Cabinet Meeting: రేపే కేబినెట్ భేటీ.. పెన్షన్ల పంపిణీ, భూ కేటాయింపులపై రానున్న స్పష్టత
Cabinet Meeting : రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు భూ కేటాయింపులు చేయడానికి సిద్ధమైంది.
Cabinet Meeting
రాష్ట్ర రాజకీయాల్లో అలాగే పాలనలోనూ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతూ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన.. ఏప్రిల్ 30వ తేదీన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.
ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ భేటీలో ప్రభుత్వం అనేక కీలక రంగాలపై దృష్టి సారించబోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అర్హులైన లబ్ధిదారులు ఎన్నాళ్లుగానో ఆశగా ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ల మంజూరు అంశంపైన ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గతంలోనే జూన్ 2026 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించిన ప్రకటనలు వెలువడటంతో.. దరఖాస్తుల స్వీకరణ , వయస్సు పరిమితి వంటి నిబంధనలపై మంత్రివర్గం క్షుణ్ణంగా చర్చించనుంది.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు భూ కేటాయింపులు చేయడానికి సిద్ధమైంది. రాజధాని అమరావతి పరిధిలోని క్వాంటం వ్యాలీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు కీలక పారిశ్రామిక జోన్లలో ఇండస్ట్రీస్ స్థాపనకు అవసరమైన భూముల కేటాయింపుపై ఈ భేటీలో ఆమోద ముద్ర వేయబోతున్నట్లు తెలుస్తోంది.
దీని ద్వారా దాదాపు రూ. 39,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు మార్గం ఏర్పడనుంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులను స్పీడప్ చేయడంతో పాటు నాణ్యతతో కూడిన నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు రేపు దిశానిర్దేశం చేయనున్నారు.
అంతేకాదు ఏపీ వ్యాప్తంగా ఇటీవల తలెత్తిన పెట్రోల్, డీజిల్ సరఫరా సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు సరఫరాను నిలిపివేయడం, చమురు కంపెనీలు క్రెడిట్ సదుపాయాన్ని క్యాన్సిల్ చేయడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తప్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించబోతున్నారు. ఇంధన కొరతపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెప్పడం, ప్రజలకు కంటిన్యూగా సరఫరా జరిగేలా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీల ఏర్పాటుపై చర్చ జరగనుంది.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న సమయంలో, శాఖల వారీగా మంత్రుల పనితీరును విశ్లేషించనున్నారు. ముఖ్యంగా మంత్రుల సింగపూర్ పర్యటన ద్వారా లభించిన ఫలితాలు, అక్కడ అధ్యయనం చేసిన అభివృద్ధి నమూనాలను ఏపీలో ఎలా అమలు చేయాలనే దానిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేసే అవకాశం ఉంది.
అలాగే వీటన్నింటితో పాటు న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా 96 కొత్త కోర్టుల ఏర్పాటుతో పాటు 1,730 జ్యుడీషియల్ పోస్టుల భర్తీ వంటి అంశాలు కూడా క్యాబినెట్ ముందుకు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు, ముఖ్యంగా అమరావతి డెవలప్మెంట్కి లభించిన చట్టపరమైన గుర్తింపు , రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులపై కూడా ఈ కేబినెట్ భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.
Wallet : మీ చేతిలో డబ్బు నిలవడం లేదా? అయితే వ్యాలెట్ విషయంలో ఈ తప్పులు చేయకండి..





