2030 Commonwealth Games : 2030 కామన్వెల్త్ శతాబ్ది ఉత్సవాలు..అహ్మదాబాద్ ఆతిథ్యంలో మారనున్న గుజరాత్ రూపురేఖలు..
2030 Commonwealth Games : 2010లో ఢిల్లీ వేదికగా భారత్ మొదటి సారి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించింది. 2036 ఒలింపిక్స్ నిర్వహణ రేసులో ఉన్న భారత్‌కు ఈ కామన్ వెల్త్ గేమ్స్ కీలకం కానున్నాయి.
2030 Commonwealth Games
గ్లాస్గో గేమ్స్‌కు తెరపడింది. 74 దేశాలకు చెందిన 3వేల మందికి పైగా అథ్లెట్లు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. ఉత్సాహంగా సాగిన ముగింపు వేడుకల్లో భారత్‌కు కామన్వెల్త్ బ్యాటన్‌ను అందించారు. వచ్చే కామన్వెల్త్ గేమ్స్‌కు అహ్మదాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. 2023 నాటికి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమై వందేళ్లు పూర్తి కానుండడంతో శతాబ్ది ఉత్సవాలకు భారత్ వేదిక కానుంది.
మన దేశంలో రెండోసారి ఈ క్రీడలు జరగనున్నాయి. 2010లో ఢిల్లీ వేదికగా భారత్ మొదటి సారి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించింది. 2036 ఒలింపిక్స్ నిర్వహణ రేసులో ఉన్న భారత్‌కు ఈ కామన్ వెల్త్ గేమ్స్ కీలకం కానున్నాయి. ఆ బిడ్‌ను మరింత బలోపేతం చేసుకోవాలంటే 2030 కామన్ వెల్త్ క్రీడలను( 2030 Commonwealth Games ) అద్భుతంగా నిర్వహించాల్సిందే.
అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్న 2030 కామన్వెల్త్ గేమ్స్(2030 Commonwealth Games)లో పోటీపడే క్రీడాంశాలను కూడా ఇప్పటికే ఖరారు చేశారు. మొత్తం 17 క్రీడాంశాలలో పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వచ్చేసారి సొంతగడ్డపై పతకాల వేటలో భారత్ సెంచరీ కొట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు భారత్ వేదికగా జరగబోయే 2030 కామన్ వెల్త్ క్రీడల బడ్జెట్ పైనా ఆసక్తి నెలకొంది. దాదాపు 3 వేల నుంచి 5 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశముందని అంచనా. ఇది క్రీడల నిర్వాహణకు మాత్రమే వర్తిస్తుంది. నగరంలో చేపట్టే ఇతర మౌలిక వసతుల అభివృద్ది ఖర్చులు దీనికి అదనంగా ఉంటాయి.
కొన్ని ఎడిషన్లుగా కామన్ వెల్త్ గేమ్స్ ఆతిథ్య నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటూ వస్తున్నారు. గ్లాస్గో వేదికగా ఈ క్రీడలను 60 కోట్ల లోపే ముగించినట్టు అంచనా. కొత్తవి నిర్మించకుండా అప్పటికే ఉన్న మౌలిక వసతులు, స్టేడియాలు వంటి వాటిని ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చును తగ్గించుకున్నారు.

కాగా 2010 ఢిల్లీ వేదికగా జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ కోసం 16,000 కోట్లను నిర్వహణ వ్యయంగా అంచనా వేశారు. కానీ, క్రీడలు ముగిసే సమయానికి కామన్ వెల్త్ గేమ్స్ ఖర్చు రూ. 70,000 కోట్లకు చేరుకుంది.
ఇదిలా ఉంటే ఈ క్రీడల నిర్వహణను భారత్ దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగినప్పుడు స్టేడియాలు, మెట్రో నిర్మాణం, ఇతర టూరిజం అభివృద్ధి బాగా జరిగాయి. ఇదే తరహాలో అహ్మదాబాద్ నగరం రూపురేఖలు కూడా కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణతో మారే అవకాశాలున్నాయి.
India : 39 పతకాలతో ముగింపు.. గ్లాస్గోలో భారత్‌కు నాలుగో స్థానం





