Just Andhra PradeshLatest News

Free bus: ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు నుంచే..ఏపీ ప్రభుత్వానికి భారమెంత?

Free bus:కేవలం జిల్లాల పరిధిలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేందుకు మహిళలకు అవకాశం కల్పించారు.

Free bus

ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు (Free bus)ప్రయాణ పథకం ‘స్త్రీశక్తి’ ఈరోజు ప్రారంభం కానుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలలో ఇది ఒకటి. ఈ పథకం కేవలం జిల్లాల పరిధిలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేందుకు మహిళలకు అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. ‘స్త్రీశక్తి’ పథకం కింద మహిళలు, ట్రాన్స్‌జెండర్లు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఈ ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఈ ఐదు రకాల బస్సులు రాష్ట్రంలో మొత్తం ఆర్టీసీ బస్సుల్లో 74% అంటే సుమారు 8,458 బస్సులు ఉన్నాయి. ప్రయాణ సమయంలో మహిళలకు కండక్టర్ జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు. ఈ టికెట్‌పై ప్రయాణ ఛార్జీని ప్రభుత్వం రాయితీగా ఇస్తుందని, ప్రయాణికురాలు చెల్లించాల్సిన మొత్తం సున్నా అని ఉంటుంది. బస్సులో ప్రయాణించడానికి మహిళలు తమ గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది.

స్త్రీశక్తి పథకం(Free bus) ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక సహాయం లభిస్తుంది.ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత విద్య వరకు చదువుకునే విద్యార్థినులు ఇకపై బస్‌పాస్‌లు కొనాల్సిన అవసరం లేదు.

నిత్యం ఉద్యోగాలు, ఉపాధి కోసం బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఛార్జీల భారం తగ్గుతుంది. ఉదాహరణకు, విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఉండే ఒక మహిళా ఉద్యోగిణికి నెలకు రూ.1,140 ఆదా అవుతుంది.

అనకాపల్లి జిల్లాకు చెందిన ఒక మహిళా రైతు ఉదాహరణగా చూస్తే, ఆమె నెలకు రూ.2,400 వరకు బస్సు ఛార్జీల రూపంలో ఆదా చేసుకోవచ్చు.

బస్సు ఛార్జీల భారం కారణంగా తిరుపతి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ వంటి ఆలయాలకు వెళ్లలేని కుటుంబాలకు ఇప్పుడు తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం లభిస్తుంది.

ఈ పథకం ద్వారా ఒక కుటుంబానికి నెలకు సగటున రూ.4 వేల వరకు ఆర్థికంగా మేలు కలుగుతుందని అంచనా.

ఆర్టీసీ అంచనాల ప్రకారం, ‘స్త్రీశక్తి’ పథకం అమలు తర్వాత బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

ap-Free Bus
ap-Free Bus

ప్రస్తుతం రోజుకు 16.11 లక్షల మంది మహిళలు ఈ బస్సుల్లో ప్రయాణిస్తుండగా, పథకం తర్వాత ఈ సంఖ్య మరో 10.84 లక్షలు పెరిగి, మొత్తం 26.95 లక్షలకు చేరుకుంటుంది. ఈ పథకం కోసం ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.1,942 కోట్లు అంటే నెలకు రూ.161.83 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

ప్రస్తుతం ఏటా 49.91 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తుండగా, పథకం అమలు తర్వాత ఈ సంఖ్య 88.90 కోట్లకు పెరుగుతుందని ఆర్టీసీ అంచనా వేసింది.

ఆర్టీసీకి వచ్చే ఆదాయం ఈ పథకం వల్ల తగ్గకుండా, ప్రభుత్వం మహిళల ప్రయాణ ఛార్జీలను రాయితీ రూపంలో తిరిగి చెల్లిస్తుంది. దీంతో, ఆర్టీసీకి ఆదాయం తగ్గకుండా, మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల వద్ద ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించనున్నారు. ఈ పథకం రాష్ట్రంలోని మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని ఏపీ వాసులు ఆశిస్తున్నారు.

 

Related Articles

Back to top button