APCO: చేనేతకు డిజిటల్ జోష్.. ఆప్కో డోర్ డెలివరీతో నేతన్నలకు భరోసా..!
APCO: ఆప్కో ఒక కీలకమైన అడుగు వేసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్,మింత్రా, జియోమార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో కలిసి అమ్మకాలు ప్రారంభించింది.

APCO
ఒకప్పుడు కేవలం దుకాణాల్లో మాత్రమే దొరికే చేనేత వస్త్రాలు ఇప్పుడు మీ ఇంటికే రాబోతున్నాయి. నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆప్కో (APCO) ద్వారా చేనేత వస్త్రాలను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అమ్మకానికి పెట్టింది. యువత నుంచి మహిళల వరకు అందరి అభిరుచులకు తగ్గట్టుగా నూతన డిజైన్లతో చేనేత రెడీమేడ్ దుస్తులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి.
ఆన్‌లైన్ షాపింగ్ హవా నడుస్తున్న ఈ కాలంలో, చేనేత వస్త్రాలను వినియోగదారులకు మరింత చేరువ చేయడానికి ఆప్కో ఒక కీలకమైన అడుగు వేసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్,మింత్రా, జియోమార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో కలిసి అమ్మకాలు ప్రారంభించింది. ఈ కొత్త విధానం ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన చేనేత వస్త్రాలను ఇంటి దగ్గర నుంచే ఆర్డర్ చేసి, డోర్ డెలివరీ పొందొచ్చు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 40 ఆప్కో షోరూమ్‌లను ఈ-కామర్స్ సంస్థలకు లింక్ చేశారు.

ఈ-కామర్స్ విధానం వల్ల చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ పెరిగి, నేతన్నలకు ఆర్థిక భరోసా లభిస్తుందనేది నిజం. ఆన్‌లైన్ అమ్మకాలు ఇప్పటికే వేగంగా పెరిగాయి. చాలా తక్కువ సమయంలోనే రూ. 45 లక్షల విలువైన చేనేత వస్త్రాలు అమ్ముడయ్యాయి. ఇది చేనేతపై ఉన్న మక్కువను తెలియజేస్తుంది. అలాగే దీనివల్ల ఎక్కువ మంది నేత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వం కొత్త డిజైనర్లను నియమించడం వల్ల, చేనేత పరిశ్రమలో కొత్తదనం వస్తోంది. యువత కోరుకునే కుర్తాలు, మోడరన్ దుస్తులు, పిల్లల గౌన్‌లు వంటివి చేనేతలో తయారవుతున్నాయి.

అయితే ఆన్‌లైన్ మార్కెట్‌లో నకిలీ ఉత్పత్తుల భయం ఎప్పుడూ ఉంటుంది. వినియోగదారులకు వచ్చే ప్రధాన సందేహం, తాము కొనుగోలు చేసే వస్త్రాలు నిజమైన చేనేతవేనా, లేక డూప్లికేట్‌లా అని. అయితే, ఈ విషయంలో ఆప్కో (APCO) నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి నకిలీల భయం తక్కువ. ఆప్కో ఉత్పత్తులకు ప్రత్యేకమైన ట్యాగ్‌లు, బ్రాండింగ్ ఉంటాయి. దీని ద్వారా వినియోగదారులు ఒరిజినల్ చేనేత వస్త్రాలను గుర్తిస్తారు. అంతేకాకుండా, ఆప్కో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కచ్చితమైన వివరాలు, ఫోటోలు, డిస్క్రిప్షన్‌లు ఇవ్వడం ద్వారా వినియోగదారుల నమ్మకాన్ని పెంచే అవకాశం ఉంది.
మొత్తానికి, చేనేత వస్త్రాలకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఒక కొత్త మార్కెట్‌ను తెరిచాయి. ఇది నేతన్నలకు మంచి భవిష్యత్తును ఇస్తుందని ఆశిద్దాం. అలాగే, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించేలా ఆప్కో మరిన్ని చర్యలు తీసుకోవాలి.