Shreyas : శ్రేయాస్ ఎంపికపై విమర్శలు..సర్పంచ్ సాబ్ సత్తా ఐపీఎల్ కే పరిమితమా ?
Shreyas : శ్రేయాస్ కెప్టెన్సీ కేవలం ఐపీఎల్ కే పరిమితమా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విదేశీ గడ్డపై అతను కెప్టెన్ గా ప్రభావం చూపించలేడన్న చిన్న అనుమానం ఇప్పుడు నిజమవుతుండడంతో విమర్శల తాకిడి పెరిగింది.
Shreyas
ఐపీఎల్ లో అతను సారథ్యం వహించిన ప్రతీ జట్టూ అదరగొట్టింది. మొదట కోల్ కతాకు టైటిల్ అందించాడు. తర్వాత పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చాడు. కేవలం జట్టును నడిపించడమే కాదు వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణించాడు. తన బ్యాటింగ్ పై కెప్టెన్సీ ఒత్తిడి అస్సలు పడనివ్వలేదు.
కట్ చేస్తే ఐపీఎల్ ప్రదర్శనతోనే టీమిండియా టీ20 పగ్గాలు అందుకున్నాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్ లో సారథిగా సిరీస్ ఓటమితో కెరీర్ ప్రారంభించాడు. అతనెవరో కాదు శ్రేయాస్ అయ్యర్… ఐర్లాండ్ గడ్డపై సిరీస్ ఓటమితోనే భారత టీ20 జట్టుపైనా, కొత్త కెప్టెన్ శ్రేయాస్ పైనా విమర్శలు వచ్చాయి. అటు రెండో టీ20లో ఓటమితో ఈ విమర్శలు మరింత పెరిగాయి.
నిజానికి పంజాబ్ కింగ్స్ గత రెండు సీజన్లలోనూ వరుస విజయాలు సాధిస్తున్నప్పుడు శ్రేయాస్ అయ్యర్ పై ప్రశంసల జల్లు కురిసింది. అసలు టీ20 జట్టులో చోటు కూడా లేని అయ్యర్ కు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలన్న ప్రచారం జరిగింది. పలువురు మాజీ క్రికెటర్లు సైతం శ్రేయాస్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగా పేలవ ఫామ్ తో సతమతమవుతుండడం కలిసొచ్చింది. టీ20 ప్రపంచకప్ గెలిపించినా సూర్యకుమార్ పాత్ర చెప్పుకోదగినంతగా లేదు. దీంతో ఐపీఎల్ లో అదరగొడుతున్న శ్రేయాస్(Shreyas) అయ్యర్ మంచి ఆప్షన్ అనుకుంటూ సెలక్టర్లు వెంటనే టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ అప్పగించారు. తీరా చూస్తే ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపై సిరీస్ కోల్పోయి ఘోరపరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఐర్లాండ్ లో అసలు భారత్ సిరీస్ కోల్పోతుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే జట్టు ఓటమికి కెప్టెన్ ఒక్కడినే బాధ్యుడిని చేయలేమన్నది కూడా వాస్తవమే. అలాగని జట్టును సమర్థవంతంగా నడిపించాల్సిన బాధ్యత మాత్రం కెప్టెన్ దే. ఎందుకంటే మైదానంలోకి దిగిన తర్వాత సారథిగా కెప్టెన్ వ్యూహాలే మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తాయి.
అందులోనూ టీ20 ఫార్మాట్ లో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐర్లాండ్ సిరీస్ లో భారత బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యమే కొంపముంచింది. అటు ఇంగ్లాండ్ రెండో టీ20లోనూ శ్రేయాస్ బౌలింగ్ మార్పు నిర్ణయాలు బెడిసికొట్టాయన్నది కొందరు మాజీలు చెబుతున్న మాట. ఇద్దరు బ్యాటర్లు క్రీజులో సెట్ అయినప్పుడు రవి బిష్ణోయ్ కు ఓవర్ ఇవ్వడం కొంపముంచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

దీంతో శ్రేయాస్(Shreyas) కెప్టెన్సీ కేవలం ఐపీఎల్ కే పరిమితమా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విదేశీ గడ్డపై అతను కెప్టెన్ గా ప్రభావం చూపించలేడన్న చిన్న అనుమానం ఇప్పుడు నిజమవుతుండడంతో విమర్శల తాకిడి పెరిగింది. వచ్చే టీ20 ప్రపంచకప్ వరకూ శ్రేయాస్ నే సారథిగా కొనసాగించాలని సెలక్టర్లు ఇప్పటికే డిసైడయిపోయారు.
దీంతో టీ20ల్లో నెంబర్ వన్ గా ఉన్న భారత జట్టు ఇదే తరహా పేలవ కెప్టెన్సీ కొనసాగితే మాత్రం కిందకి దిగజారిపోవడం ఖాయమంటున్నారు. సూర్యకుమార్ కు మళ్లీ టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ గడ్డపై మిగిలిన మూడు టీ20ల్లో గెలిచి శ్రేయాస్ తన కెప్టెన్సీ సామర్థ్యం నిరూపించుకుంటే తిరుగుండదు.
Silence : మీ మౌనాన్ని వాళ్లు ఎలా తీసుకుంటున్నారు?..మీ బంధంలో ప్రేమ ఉన్నట్లా? లేనట్లా?





