Anna Lezhneva : నిన్ను చూస్తే గర్వంగా ఉంది పవన్ కళ్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న ఆమె అక్షరాలు
Anna Lezhneva : పవన్‌ను పొలిటికల్‌గా ఎంతో మంది ఎగతాళి చేశారని, రకరకాల మాటలతో దూషిస్తూ వేధించారని లెజినోవా గుర్తు చేశారు
Anna Lezhneva
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఒక ఆసక్తికరమైన , ఎమోషనల్ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజుతో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతిలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.
ఈ మెగా వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , బీజేపీకి చెందిన టాప్ లీడర్స్ అందరూ పాల్గొనబోతున్నారు. అయితే, ఈ చారిత్రాత్మక విజయాల సంబరాల వేళ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
సక్సెస్, ఆ గెలుపు తెచ్చిన సంతోషాలు, పేపర్లలో వచ్చే పెద్ద పెద్ద హెడ్‌లైన్స్, ముఖాల్లోని నవ్వులు మాత్రమే ప్రజలందరికీ కనిపిస్తాయని, కానీ ఆ గెలుపు వెనుకున్న ఇన్నేళ్ల సుదీర్ఘమైన పోరాటాన్ని, పడ్డ కష్టాన్ని చాలా తక్కువ మంది గమనిస్తారని అన్నా లెజినోవా(Anna Lezhneva) తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న ఒడిదుడుకులను గుర్తు చేసుకున్న ఆమె.. పవన్ అనుభవించిన అలసట, భరించిన అవమానాలు, చుట్టు ముట్టిన అనిశ్చితి, ఆఖరికి ప్రపంచమంతా తమకు వ్యతిరేకంగా మారినట్లు అనిపించిన ఆ చీకటి రోజులను చాలా కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకోగలరని లెజినోవా ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్‌ను పొలిటికల్ గా ఎంతో మంది ఎగతాళి చేశారని, రకరకాల మాటలతో దూషిస్తూ వేధించారని లెజినోవా గుర్తు చేశారు. ఆయన జనం కోసం బయట యుద్ధాలు చేస్తుంటే.. తాను ఇంట్లో పిల్లల కోసం మానసికంగా ధైర్యం తెచ్చుకుని నిలబడేదాన్ని అని, ఆ టైమ్‌లో చాలా సందర్భాలలో తాను ఒంటరినైపోయానని, పూర్తిగా కుంగిపోయి భయపడిన రోజులు కూడా ఉన్నాయని తెలిపారు.
తాము నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రజా సేవ కోసం ఒకే ఒక్క మనిషి ఇంతకంటే ఇంకెంత భరించగలడని తాను ఎప్పుడూ ఆలోచించేదాన్నని అన్నా లెజినోవా రాసుకొచ్చారు. అయినా సరే తాము వెనకడుగు వేయకుండా ముందడుగు వేశామని అన్నారు. దీనికి కారణం తమ జీవితాలు లగ్జరీగా మారతాయని కాదు, కేవలం కొందరు వ్యక్తులు తమ అంతరాత్మను ఎప్పటికీ వంచుకోలేరు కాబట్టేనని తన భర్తను ఉద్దేశించి అన్నారు.
బహుశా అందుకేనేమో ఈ విక్టరీ తమకు కేవలం రాజకీయపరమైనదిగా కాకుండా, అంతకుమించిన మానవీయమైనదిగా అలాగే ఎంతో ఎమోషనల్‌గా అనిపించిందని చెప్పారు. ఇన్నేళ్ల గుండెకోత అంతా ఒక్క క్షణంలో అంతులేని ఆనందంగా మారిపోయిందని ఎమోషనల్ అయ్యారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు ప్రమాణ స్వీకార మహోత్సవంలో కళ్లల్లో నీళ్లతో తాను అక్కడ నిలబడిన క్షణాన్ని గుర్తు చేసుకుంటూ.. తన కన్నీళ్లను ప్రధాని మోదీ కూడా గమనించారని, అవి కేవలం బాధతో వచ్చినవి కావు, ఆనందభాష్పాలని తెలిపారు.

కొన్నిసార్లు దేవుడు మనుషులను ఏళ్ల తరబడి కఠినంగా పరీక్షిస్తాడు కానీ, చివరికి అదే ప్రపంచం ముందు ముందు వారి గౌరవాన్ని అంతకంతకూ రెట్టింపు చేసి సగర్వంగా తిరిగి ఇస్తాడని లెజినోవా చెప్పుకొచ్చారు. ఓటమిని ఒప్పుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడని పవన్ కళ్యాణ్‌ను చూసి తనకు ఎంతో గర్వంగా ఉందని అన్న ఆమె.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది పవన్ కళ్యాణ్ అంటూ ముగిస్తూ.. భావోద్వేగానికి లోనయ్యారు.
View this post on Instagram
ప్రస్తుతం లెజినోవా(Anna Lezhneva) పెట్టిన పోస్ట్ ఇప్పుడు మెగా అభిమానులను, జనసైనికులను మాత్రమే కాకుండా ప్రతి ఒక్క నెటిజన్‌ల మనసును టచ్ చేస్తోంది.
Somvati Amavasya : సోమవతి అమావాస్య ఎప్పుడు? ఆ రోజు ఇవి అస్సలు కొనకండి..





