Just Andhra PradeshJust PoliticalLatest News

Population Policy:రెండో బిడ్డ కంటే పాతిక వేలు.. ఏపీలో పాపులేషన్ పాలసీ ఎవరికి ప్లస్? ఎవరికి మైనస్?

Population Policy: జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలలో జనాభా తగ్గిపోయి, కేవలం వృద్ధులు ఎక్కువగా మిగిలిపోయి ఆర్థికంగా కుప్పకూలే స్థితికి చేరుకున్నాయి.

Population Policy

ఒకప్పుడు పిల్లలను కనే విషయంలో ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు అనేవారు కానీ ఇప్పుడు ముగ్గురు ఉన్నా తప్పు లేదంటున్నారు. అలా తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన కొత్త జనాభా విధానం సరికొత్త చర్చకు తెరలేపుతోంది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాలన్న ఆ నాయకులే ఇప్పుడు పిల్లలను కనాలని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అన్న కొత్త డిబేటుకు దారి తీస్తుంది.

సీఎం నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ప్రకటించిన ..పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ(Population Policy) గురించి ఏపీ వ్యాప్తంగానే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. రెండో బిడ్డ , ఆ తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు 25,000 రూపాయల నగదు ప్రోత్సాహకం ఇస్తామన్న ఈ ప్రకటన, ఏపీ అస్తిత్వాన్ని కాపాడుకునే ఒక చారిత్రాత్మక మలుపుగా భావిస్తున్నారు.

నిజానికి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ(Population Policy) నిర్ణయాలు ఉత్తరాది రాష్ట్రాల్లో ముందే మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్,రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్నవారికి గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రాధాన్యత, పెన్షన్ బెనిఫిట్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే మిగిలిన రాష్ట్రాలన్నీ కేవలం ఉద్యోగ, ఎన్నికల రాయితీలను మాత్రమే ఇస్తుంటే, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం డెలివరీ సమయంలోనే నేరుగా నగదును అందించేలా నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఏపీలో సంతానోత్పత్తి రేటు ఏకంగా 1.5 శాతానికి పడిపోయింది. ఇది జనాభా కంటెన్యూగా ఉండటానికి అవసరమైన 2.1 శాతం కంటే చాలా తక్కువ. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలలో జనాభా తగ్గిపోయి, కేవలం వృద్ధులు ఎక్కువగా మిగిలిపోయి ఆర్థికంగా కుప్పకూలే స్థితికి చేరుకున్నాయి.

ఏపీలో కూడా 2050 నాటికి 25 శాతం జనాభా వృద్ధులతోనే నిండిపోయే ప్రమాదం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కేవలం పెన్షన్ల కోసమే ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితికి చేరుకుంటుంది.

మరోవైపు,పనిచేసే యువత తగ్గిపోతే ఏ రాష్ట్రానికి అయినా ఉత్పత్తి సామర్థ్యం దారుణంగా పడిపోతుందనేది తెలిసిందే. వీటన్నింటికీ మించి, 2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో.. జనాభా తక్కువగా ఉందనే కారణంతో దక్షిణాది రాష్ట్రాలు తమ పార్లమెంటు సీట్లను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ ముప్పును ముందుగానే పసిగట్టిన సీఎం చంద్రబాబు, జనాభా అంటే కేవలం సంఖ్య కాదు – అది ఒక సంపద అంటూ ఈ సరికొత్త నినాదంతో ఈ సాహసోపేతమైన అడుగు వేస్తున్నారు.

ఈ పాలసీ వల్ల ముఖ్యంగా గ్రామీణ , ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వెంటనే ఊరట కలుగుతుంది. డెలివరీ సమయంలో అందే ఆ 25,000 రూపాయలు వారిక కొండంత అండగా నిలుస్తాయి. దీనివల్ల రాష్ట్రంలో జననాల రేటు పెరిగిపోయి, భవిష్యత్తులో నవ్యాంధ్ర నిర్మాణానికి అవసరమైన యువ శక్తి అందుబాటులోకి వస్తుంది.

అయితే, ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే..ఈ నాణేనికి మరోవైపు కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. కేవలం నగదు ప్రోత్సాహకం కోసం పిల్లలను కంటే.. పేద మహిళల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది మహిళా సాధికారతకు ఆటంకమని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

Population Policy
Population Policy

అంతేకాదు ఇలాంటి పథకాలు ప్రభుత్వాలు మారినపుడల్లా పేదకుటుంబాలకు ఆర్థిక భారాన్ని మోపేలా తయారవుతాయి. అంతేకాదు ఏటా సుమారు 5 లక్షల మందికి ఈ డబ్బులు అందించాలంటే ఏపీ ప్రభుత్వ ఖజానాపై.. ఏటా 10,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఇది ఇతర అభివృద్ధి పనులకు కేటాయించే నిధులపైన తప్పకుండా ప్రభావం చూపిస్తుంది.

అయితే ఈ నిర్ణయం వల్ల జననాల రేటు పెరిగి ..జనాభా స్థిరీకరణ దిశగా ఏపీ అడుగులు పడతాయి. అయితే కేవలం డబ్బు ఇవ్వడమే కాకుండా, పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంతో పాటు నాణ్యమైన విద్యపై భారీగా పెట్టుబడులు పెడితే మాత్రం.. ఈ పాలసీ ఆశించినట్లుగానే అద్భుత ఫలితాలను ఇస్తుంది.

మొత్తంగా విజన్ ఉన్న నాయకుడిగా పేరు పడ్డ చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా30 ఏళ్ల తర్వాత జరిగే ప్రమాదాన్ని గుర్తించారు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ జనాభా పోరాటంలో ..ఏపీ సీఎం చంద్రబాబు వేసిన ఈ అడుగు ఏపీని ఏ తీరానికి చేరుస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button