Trump : ఇరాన్ ఇక మ్యాప్‌లో ఉండదా ?.. ట్రంప్ వ్యాఖ్యలతో టెన్షన్..టెన్షన్
Trump : రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుగుతాయని ఎదురుచూస్తున్న వేళ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Trump
పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు, అణు ఒప్పందాల ఉల్లంఘనలతో అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. యుద్ధం ముగిసి చర్చలు ఫలించి కాల్పుల విరమణ కొనసాగుతుందనుకుంటున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
ఇరాన్‌తో గతంలో కుదిరిన సీజ్ఫైర్ ముగిసిపోయిందని ఆయన ప్రకటించారు. హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడంతో, అమెరికా సైన్యం ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై వైమానిక దాడులకు దిగింది. ఇరాన్ తమ మాట వినకపోతే మరిన్ని తీవ్రమైన దాడులు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఈ రాత్రికి భీకర దాడులు చేయబోతున్నట్టు ట్రంప్(Trump) ప్రకటించారు. చర్చల పేరుతో సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఇరాన్ ప్రతినిధులపై ట్రంప్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ, అక్కడ గుమిగూడిన ఇరాన్ కీలక నాయకత్వాన్ని ఉద్దేశించి గతంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంత్యక్రియల సమయంలో ఆ దేశ అగ్రనాయకులంతా ఒకే చోట ఉన్నారని, తాము అనుకుంటే ఒక్క దెబ్బతో లేపేసేవాళ్లమంటూ వ్యాఖ్యానించారు.
అంత్యక్రియల కోసం అక్కడకు వచ్చిన ఇరాన్ అధికారులందరినీ తాము లక్ష్యంగా చేసుకోగలమని, కానీ అలా చేస్తే భవిష్యత్తులో చర్చలు జరపడానికి ఎవరూ మిగలరు కాబట్టే ఆ పని చేయడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. గురువారం ఖమేనీ అంత్యక్రియలు జరగనున్న వేళ ట్రంప్ సీజ్ ఫైర్ ముగిసిందంటూ ప్రకటించడం , కొద్దిసేపటికే ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులకు తెగబడుతుండడం వంటి వరుస పరిణామాలతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుగుతాయని ఎదురుచూస్తున్న వేళ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ట్రంప్ వ్యాఖ్యలతో విమానయాన సంస్థలు ఇరాన్, ఇరాక్, లెబనాన్ గగనతలాన్ని ఉపయోగించవద్దని విమానయాన ఏజెన్సీలు స్పష్టం చేశాయి. పశ్చిమాసియా ఉద్రిక్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. అటు ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రభావం స్టాక్ మార్కెట్ పైనా పడింది.





