Rudraksha:పాపాలను నశింపజేసే రుద్రాక్ష.. ధారణలో తప్పక పాటించాల్సిన నియమాలు
Rudraksha సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు మానవాళికి ప్రసాదించిన దివ్యమైన కానుక ఈ రుద్రాక్ష అని పురాణాలు చెబుతున్నాయి.

Rudraksha
రుద్రాక్షలను సాక్షాత్తు పరమశివుని ప్రతిరూపాలుగా కొలుస్తారు. ఇవి అత్యంత పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలను ధరించడం వలన మనసులో కోరుకున్న పనులు నెరవేరడమే కాక, జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు దరిచేరవు, ఎదురయ్యే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు మానవాళికి ప్రసాదించిన దివ్యమైన కానుక ఈ రుద్రాక్ష అని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. ప్రాచీన ఋషులు ఈ రుద్రాక్షను భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావించారు.
రుద్రాక్ష (Rudraksha)ధారణతో అనేక లోకసంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి, అనేక రకాల అనారోగ్య సమస్యలు, వ్యసనాలు రుద్రాక్ష ధారణతో అదుపులోకి వస్తాయని నమ్మకం. నుదుటన విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేసే వ్యక్తిని దర్శించుకుంటే, అది త్రివేణీ సంగమ స్నానం చేసినంతటి పుణ్యాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పురాణాల ప్రకారం, రుద్రాక్షలను సర్వపాపాలను నశింపచేసే సరస్వతీ నదితో సమానంగా పోల్చారు. మెడ, చేతులు, చెవులకు రుద్రాక్షలను ధరించినవారు జీవితంలో అపజయాలు లేకుండా తిరుగులేని వారిగా ప్రసిద్ధి చెందుతారని విశ్వాసం. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు నిరంతరం ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. ఈ రుద్రాక్షలు వాటి ముఖాల ఆధారంగా ఇరవయ్యొక్క రకాలుగా విభజించబడ్డాయి.
రుద్రాక్ష(Rudraksha) మహిమను సంపూర్ణంగా పొందాలంటే కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు, అలాగే శ్మశానానికి వెళ్లకూడదు. ముఖ్యంగా, కుటుంబ సభ్యులైనా సరే, ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించడం అస్సలు చేయకూడదు. రుద్రాక్షను ఉంగరంలో ధరించకూడదు. అలాగే, ధరించి నిద్రపోకూడదు, శృంగారంలో పాల్గొనకూడదు. స్త్రీలు తమ రుతుసమయంలో రుద్రాక్ష ధారణ చేయకూడదని నియమం ఉంది.
రుద్రాక్ష(Rudraksha) ధారణకు ఒక సరైన విధి ఉంది. సోమవారం, పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుద్రాక్షలను గోమూత్రం లేదా గంగాజలంతో శుద్ధి చేసి, శివపూజ చేయాలి. ఆ తర్వాతే ఆ రుద్రాక్షను ధరించాలి. ధరించిన వెంటనే అద్భుతాలు జరుగుతాయని ఎదురుచూడకూడదు. సత్వర ఫలితాలు , ఆధ్యాత్మిక పురోగతి కోసం, గురువు సమక్షంలో, సిసలైన పద్ధతిలో రుద్రాక్షను ధరించి సాధన చేయాలి. పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాసశివరాత్రి వంటి శుభ తిథుల్లో రుద్రాక్షలతో శివపూజ చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. స్కాంద పురాణం ప్రకారం, రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగి, సకల సంపదలు సిద్ధిస్తాయని చెప్పబడింది. రుద్రాక్షల వృక్షాలు సాధారణంగా జావా, సమత్రా, ఇండోనేషియా, నేపాల్ వంటి ప్రాంతాల్లో, భారతదేశంలో కొన్ని మాత్రమే ప్రదేశాల్లో పెరుగుతాయి.
One Comment