Minister Anam : సాయిబాబా గుడులకు ఆ నిధులు ఇవ్వం..మంత్రి ఆనం కామెంట్లపై మొదలైన కొత్త చర్చ..
Minister Anam : దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు షిర్డీ సాయిబాబాను దైవంగా భావించి పూజిస్తుండటంతో, మంత్రి చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారాయి.
Minister Anam
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ, ధార్మిక వర్గాల్లో ఒకేసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. టీటీడీకి చెందిన ప్రతిష్టాత్మక శ్రీవాణి ట్రస్ట్ నిధులను షిర్డీ సాయి నాధుడి ఆలయాల నిర్మాణానికి గానీ, డెవలప్మెంట్కి గానీ వినియోగించబోమని మంత్రి చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీ సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి ఆనం(Minister Anam) రామనారాయణ రెడ్డి.. శ్రీవాణి నిధులు కేవలం వైదిక, ఆగమ శాస్త్ర సంప్రదాయాలను అనుసరించే హిందూ ఆలయాల పునరుద్ధరణ కోసమే ఉద్దేశించబడినవంటూ తేల్చిచెప్పారు. సీతారామ, శివ, దుర్గ, వెంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే సనాతన హిందూ ఆలయాలకు మాత్రమే ఈ నిధులను ఖర్చు పెడతామని మంత్రి వెల్లడించారు.
అయితే షిర్డీ సాయి నాధుడి ఆలయాలకు ఈ నిధులు వర్తించవని చెప్పడానికి గల కారణాలను కూడా మంత్రి ఆనం(Minister Anam) వివరించారు. పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాలలో కానీ ఆగమ సంప్రదాయాల్లో కానీ షిర్డీ సాయి నాధుడికి స్థానం లేదని, అక్కడ ఆగమ శాస్త్రాల ప్రకారం పూజా విధానాలు జరగవని ఆయన అభిప్రాయపడ్డారు.
సనాతన ధర్మ ప్రచారం, వైదిక సంప్రదాయాల పరిరక్షణ కోసమే శ్రీవాణి నిధులను చట్టబద్ధంగా వినియోగిస్తున్నామని మంత్రి ఆనం అన్నారు. నిజానికి షిర్డీ సాయిబాబా అంశం గతంలో కూడా కొన్ని వివాదాలకు కేంద్రబిందువైంది.
సాయిబాబాను హిందూ దేవతలతో ఈక్వెల్‌గా ఆరాధించాలా వద్దా అనే అంశంపై పీఠాధిపతులు, హిందూ మత సంస్థలు గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు షిర్డీ సాయిబాబాను దైవంగా భావించి పూజిస్తుండటంతో, మంత్రి చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మరింత విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు టిడ్కో కాలనీలో మొదటి ఆలయ నిర్మాణాన్ని జూలై నెలలో ప్రారంభిస్తామని తెలిపారు.
దేవాదాయ శాఖకు సంబంధించిన రెండేళ్ల ప్రగతి రిపోర్ట్‌ను వివరిస్తూ కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా మంత్రి ప్రస్తావించారు. ధూపదీప నైవేద్య పథకం కింద అర్హత కలిగిన చిన్న చిన్న ఆలయాల బ్యాంకు అకౌంట్లలో ప్రతి నెల రూ. 10 వేల చొప్పున డైరెక్టుగా జమ చేస్తున్నామని చెప్పారు. అలాగే దేవాలయాల పునర్నిర్మాణం కోసం స్పెషల్‌గా సర్వ శ్రేయోనిధి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక అట్మాస్పియర్‌ను బలంగా మార్చడం , సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తరించడమే లక్ష్యంగా టీటీడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదటి దశలో 5 వేల భజన మందిరాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి ఆనం(Minister Anam) వివరించారు.
అయితే దేవాదాయ శాఖ సాధించిన ప్రగతి కంటే, శ్రీవాణి నిధులు, షిర్డీ సాయి ఆలయాలపై మంత్రి ఆనం(Minister Anam) రామనారాయణ చేసిన కామెంట్లే ప్రస్తుతం ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయంపై సాయి భక్తుల నుంచి గానీ, ప్రతిపక్షాల నుంచి గానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. ఇది ఎలాంటి రాజకీయ లేదా ధార్మిక పరిణామాలకు దారితీస్తుందో అనేది రెండు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరంగా మారింది.
China : అమెరికాకు చైనా బిగ్ షాక్..రక్షణ రంగ కంపెనీలపై ఆంక్షలు





