Andhra Taxi:ఆ పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇక ఆంధ్రా ట్యాక్సీతో సేఫ్ జర్నీ!
Andhra Taxi: ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే ఆంధ్రా ట్యాక్సీ యాప్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
Andhra Taxi
బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లినా, భవానీ ద్వీపం అందాలు చూడాలన్నా, చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లాలన్నా రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ దిగగానే పర్యాటకులను పలకరించే మొదటి సమస్య రవాణానే. ఆటో డ్రైవర్ల డిమాండ్లు, క్యాబ్ రేట్ల గోల చూసి పర్యాటకులు షాక్ అవుతూ ఉంటారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ నేతృత్వంలో ఆంధ్రా ట్యాక్సీ (Andhra Taxi) యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే ఈ (Andhra Taxi)యాప్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఏమిటి ఈ(Andhra Taxi) యాప్ ప్రత్యేకత అంటే.. సాధారణ ప్రైవేట్ క్యాబ్ యాప్‌ల కంటే భిన్నంగా దీనిని డిజైన్ చేశారు. కేవలం ట్యాక్సీలు మాత్రమే కాకుండా, ఆటోలను కూడా దీనిలో అనుసంధానించారు. దీనివల్ల ముఖ్యంగా మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ ధరలో ప్రయాణించే అవకాశం దక్కుతుంది.
ప్రతి డ్రైవర్ సీటు వెనుక ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. డ్రైవర్ దురుసుగా ప్రవర్తించినా, పొరపాటున వస్తువులు మర్చిపోయినా.. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు, వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసులు అలర్ట్ అవుతారు
ఈ యాప్‌లో కేవలం రవాణా మాత్రమే కాదు.. హోటల్ గదుల బుకింగ్, పర్యాటక ప్యాకేజీలు, చివరకు రైతుల కోసం డ్రోన్ సేవలు కూడా ఉంటాయి.
అంతేకాదు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వారినే పర్యాటక రాయబారులుగా మార్చాలని కలెక్టర్ నిర్ణయించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇలాంటి ప్రాజెక్టుల ముందున్న అతిపెద్ద సవాలు నిర్వహణ. ఇప్పటికే మార్కెట్‌లో పాతుకుపోయిన ఓలా, ఉబెర్ వంటి సంస్థలను ఎదుర్కోవాలంటే ఈ యాప్ సాంకేతికంగా చాలా వేగంగా ఉండాలి.

యాప్ ద్వారా తక్కువ ధర నిర్ణయిస్తే, డ్రైవర్లు ఎంతవరకు మద్దతు ఇస్తారనేది ప్రశ్నార్థకం. అయితే, ప్రభుత్వం వీరికి కచ్చితమైన ఉపాధి హామీ ఇస్తోంది కాబట్టి సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.పర్యాటకులందరికీ ఈ యాప్ గురించి తెలిసేలా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి ఉంటుంది.
ఇదది మహిళా ప్రయాణికులకు ఈ యాప్ కొండంత అండ. ఎందుకంటే ప్రతి వాహనం డేటా నేరుగా పోలీసు స్టేషన్లకు అనుసంధానమై ఉంటుంది. అలాగే ఫిట్‌నెస్ ఉన్న వాహనాలకే అనుమతి ఇస్తారు కాబట్టి ప్రమాదాల ముప్పు కూడా తక్కువ. విజయవాడ పరిసరాల్లోని ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలను చూడటానికి వచ్చే వారికి ఈ ప్యాకేజీలు చాలా చౌకగా దొరకనున్నాయి.
అయితే ఇతర నగరాల్లో ప్రభుత్వ యాప్‌లు అంతగా క్లిక్ అవ్వలేదు కానీ, ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ లక్ష్మీశ స్వయంగా రంగంలోకి దిగి మరీ.. ఆటో బుక్ చేసుకుని ప్రయాణించడం చూస్తుంటే యంత్రాంగం ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతోంది. దీంతో డ్రైవర్లు బాధ్యతగా ఉండి, యాప్ నిరంతరం పనిచేస్తే విజయవాడ పర్యాటక రంగం మరో మెట్టు ఎక్కడం ఖాయం అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.



