MI vs PBKS : ముంబై గెలుపు బాట పట్టేనా ?…పంజాబ్ కింగ్స్ తో కీలక పోరు
MI vs PBKS : ఐపీఎల్ 19వ సీజన్ లో వరుస పరాజయాలతో డీలా పడిన ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది
MI vs PBKS
ఐపీఎల్ 19వ సీజన్ లో వరుస పరాజయాలతో డీలా పడిన ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్(MI vs PBKS) తో తలపడనుంది. ఈ సీజన్ ను అద్భుత విజయంతో ఆరంభించిన ముంబై తర్వాత చతికిలపడింది. హ్యాట్రిక్ పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉంది. బ్యాటింగ్ లో కీలక ఆటగాళ్లెవ్వరూ రాణించకపోవడం, బౌలర్లు తేలిపోతుండడంతో వరుస ఓటములు ఎదుర్కొంటోంది.
ఓపెనర్ల నుంచి ఫినిషర్ల వరకూ అనుకున్న స్థాయిలో ఎవ్వరూ ఆడడం లేదు. రోహిత్, రికెల్టన్ లలో ఎవరో ఒకరే కాసేపు క్రీజులో ఉంటుండగా.. పవర్ ప్లేలోనే ఔట్ అవుతున్నారు. గత మ్యాచ్ లో రోహిత్ గాయంతో తప్పుకోవడం ముంబై విజయావకాశాలను దెబ్బతీసింది. అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ లోనూ తనదైన ఇన్నింగ్స్ లు ఆడలేకపోయాడు.
తిలక్ వర్మ, నమన్ ధీర్ వైఫల్యం కూడా ముంబైకి ఇబ్బందిగా మారింది. గత కొన్ని సీజన్లుగా అత్యంత నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మ ఈసారి ఎందుకో తన ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. హార్థిక్ పాండ్యా, రూథర్ ఫర్డ్ చివర్లో మెరుపులు మెరిపిస్తున్నా మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ట్ ఉండడం లేదు. ముంబై(MI vs PBKS) బ్యాటింగ్ పూర్తిగా గాడిన పడితే తప్ప గెలుపు బాట పట్టే పరిస్థితి లేదు.
అటు బౌలింగ్ లో స్టార్ పేసర్ బుమ్రా అస్సలు ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఇప్పటి వరకూ ఒక్క వికెట్ కూడా తీయలేదంటే బుమ్రా బౌలింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు యార్కర్లు, పదునైన స్వింగ్ తో బ్యాటర్లను భయపెట్టిన బుమ్రా ఇప్పుడు వికెట్లు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా కూడా ఫలితం ఉండడం లేదు.
బౌల్ట్ , శార్థూల్ ఠాకూర్ కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు. మిఛెల్ శాంట్నర్ కూడా నిరాశపరుస్తుండడం ముంబై ఓటములకు ఒక కారణంగా చెప్పొచ్చు. మరోవైపు పంజాబ్ కింగ్స్(MI vs PBKS) మాత్రం మంచి ఫామ్ లో ఉంది. ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మూడు మ్యాచ్ లు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దవగా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు.

విధ్వంసకర ఇన్నింగ్స్ లతో జట్టును గెలిపిస్తున్నాడు. అలాగే ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య కూడా దుమ్మురేపుతున్నారు. వీరితో పాటు కూపర్ కన్నోలీ, శశాంక్ సింగ్, నేహల్ వధేరా, స్టోయినిస్ లాంటి టీ20 స్పెషలిస్టులు కూడా ఉన్నారు. అటు బౌలింగ్ లో అర్షదీప్ సింగ్ విఫలమవుతుండగా…బార్ట్ లెట్, జాన్సన్ తో పాటు విజయ్ కుమార్ వైశాక్ రాణిస్తున్నారు.
తీవ్ర ఒత్తిడిలో ఉన్న ముంబై బ్యాటర్లను కట్టడి చేయడం పంజాబ్ బౌలర్లకు కీలకం కానుంది. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు సమంగా ఉన్నాయి. 34 మ్యాచ్ లలో తలపడితే చెరొక 17 సార్లు గెలిచాయి. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చే వాంఖడేలో బ్యాటర్ల హవానే కొనసాగుతుంది. దీంతో మరోసారి భారీస్కోర్లు నమోదవడం ఖాయమని చెప్పొచ్చు.





