Ladakh:లడఖ్ లేహ్ లో హింస.. సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్
Ladakh:దేశంలో మరో ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమం హింసకు దారితీసింది.

Ladakh
దేశంలో మరో ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమం హింసకు దారితీసింది. లడఖ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వేళ అనూహ్యంగా హింసాత్మక సంఘటనలు జరగడం కలకలం రేపింది. పలువురు మృతి చెందడం, వందల కొద్దీ గాయపడడం వంటి పరిమాణాలు ఇప్పుడు అరెస్టులకు దారితీశాయి. ఈ హింసకు కారణమని భావిస్తూ లఢఖ్(Ladakh) ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యావరణ వేత్తగా గుర్తింపు పొందిన సోనమ్ వాంగ్‌చుక్ గత కొన్ని రోజులుగా ప్రత్యేక రాష్ట్ర గుర్తింపు కోసం పోరాడుతున్నారు. లఢఖ్ కు సంపూర్ణ రాష్ట్ర హోదా, గిరిజన హక్కులను పరిరక్షించేందుకు ఆరో షెడ్యూల్ కింద గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 15 రోజుల నుంచి నిరాహారదీక్షలో కూర్చున్నారు. అయితే రెండురోజుల క్రితం హింస చెలరేగడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ నిరాహార దీక్షను విరమించుకున్నారు. శాంతిని కాపాడాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మాత్రం ఈ అల్లర్లకు, దాని ద్వారా జరిగిన హింసకు సోనమ్ వాంగ్‌చుక్ కారణమని ఆరోపిస్తోంది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉసిగొల్పుతున్నారని భావిస్తోంది. ఈ క్రమంలోనే హింస చెలరేగిన రెండురోజుల తర్వాత పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

వాంగ్‌చుక్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడాల్సి ఉండగా. దీనికి ముందే అతన్ని అరెస్ట్ చేశారు. లేహ్ లో హింస చెలరేగడానికి వాంగ్ చుక్ చేసిన ప్రకటనలే కారణమని కేంద్ర హోంశాఖ బలంగా నమ్ముతోంది. ఇదే క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది.
వాంగ్‌చుక్ నేతృత్వంలోని స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్(Ladakh) లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే విరాళాల సేకరణలో జరిగిన ఆర్థిక అవకతవకలే దీనికి కారణంగా పేర్కొంది. ప్రస్తుతం వాంగ్ చుక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఏఏ కేసులు నమోదుచేశారనే దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. 1966లో జన్మించిన ఆయన విద్యా రంగంలో సంస్కరణల కోసం ఎస్ఈసీఎంవోఎల్ అనే సంస్థను స్థాపించారు. లఢఖ్ లో విద్యాసంస్కరణ కోసం విద్యావ్యవస్థపై పోరాడిన గొప్ప వ్యక్తిగా వాంగ్ చుక్ కు పేరుంది. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ మూవీలో ఫున్సుఖ్ వాంగ్డు పాత్రను వాంగ్ చుక్ రియల్ లైఫ్ ను సూర్తిగా తీసుకుని చిత్రీకరించారు. పలు ప్రజాసమస్యలపైనా పోరాడిన చరిత్ర కూడా ఆయనకుంది. ఇటీవల లడఖ్ ప్రత్యేక రాష్ట్ర హోదా నినాదంతో ఉద్యమం నడిపిస్తున్న వాంగ్ చుక్ కు అక్కడి ప్రజల మద్ధతుగా బాగానే ఉంది. వాంగ్ చుక్ రెచ్చగొట్టే ప్రకటనలతోనే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని భావిస్తున్న కేంద్రహోంశాఖ శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో అతన్ని అరెస్ట్ చేసినట్టు చెబుతోంది.