India : ఆఫ్ఘన్‌ను ఊడ్చేసారు..వన్డే సిరీస్ క్లీన్ స్వీప్
India : జైస్వాల్ శతక్కొట్టిన వేళ ఆఫ్ఘనిస్తాన్‌ను టీమిండియా ఊడ్చేసింది. వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది
India
ఊహించిన ఫలితమే… మూడో వన్డేలోనూ భారత్(India) దుమ్మురేపింది. బౌలింగ్ లో ప్రసిధ్ కృష్ణ నిప్పులు చెలరేగిన వేళ..బ్యాటింగ్ లో జైస్వాల్ శతక్కొట్టిన వేళ ఆఫ్ఘనిస్తాన్‌ను టీమిండియా ఊడ్చేసింది. వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ కు ఇది తొలి వన్డే సిరీస్ విజయం.
ఈ మ్యాచ్ మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ను ప్రసిధ్ కృష్ణ బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఆఫ్ఘన్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. కేవలం 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. గుర్బాజ్ (5), జద్రాన్ (11), రహమత్ షా (5), రసూలి (1) పరుగులకు ఔటయ్యారు. ఈ నాలుగు వికెట్లు ప్రసిధ్ కృష్ణే పడగొట్టాడు.
ఈ దశలో ఆఫ్ఘన్ టీమ్ ను కెప్టెన్ హష్మతుల్లా షాహిది, ఒమర్జాయ్ ఆదుకున్నారు. షాహిది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 105 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసిన ఒమర్జాయ్ ఔటయ్యాడు. తర్వాత నబీతో కలిసి 57 పరుగులు జోడించిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
నబీ(21) కాస్త పర్వాలేదనిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఒకవైపు షాహిది నిలకడగా ఆడుతున్నా మిగిలిన బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. షాహిది 131 బంతుల్లో 101(13 ఫోర్లు, 1 సిక్సర్ ) ఆఖరి వికెట్ గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే ఒక్కో వికెట్ పడగొట్టారు.
219 పరుగుల లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆఫ్ఘన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చెలరేగిపోయారు. రోహిత్ శర్మ పూర్తి ఫామ్ అందుకోగా అటు జైస్వాల్ కూడా అదరగొట్టాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 22.5 ఓవర్లలో 170 పరుగులు జోడించారు.

రోహిత్ శర్మ 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత శ్రేయాస్ అయ్యర్ తో కలిసి జైస్వాల్ భారత్ విజయాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా 28.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
జైస్వాల్ 86 బంతుల్లో 110 (14 ఫోర్లు, 3 సిక్సర్లు) , శ్రేయాస్ అయ్యర్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ విజయంతో వన్డే సిరీస్ ను 3-0తో భారత్(India) స్వీప్ చేసింది. ప్రసిధ్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ , గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
𝗪.𝗜.𝗡.𝗡.𝗘.𝗥.𝗦 🏆
— BCCI (@BCCI) June 20, 2026
The celebrations begin in the #TeamIndia camp as we clinch the @IDFCFIRSTBank #INDvAFG series with a 3⃣-0⃣ margin 🙌 pic.twitter.com/oI9lbaNeXk
Klin Kara : క్లీంకార ఫోటో పోస్ట్ చేసిన ఉపాసన..వైరల్ గా మెగా ప్రిన్సెస్





