఏం జరిగింది?
TMC : టీఎంసీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నట్లు చెబుతూ డైరెక్టుగా దీదీకే తన చేతిరాతతో రాసిన లెటర్‌ను పంపడం బెంగాల్ రాజకీయాలలో ఒక్కసారిగా కలకలం రేపింది
TMC
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పరాజయం క్రియేట్ చేసిన పొలిటికల్ ప్రకంపనలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని(TMC).. ఇప్పట్లో ఏ మాత్రం వదిలేలా కనిపించడం లేదు. టీఎంసీ(TMC) పార్టీ ఘోర పరాభవంతో ఇప్పటికే తీవ్ర నైరాశ్యంలో ఉన్న అధినేత్రి మమతా బెనర్జీకి.. ఇప్పుడు సొంత గూటి నుంచే మరో కోలుకోలేని దెబ్బ తగిలింది.
4 దశాబ్దాలుగా దీదీకి అత్యంత నమ్మకమైన పొలిటికల్ సైనికుడిగా, పార్టీ కష్టసుఖాల్లో తోడూ నీడగా నిలిచిన మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ క్రియాశీల రాజకీయాలకు పర్మినెంట్‌గా గుడ్‌బై చెప్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
టీఎంసీ(TMC) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నట్లు చెబుతూ డైరెక్టుగా దీదీకే తన చేతిరాతతో రాసిన లెటర్‌ను పంపడం బెంగాల్ రాజకీయాలలో ఒక్కసారిగా కలకలం రేపింది. రీసెంటుగా జరిగిన ఎలక్షన్లో ఊహించని ఓటమి తర్వాత టీఎంసీలో అంతర్గత తిరుగుబాటు, తీవ్ర అసమ్మతి చెలరేగుతున్న ఇదే సమయంలో ఈ సీనియర్ లీడర్ తీసుకున్న నిర్ణయం వెనుక బలమైన పొలిటికల్ సమీకరణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
అఫీషియల్‌గా జ్యోతిప్రియ మల్లిక్ తన లేఖలో తీవ్రమైన అనారోగ్య కారణాలను ప్రస్తావించినా.. ఈ రాజీనామా వెనుకున్న టైమింగ్ మాత్రం చాలా అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం రోజు మమతా బెనర్జీకి బెంగాలీ భాషలో పంపిన ఆ లెటర్లో, తనకు షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయని, వైద్యుల కచ్చితమైన సలహాతో పాలిటిక్స్ నుంచి తప్పుకుని పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
అయితే క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ మాత్రం, మొన్నటి ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారంలో పడటం వల్లే జ్యోతిప్రియ మల్లిక్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నేత,పార్టీలో కీలక నేత ఇలా అర్ధాంతరంగా తప్పుకోవడం బెంగాల్ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
నిజానికి మమతా బెనర్జీ, జ్యోతిప్రియ మల్లిక్ మధ్య ఉన్న అనుబంధం 1980లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం రోజుల నుంచే మొదలైంది. అప్పటి నుంచే మమతా ఫైరింగ్ లీడర్షిప్ను నమ్ముకుని దీదీ వెంటే నడిచిన అరుదైన సహచరుడుగా గుర్తింపు పొందారు.
1984 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ నుంచి మమతా బెనర్జీ బరిలోకి దిగినప్పుడు, జ్యోతిప్రియ మల్లిక్ ముందుండి ప్రచార బాధ్యతలన్నిటిని భుజాన వేసుకున్నారు. ఈ విధేయత వల్లే మమతా ఆయనను బాలు అని ఆప్యాయంగా పిలిచేవారు.
ఆ తర్వాత 1998లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని(TMC) స్థాపించినప్పుడు కూడా మమతా బెనర్జీకి వెన్నుదన్నుగా నిలిచారు. దీనికి బహుమతిగా జ్యోతిప్రియ మల్లిక్‌కు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి దీదీ గౌరవించారు.
రాజకీయ వ్యూహాలు రచించడంలో సిద్ధహస్తుడుగా పేరు బడిన జ్యోతిప్రియ మల్లిక్, కోల్‌కతాలోని అత్యంత కీలకమైన నార్త్ 24 పరగణాల జిల్లాకు కింగ్ మేకర్‌గా చక్రం తిప్పారు. ఆ జిల్లాపై జ్యోతిప్రియ మల్లిక్‌కు ఉన్న అపారమైన పట్టుతో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఒంటిచేత్తో భారీ విజయాలను అందించారు.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో జ్యోతిప్రియ మల్లిక్ చాణక్యం వల్లే ఈ జిల్లాలోని 33 స్థానాలకు గాను టీఎంసీ(TMC) ఏకంగా 30 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసేసింది. గైఘాటా ,హబ్రా నియోజకవర్గాల నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన మల్లిక్.. మమతా బెనర్జీ కేబినెట్లో వరుసగా మూడుసార్లు మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. ముఖ్యంగా 2011 నుంచి పదేళ్ల పాటు అత్యంత కీలకమైన ఆహార శాఖ మంత్రిగా జ్యోతిప్రియ మల్లిక్ పవర్ ఫుల్ లీడర్‌గా చలామణి అయ్యారు.
అయితే ఆ తర్వాత రేషన్ సరఫరాలో జరిగిన భారీ అవినీతి ఆరోపణలు జ్యోతిప్రియ మల్లిక్ రాజకీయ జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేశాయనే చెప్పొచ్చు. ఈ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్ట్ చేయడంతో మల్లిక్ రాజకీయ పతనం ప్రారంభమైంది.
ఆ అవినీతి మరకల వల్లే 2021లో దీదీ జ్యోతిప్రియ మల్లిక్‌కు ప్రాధాన్యత లేని అటవీ శాఖను కేటాయించాల్సి వచ్చింది. దాదాపు 15 నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన.. కోర్టు బెయిల్ మంజూరు చేశాక తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఈ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దీదీ ఆయనపై నమ్మకంతోనే హబ్రా నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలోకి దించారు.
ఎన్నికల ప్రచారంలో కూడా, కేంద్రంలోని బీజేపీ కక్షసాధింపు పాలిటిక్స్ వల్లే జ్యోతిప్రియ ఇరుక్కుపోయారని, ఆయన తన బెస్ట్ మినిస్టర్లలో ఒకరంటూ ఆయనకు మద్దతిస్తూ మమతా గట్టిగా సమర్థించారు.

అయితే ఊహించని విధంగా ఈ ఎన్నికల్లో బెంగాల్ వ్యాప్తంగా ఏర్పడిన బీజేపీ సునామీలో టీఎంసీ అధికారాన్ని కోల్పోవడమే కాకుండా, జ్యోతిప్రియ మల్లిక్ కూడా దారుణ పరాజయాన్ని చవిచూశారు. వరుసగా నాలుగోసారి సీఎం కావాలనే మమతా బెనర్జీ కలలు కరిగిపోవడంతో పాటు పార్టీ ఓటమితో అంతర్గత కుమ్ములాటలు పీక్స్‌కు చేరడంతో జ్యోతిప్రియ మల్లిక్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమయినా 40 ఏళ్లుగా మమతా బెనర్జీకి , పార్టీకి నీడలా నిలిచిన ఆప్తుడు.. ఇలాంటి సంక్షోభ సమయంలో పార్టీని వీడిపోవడం దీదీకి కోలుకోలేని రాజకీయ దెబ్బ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
SSD Tokens : తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్ల వేళల్లో మార్పు..





