C. K. Nayudu : 48 ఏళ్ల సుధీర్ఘ క్రికెట్ కెరీర్ ..ఆ క్రికెటర్ మన తెలుగువారే..
C. K. Nayudu : 1916-1936 క్రికెట్ కాలాన్ని నాయుడు యుగంగా పిలుస్తారు. ఆ దశకంలో క్రికెట్ మ్యాచ్ అంటే టెస్ట్ మ్యాచులే ఉండేవి. అటువంటి రోజుల్లో భారత జట్టుకు ఎక్కువ మంది ఇంగ్లీషు వాళ్లు ఉన్న రోజుల్లోనే టీమ్‌కు కెప్టెన్‌గా ఎన్నికయిన తొలి భారతీయుడు సీకే నాయుడు.
C. K. Nayudu
ఇప్పటి తరం వాళ్లను మన దేశంలో గొప్ప క్రికెటర్లు ఎవరు అంటే కపిల్ దేవ్, గవాస్కర్, సచిన్, ద్రవిడ్ , లక్ష్మణ్ , కోహ్లీ వంటి క్రికెటర్స్ పేర్లే చెబుతారు. కానీ 68 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడిన భారత క్రికెటర్ గురించి చాలా మందికి అసలు తెలీనే తెలీదు. అందులోనూ 48 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్న ప్లేయర్ అంతేకాకుండా తెలుగు ప్లేయర్ అని అసలే తెలీదు.
యాభై ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ చేసిన గొప్ప క్రికెటర్.. కొట్టారి కనకయ్య నాయుడు(C. K. Nayudu). కల్నల్ సీకే నాయుడుగా పిలుచుకునే ఆయన నాగ్ పూర్‌లోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. స్కూల్ స్థాయి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న సీకే నాయుడు(C. K. Nayudu) భారత్ తరపున సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.
బ్రిటిష్ పరిపాలనలో ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా.. రెండు దశాబ్దాల పాటు ఆధిపత్యం కనబరచిన ఘనత సీ కే నాయుడు సొంతం. అందుకే 1916-1936 క్రికెట్ కాలాన్ని నాయుడు యుగంగా పిలుస్తారు. ఆ దశకంలో క్రికెట్ మ్యాచ్ అంటే టెస్ట్ మ్యాచులే ఉండేవి. అటువంటి రోజుల్లో భారత జట్టుకు ఎక్కువ మంది ఇంగ్లీషు వాళ్లు ఉన్న రోజుల్లోనే టీమ్‌కు కెప్టెన్‌గా ఎన్నికయిన తొలి భారతీయుడు సీకే నాయుడు.
1916లో బొంబాయి క్వాడ్రాంగులర్‌లో నాయుడు తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసారు. యూరోపియన్స్‌కు వ్యతిరేకంగా హిందువుల తరఫున బరిలోకి దిగారు. అతని జట్టు 79 పరుగులకు 7 వికెట్లతో కష్టాల్లో ఉన్నప్పుడు 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. తొలి బంతికే సిక్సర్ కొట్టారు. అలా సిక్సర్‌తో మొదలయిన నాయుడు క్రికెట్ ప్రస్థానం 48 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగింది.
భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్‌గా సీకే నాయుడు 1916లో మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడారు. తన 51వ ఏట కూడా ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించి అద్భుతమైన ఫిట్‌నెస్ నిరూపించుకున్నారు. తన టెస్ట్ అరంగేట్రం చేసే సమయానికి నాయుడు వయస్సు 36 ఏళ్లు. కెప్టెన్ గా తన తొలి పర్యటనలో 26 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో భారత్ 9 మ్యాచ్‌లు గెలిచి, 9 మ్యాచ్‌లు ఓడిపోగా, 8 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

ఈ పర్యటనలో సీకే నాయుడు నాయకత్వ నైపుణ్యాలు, ఆల్-రౌండ్ ప్రదర్శనల కారణంగా, 1933 సంవత్సరానికి గాను విజ్డెన్ తమ ఐదుగురు క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌లో ఒకరిగా నాయుడిని పేర్కొంది. కాగా నాయుడు 62 సంవత్సరాల వయస్సులో రంజీ ట్రోఫీలో తన చివరి మ్యాచ్ ఆడాడు. అలాగే చివరి మ్యాచ్ 1963–64లో ఒక ఛారిటీ మ్యాచ్. 68 ఏళ్ల వయస్సులో మహారాష్ట్ర గవర్నర్ ఎలెవన్ తరపున ఆడారు.
క్రికెట్‌కు ఆయన చేసిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం 1956లో నాయుడుకు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్ ఆయనే. 2006లో, భారత క్రికెట్‌కు జీవితకాలంలో సాటిలేని సేవలు అందించిన వ్యక్తులకు ఇచ్చే కల్నల్ సీకే నాయుడు(C. K. Nayudu) జీవిత సాఫల్య పురస్కారాన్ని ఏర్పాటు చేసింది బీసీసీఐ.





