Trump: సినిమాలు…ఫర్నిచర్..ఇంకా చాలా.. టారిఫ్ ల మోత ఆపని ట్రంప్
Trump: ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఎందుకంటే దీనిని అమలు చేసేందుకు ఏ చట్టపరమైన అధికారాన్ని వాడతారనేది కూడా తెలియడం లేదు.

Trump
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Trump) కొన్ని దేశాలను టార్గెట్ చేస్తూ టారిఫ్ ల బాంబులు పేలుస్తూనే ఉన్నారు. ముందే ఒక అజెండాతో సుంకాల మోతకు డిసైడయిన అగ్రరాజ్యం అధినేత ఒక్కొక్కటిగా సుంకాల నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. తాజాగా సినిమాలపై ట్రంప్ టారిఫ్ బాంబు పడింది. అమెరికా బయట నిర్మించే అన్ని సినిమాలపై 100 శాంతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకూ వస్తువల దిగుమతులపైనే టారిఫ్స్ మోత మోగించిన ట్రంప్ ఈ నిర్ణయంతో మిగిలిన ఇండస్ట్రీస్ లోనూ సుంకాలు తప్పవని తేల్చేశారు.
ట్రంప్ (Trump)నిర్ణయంతో అంతర్జాతీయ బాక్సాఫీస్ ఆదాయంపై ఆధారపడే అమెరికా స్టూడియోల్లో గందరగోళం మొదలైంది. ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ సినిమాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. అమెరికా సినిమా నిర్మాణ రంగం ఇతర దేశాలతో పోలిస్తే వెనుకబడిపోయిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని కూడా ఇతర దేశాలు దోచుకుపోయాయంటూ చెబుతున్నారు.
అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఎందుకంటే దీనిని అమలు చేసేందుకు ఏ చట్టపరమైన అధికారాన్ని వాడతారనేది కూడా తెలియడం లేదు. అటు వైట్ హౌస్ కూడా దీనిపై ఇప్పటి వరకూ రియాక్ట్ కాలేదు. ఇక అమెరికాలోనే అతిపెద్ద స్టూడియోలు వార్నర్ బ్రదర్స్, నెట్ఫ్లిక్స్, డిస్కవరీ, పారమౌంట్ స్కైడాన్స్ కూడా ఇప్పటి వరకూ స్పందించలేదు.

కాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం అన్ని దేశాలకూ వర్తిస్తుందా.. లేక కొన్ని దేశాలకే పరిమితమవుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ సినిమా రంగానికి సంబంధించి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం హాలీవుడ్ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఫర్నిచర్, కిచెన్ సామాన్లు, బాత్రూమ్ పరికాలపైనా భారీ సుంకాలు విధిస్తామని ఇటీవలే చెప్పిన ట్రంప్ అమలుకు సిద్ధమయ్యారు. కలపపై 10 శాతం, కిచెన్ క్యాబినెట్లు, ఇతర ఫర్నిచర్ పై 25 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 14 నుంచి ఈ కొత్త సుంకాలు అమల్లోకి రానున్నట్టు వెల్లడించారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం ఫర్నీచర్ కు కేంద్రంగా ఉండేదని, చైనాతో పాటు వేరే దేశాల దిగుమతులతో నార్త్ కరోలినా తన ప్రాభవాన్ని కోల్పోయిందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయకపోతే భారీ స్థాయిలో టారిఫ్లను వేస్తామని గతంలోనే చెప్పిన ట్రంప్ ఇప్పుడు మరోసారి దానిని పునరుద్ఘాటించారు. అమెరికా పారిశ్రమికరంగాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ట్రంప్ చెబుతున్నా… అక్కడి వ్యాపారవేత్తలు, ఇతర నిపుణులు మాత్రం దీనిని తప్పుపడుతున్నారు.