Minimum balance: బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి? RBI, బ్యాంకుల కొత్త రూల్స్ ఇవే
Minimum balance:ఇటీవల కొన్ని బ్యాంకులు ఈ నిబంధనలను ఎలా మార్చాయి, అవి మీ జేబుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం

Minimum balance
బ్యాంక్ ఖాతా తెరవాలనుకుంటున్నారా? అయితే, ఒక్క నిమిషం ఆగండి! మీకు తెలియని ఒక కీలకమైన మార్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ అకౌంట్‌లో ఎల్లప్పుడూ కొంత డబ్బు ఉండాలి అనే నియమం మినిమం బ్యాలెన్స్(Minimum Balance) గురించి చాలామందికి తెలుసు. కానీ, ఇటీవల కొన్ని బ్యాంకులు ఈ నిబంధనలను ఎలా మార్చాయి, అవి మీ జేబుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం
అసలు విషయం ఏమిటంటే?.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల కొన్ని కీలక విషయాలు చెప్పారు. బ్యాంక్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్(Minimum balance) ఎంత ఉండాలనేది RBI నిర్ణయించదు, ఆ అధికారం పూర్తిగా ఆయా బ్యాంకులకే ఉంటుంది. అంటే, ఏ బ్యాంక్ అయినా తమ వ్యాపార అవసరాలను బట్టి, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ నిబంధనలను రూపొందించుకోవచ్చు. అందుకే కొన్ని బ్యాంకుల్లో ₹2,000 ఉంటే, మరికొన్ని బ్యాంకుల్లో ₹10,000 ఉంటుంది. చాలా ప్రభుత్వ బ్యాంకులు ఈ నిబంధనను పూర్తిగా తొలగించాయి కూడా.
ICICI బ్యాంక్ తీసుకున్న సంచలన నిర్ణయం తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ICICI బ్యాంక్. 2025 ఆగస్టు 1 నుంచి కొత్తగా ఖాతాలు తెరిచేవారికి ఈ బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ పరిమితిని భారీగా పెంచింది.
మెట్రో & అర్బన్ ప్రాంతాల్లో ఇదివరకటి రూ.10,000 నుంచి రూ.50,000కి పెరిగింది. సెమీ-అర్బన్ ప్రాంతాల్లో.. ఇదివరకటి రూ.5,000 నుంచి రూ.25,000కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకటి రూ. 2,500 నుంచి రూ. 10,000కి పెరిగింది.

ఈ నిర్ణయంతో చాలామంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత, తక్కువ ఆదాయం ఉన్నవారు, మొదటిసారి బ్యాంకింగ్ సేవలు పొందుతున్నవారు ఇంత పెద్ద మొత్తంలో బ్యాలెన్స్ నిర్వహించడం కష్టమని అంటున్నారు.
అయితే, దీనికి పూర్తి భిన్నంగా SBI, PNB, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ బ్యాంకులు వేరే మార్గాన్ని ఎంచుకున్నాయి. అవి చాలా కాలం నుంచి కనీస బ్యాలెన్స్ అవసరాన్ని తొలగించాయి లేదా చాలా తక్కువగా ఉంచాయి. ముఖ్యంగా జన్ ధన్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ సేవలను అందిస్తూ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ప్రోత్సహిస్తున్నాయి.
కొన్ని బ్యాంకులలో మినిమం బ్యాలెన్స్ నిర్వహించకపోతే, బ్యాంకులు పెనాల్టీలు వసూలు చేస్తాయి. ఉదాహరణకు, ICICI బ్యాంక్ లోటు బ్యాలెన్స్ పై 6% వరకు లేదా రూ. 500 వరకు ఛార్జీలు వసూలు చేస్తుంది. ఇది ఖాతాదారులకు ఆర్థికంగా భారం కలిగించే అంశం. అందుకే చాలామంది వినియోగదారులు RBI, ప్రభుత్వాలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు..

RBI ఈ విషయంలో జోక్యం చేసుకోదని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టంగా చెప్పేయడంతో..వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. బ్యాంకు ఖాతా తెరిచే ముందు ఆ బ్యాంక్ నియమ నిబంధనలను, ముఖ్యంగా మినిమం బ్యాలెన్స్, దానిపై ఉండే ఫీజులు, ఛార్జీలను జాగ్రత్తగా తెలుసుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితికి ఏ బ్యాంక్ అనుకూలమో పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
One Comment