Cyclone Alert : తీరం దాటనున్న వాయుగుండం..ఏపీలో కల్లోలం తప్పదా?
Cyclone Alert : మంగళ, బుధవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి, గంటకు 30 - 50 కి.మీటర్ల వేగంతో వీచే గాలులు జనాన్ని భయపెట్టనున్నాయి.
Cyclone Alert
సముద్ర గర్భంలో తీవ్ర వాయుగుండం రూపుదిద్దుకుంటూ, ఏ క్షణంలోనైనా తీరం మీదకు విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ చెబుతోంది. అమరావతి వాతావరణ కేంద్రం ఇచ్చిన తాజా హెచ్చరికలతో రాబోయే 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వానలు వణికించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో మొదలైన అలజడి, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కమ్మేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది.
పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఈస్ట్ మిడిల్ బంగాళాఖాతం పరిధిలో అల్పపీడనం బలంగా కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావారణ శాఖ(Cyclone Alert) తెలిపింది. దీనికి తోడు సముద్ర మట్టానికి ఏకంగా 7.6 కి.మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటం అల్పపీడన తీవ్రతను చాటుతోంది.
ఇది పశ్చిమ వాయువ్య దిశగా వెళ్తూ వచ్చే 24 గంటల్లో మొదట వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. ఆ తర్వాతి 24 గంటల్లో పశ్చిమ మధ్య అలాగే వాయువ్య బంగాళాఖాతంలో మరింత ప్రమాదకరంగా మారి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అంతటితో ఆగకుండా ఇది సెప్టెంబర్ 23 ఉదయానికి ఉత్తర ఏపీ మరియు దక్షిణ ఒడిశా తీరప్రాంతాలకు చాలా దగ్గరగా చేరుకుంటుందని అధికారులు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.
ఇక్కడ మరో విచిత్రమైన వాతావరణ అంచనాలు ఈ తుపాన్ ముప్పును మరింత రెట్టింపు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఒక ద్రోణి ఉత్తర బంగాళాఖాతం నుంచి ఈ అల్పపీడన వ్యవస్థ వరకు వ్యాపించి ఉండగా, మరో ద్రోణి..ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి తమిళనాడు మీదుగా వచ్చి దీనికి తోడైంది.దీంతో ఇప్పుడు ఈ రెండు ద్రోణుల కలయిక వల్ల వర్షాల తీవ్రత ఊహించని స్థాయిలో ఉండబోతోంది.
కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వానలు ఎక్కువగా పడి పరిస్థితి అత్యంత దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయి. సోమవారం రోజు కొన్నిచోట్ల మోస్తరు నుంచి ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.
మంగళవారం నాటికి వర్ష తీవ్రత పీక్స్‌కు చేరుతుంది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక బుధవారం వాయుగుండం తీరానికి చేరువయ్యే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన రికార్డు స్థాయి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దీంతో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తూ కోస్తాంధ్రను అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది.

మరోవైపు రాయలసీమలోనూ దీని(Cyclone Alert) ఎఫెక్ట్ గట్టిగానే ఉండబోతోంది. సోమవారం సాయంత్రం అక్కడక్కడా ఉరుములు, మెరుపుల వినాశనంతో పాటు మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40- 50 కి.మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆ తర్వాత మంగళ, బుధవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి, గంటకు 30 – 50 కి.మీటర్ల వేగంతో వీచే గాలులు జనాన్ని భయపెట్టనున్నాయి. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనుండటంతో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.





