WTC Final : లంక గడ్డపై టీమిండియా చారిత్రక విజయం..అయినా WTC ఫైనల్ చేరడం ఈజీ కాదా?
WTC Final : శ్రీలంక గడ్డపై ఒకే టెస్టులో మానవ్ సుతార్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టి (10/131), టీమిండియా దిగ్గజాలైన హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.
WTC Final
శ్రీలంక హోమ్ గ్రౌండ్‌లోనే లంక టీమ్‌ను టీమిండియా యువ రక్తం ఊచకోత కోసింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో లంక బ్యాటర్లను భారత్ బౌలర్స్ తమ స్పిన్ దెబ్బకు కకావికలం చేయడం.. భారత్ 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేయడంతో పాటు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది.
అప్పటి వరకూ 48.15 శాతంగా ఉన్న భారత్ పాయింట్ల శాతం ఈ విజయంతో 53.55కి జంప్ చేసేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ భారత్ కంటే ముందు వరుసలో ఉన్నా సరే, ఐదో స్థానంలో ఉన్న భారత్ టాప్-4 వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది.
ఈ మ్యాచ్‌లో అసలైన హీరోగా యువ స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ నిలిచాడు. శ్రీలంక గడ్డపై ఒకే టెస్టులో ఏకంగా 10 వికెట్లు పడగొట్టి (10/131), టీమిండియా దిగ్గజాలైన హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు లంక హోంగ్రౌండ్‌లో 10 వికెట్ల ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా సుతార్ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 462 పరుగుల భారీ స్కోరు బోర్డుపై ఉంచింది. దేవదత్ పడిక్కల్ (230 బంతుల్లో 167) సెంచరీతో చెలరేగగా, కేఎల్ రాహుల్ (82), వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (51) హాఫ్ సెంచరీలతో చేయి అందించారు.
తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక జట్టు 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఘోరమైన కష్టాల్లో పడింది. ఆ దశలో సోనల్ దినుషా (100), నిరోషన్ డిక్వెల్లా (80) ఆరో వికెట్‌కు 146 పరుగులు జోడించి ఆదుకోవడానికి ప్రయత్నించారు. కానీ మానవ్ సుతార్ (4/76) మ్యాజిక్ చేయడంతో లంక 284 పరుగులకే ఆలౌటై, భారత్‌కు 178 పరుగుల తొలి ఇన్నింగ్స్‌లో పైచేయి దక్కింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారనే చెప్పాలి. రిషభ్ పంత్ (69), పడిక్కల్ (44), కేఎల్ రాహుల్ (35) తప్ప మిగిలిన వారు ఫెయిల్ అవడంతో భారత్ 193 పరుగులకే ఆలౌట్ అయింది. అసిథ ఫెర్నాండో 4, జయసూర్య 3 వికెట్లు పడగొట్టారు. దీంతో లంక ముందు 372 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది.
టార్గెట్ ఛేదనలో లంక టీమ్ మరోసారి చేతులెత్తేసింది. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా, ధనంజయ డిసిల్వా (59), సోనల్ దినుషా (84) జంట 91 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌తో కాసేపు ప్రతిఘటించింది. అయితే మానవ్ సుతార్ విరుచుకుపడటంతో సీన్ మారిపోయింది. కేవలం 10 బంతులలోనే లంక లోయర్ ఆర్డర్‌ను చాపచుట్టేసి, రెండో ఇన్నింగ్స్‌లో 6/55తో రెయిజ్ అయ్యాడు. దీంతో లంక 206 పరుగులకే కుప్పకూలింది. ప్రసిధ్ కృష్ణ 2, సిరాజ్, జడేజా చెరో వికెట్ తీశారు.

ఈ విజయంతో జోరు మీదున్నా కూడా టీమిండియాకు WTC ఫైనల్(WTC Final )చేరడం అంత సులువేమీ కాదని సీనియర్లు అంటున్నారు. ఈ సైకిల్‌లో భారత్ ఇంకో 8 టెస్టులు ఆడాల్సి ఉంది. దీనిలో శ్రీలంకతో ఇంకో మ్యాచ్, న్యూజిలాండ్‌తో 2 మ్యాచ్‌లు, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఉన్నాయి. ఫైనల్ బెర్త్ దక్కాలంటే మాత్రం ఈ ఎనిమిదింటిలో కనీసం 6 మ్యాచుల్లో అయినా భారత్ కచ్చితంగా నెగ్గాల్సిందే. దీంతో పాటు పట్టికలో పైన ఉన్న మిగతా జట్ల రిజల్ట్ కూడా టీమిండియాకు అనుకూలంగా రావాల్సి ఉంది.





