Just SportsLatest News

Lord’s Cricket Ground : క్రికెట్ మక్కాలో అమ్మాయిల టెస్ట్..లార్డ్స్ లో భారత్ మెరిసేనా ?

Lord's Cricket Ground : క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ లో మహిళా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి.

Lord’s Cricket Ground

మహిళల టీ20 ప్రపంచకప్ లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన భారత జట్టు ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్ కు సిద్ధమైంది. చారిత్రాత్మక లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ మహిళల జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్( Lord’s Cricket Ground) లో మహిళా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి.

1976లో రాచెల్ హేహో ఫ్లింట్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ మహిళల జట్టు ఇక్కడ మొదటిసారి పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడిన సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో తొలి రెడ్ బాల్ మ్యాచ్ జరుగుతోంది.ఈ చారిత్రాత్మక మ్యాచ్‌పై ఉన్న క్రేజ్ కారణంగా ఇప్పటికే 30 వేల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడైనట్టు నిర్వాహకులు తెలిపారు.

యూకే మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు.ఈ మ్యాచ్ ప్రారంభానికి గుర్తుగా ఇంగ్లాండ్‌కు చెందిన 50 మంది మాజీ మహిళా క్రికెటర్లు కలిసి లార్డ్స్‌( Lord’s Cricket Ground)లోని ప్రసిద్ధ ఫైవ్-మినిట్ బెల్ ను మోగించనున్నారు. సాధారణంగా పురుషుల టెస్ట్ మ్యాచ్‌లు 5 రోజుల పాటు జరిగితే, మహిళల టెస్ట్ మ్యాచ్‌లు 4 రోజుల పాటు మాత్రమే ఉంటాయి. దీనిలో ప్రతిరోజూ కనీసం 100 ఓవర్ల ఆట జరుగుతుంది. ఇంకా ఫాలో-ఆన్ టార్గెట్ కేవలం 150 పరుగులుగా ఉంటుంది.

గత రికార్డులు, ఫామ్ ప్రకారం చూస్తే భారత మహిళల జట్టునే ఫేవరెట్ గా భావిస్తున్నారు. భారత్ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. యువ ఓపెనర్ ప్రతీక రావల్ మోకాలి గాయంతో తప్పుకోవడం మన బ్యాటింగ్ లైనప్ ను కాస్త బలహీనపరిచింది. ప్రతీక స్థానంలో ప్రియా పునియాను తీసుకున్నారు.

కాగా ఈ మ్యాచ్‌తో హర్లీన్ డియోల్, శ్రీ చరణి టెస్టుల్లో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ మ్యాచ్ లో స్మృతి మంధాన , దీప్తి శర్మ,శ్రీచరణిలపై అంచనాలున్నాయి. ఇంగ్లాండ్ పిచ్‌లపై జట్టుకు మంచి శుభారంభాన్ని అందించడంలో స్మృతి కీలకం కానుంది. బ్యాటింగ్‌, బౌలింగ్ రెంటిలోనూ అద్భుత ప్రతిభ కనబరిచే ఆల్‌రౌండర్ గా గుర్తింపున్న దీప్తి శర్మను ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బ్యాటర్లకు సవాలే.

Lord's Cricket Ground
Lord’s Cricket Ground

అలాగే టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన శ్రీచరణి మరోసారి అదరగొట్టేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ జట్టుకు నాట్ స్కివర్-బ్రంట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ఆ జట్టు సీనియర్ ప్లేయర్ టామీ బ్యూమాంట్‌కు ఇదే చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్. ఇక భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో రికార్డుల పరంగా చూస్తే టీమిండియాదే పైచేయిగా ఉంది.

మొత్తం 15 మ్యాచ్‌లలో భారత్ 3 గెలవగా.. ఇంగ్లాండ్ కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.11 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.ఇంగ్లాండ్ గడ్డపై భారత్ కు ఓటమి లేని రికార్డుంది. భారత్ ఆడిన 9 టెస్టుల్లో రెండింటిలో విజయం సాధించి, 7 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది కానీ ఒక్క టెస్టులోనూ ఓడిపోలేదు.

Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం..షిండేతో శరద్ పవార్ భేటీ దేనికి సంకేతం?

Related Articles

Back to top button