Whatsapp : వాట్సాప్‌కు కేంద్రం బిగ్ షాక్..ఆ ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
Whatsapp : వాట్సాప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా కేవలం యూజర్‌నేమ్ ఆధారంగా కొత్త వ్యక్తులతో చాట్ చేసే కొత్త ఫీచర్‌ను మెటా అభివృద్ధి చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఉచిత మెసేజింగ్ కాలింగ్ అప్లికేషన్ వాట్సాప్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. మెటా కొత్తగా తీసుకొచ్చిన యూజర్ నేమ్ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. వాట్సాప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా కేవలం యూజర్‌నేమ్ ఆధారంగా కొత్త వ్యక్తులతో చాట్ చేసే కొత్త ఫీచర్‌ను మెటా అభివృద్ధి చేస్తోంది.
దీని ద్వారా పర్సనల్ మొబైల్ నెంబర్ ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేకుండా, కేవలం ఒక ప్రత్యేకమైన యూజర్‌నేమ్ ద్వారానే చాటింగ్ లేదా కాల్స్ చేసుకోవచ్చు. నెంబర్ సేవ్ చేసుకోని అపరిచితులతో లేదా గ్రూప్‌లలో మాట్లాడేటప్పుడు ఫోన్ నంబర్ కనిపించదు. యూజర్‌నేమ్ పెట్టుకున్నా కూడా, వాట్సాప్(Whatsapp) అకౌంట్ క్రియేట్ చేయడానికి మొబైల్ నెంబర్ కచ్చితంగా అవసరం అవుతుంది. ప్రొఫైల్ నేమ్ లాగా కాకుండా, ఒక యూజర్‌నేమ్ ఒకరికి మాత్రమే సొంతమై ఉంటుంది.
అయితే, ఈ ఫీచర్ ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు లేదా బ్రాండ్ల పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. ఈ ఫీచర్ వల్ల జరిగే దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మెటా సంస్థను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
అప్పటి వరకు భారతీయ వినియోగదారులకు ఈ ఫీచర్‌ను రోల్ అవుట్ చేయొద్దని స్పష్టం చేసింది. అయితే ఈ ఫీచర్ ను మెటా సమర్థించుకుంది. యూజర్ నేమ్ ఫీచర్ వ్యక్తిగత గోప్యతను మరింత మెరుగుపరుస్తుందని పేర్కొంది. ఇందులో యూజర్‌నేమ్ పెట్టుకోవడం తప్పనిసరి కాదని, గరిష్టంగా 35 అక్షరాల వరకు నచ్చిన పేరును ఎంచుకోవచ్చని తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తరహాలోనే అకౌంట్స్ సెంటర్ ద్వారా అన్ని మెటా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే యూజర్‌నేమ్‌ను ఉపయోగించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వివరించింది. కేంద్రం ఆంక్షలు విధించడం వల్ల ఇప్పుడు వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఎలా ముందుకు తీసుకెళుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ, సైబర్ భద్రత కారణాల వల్ల.. భారత్‌లో వాట్సాప్(Whatsapp) వాడాలంటే తప్పనిసరిగా ఆ యూజర్ పేరు మీద నమోదైన సిమ్ కార్డ్ ఫోన్‌లో యాక్టివ్‌గా ఉండాలనే నిబంధన పటిష్టంగా అమలవుతోంది. గతంలో యూజర్ల డేటాను మెటా ప్లాట్‌ఫారమ్‌లతో పంచుకోవడంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించి, వాట్సాప్‌కు భారీ జరిమానా కూడా విధించింది. అప్పటి నుంచి యూజర్ల ప్రైవసీకి సంబంధించి కఠినమైన మార్గదర్శకాలు అమలులో ఉన్నాయి.
Ilaiyaraaja : ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు.. ఆ 134 మూవీ సాంగ్స్‌పై వివాదం ఏంటి ?





