Putharekulu: ఆత్రేయపురం పూతరేకులు ఎందుకంత ఫేమస్?
Putharekulu: మొదట్లో, పండుగలు ,శుభకార్యాల సమయంలో మాత్రమే ఈ పూతరేకులను తయారు చేసేవారు.
Putharekulu
తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నది ఒడ్డున వెలిసిన ఒక చిన్న గ్రామం ఆత్రేయపురం. ఈ గ్రామం యొక్క పేరు వినగానే తెలుగువారికి వెంటనే గుర్తుకు వచ్చేది, తెలుగు రుచులకే మణిహారంగా నిలిచిన పూతరేకులు (Putharekulu). ఈ సున్నితమైన, పలచని పొరల స్వీట్ కేవలం ఒక తీపి పదార్థం మాత్రమే కాదు, ఇది ఆంధ్ర సంస్కృతి, కళ , సంప్రదాయాలకు గొప్ప విలువను అందిస్తుంది. దీనిని ‘పేపర్ స్వీట్’ (Paper Sweet-Putharekulu) లేదా ‘రుమాల్ స్వీట్’ అని కూడా పిలుస్తారు.
పూతరేకులు ప్రత్యేకంగా చేయడానికి కారణం, దాని తయారీలో వాడే ‘పూత’ (Skin) లేదా పలచని పొర. ఈ పూత యొక్క తయారీ ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఒక అరుదైన కళ.
దీనికి కావలసినది కేవలం బియ్యప్పిండి (Rice Flour), నీళ్లు, ఒక పెద్ద, వేడి మట్టి కుండ (Inverted Clay Pot) మాత్రమే. మంటపై బోర్లించిన మట్టి కుండపై పలచని బియ్యప్పిండి ద్రావణాన్ని (Batter) గుడ్డ ముక్క సహాయంతో వేగంగా పూస్తారు. వేడికి ఆ ద్రావణంలో ఉన్న నీరు ఆవిరైపోయి, కాగితం అంత సన్నగా, పారదర్శకంగా ఉండే పొర (Thin, Transparent Sheet) ఏర్పడుతుంది. ఈ పొరను ఆపకుండా వేగంగా తీయడం అనేది గొప్ప నైపుణ్యం. ఈ సన్నని పొరనే ‘పూత’ అంటారు.
ఈ స్వీట్ కోసం పూతరేకులను పేర్చి, మధ్యలో నెయ్యి (Ghee), బెల్లం (Jaggery) లేదా పంచదార పొడి , యాలకుల పొడి, జీడిపప్పుని నింపుతారు. ఈ పొరలు నోటిలో వేసుకోగానే కరిగిపోయే (Melt-in-mouth) అనుభూతిని ఇస్తాయి.
పూతరేకులు ఎప్పుడు, ఎవరు కనుగొన్నారు అనేదానిపై నిర్దిష్టమైన రికార్డులు లేవుకానీ.. దీని చరిత్ర 17వ శతాబ్దానికి చెందినదై ఉంటుందని నమ్ముతారు.

ఆత్రేయపురంలోని కొన్ని కుటుంబాలు తరతరాలుగా ఈ కళను కొనసాగిస్తున్నాయి. మొదట్లో, పండుగలు ,శుభకార్యాల సమయంలో మాత్రమే ఈ పూతరేకులను తయారు చేసేవారు. ఈ గ్రామానికి చెందిన మహిళలు తమ అద్భుతమైన తయారీ నైపుణ్యం (Craftsmanship) ద్వారా ఈ స్వీట్‌ను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.
ఆత్రేయపురం చుట్టుపక్కల ప్రాంతంలో పెరిగే నాణ్యమైన బియ్యం ,గోదావరి నది తీరంలోని వాతావరణం కూడా ఈ పూతరేకుల ప్రత్యేకతకు కారణమని చెబుతారు. కేవలం కొన్ని రకాల బియ్యం మాత్రమే ఈ విధంగా పలచని పూతను తయారు చేయడానికి అనుకూలంగా ఉంటాయి.
ఆత్రేయపురం పూతరేకులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. దీని తేలికపాటి నిర్మాణం, నెయ్యి మరియు బెల్లం కలయికతో కూడిన రుచి దేనితోనూ పోల్చలేనిది. నోటిలో వేసుకోగానే సులువుగా కరిగిపోయే అనుభూతిని ఏ ఇతర స్వీట్ ఇవ్వలేదు. దీని తయారీ ప్రక్రియ ఒక కళగా (Art Form) పరిగణించబడుతుంది. ఈ ప్రక్రియను చూడటానికి కూడా పర్యాటకులు ఆత్రేయపురం సందర్శించడానికి వస్తారు.
దీని పొడి స్వభావంవల్లల, ఇది ఎక్కువ కాలం (Long Shelf Life) నిల్వ ఉంటుంది . రవాణా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల ఇది రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులు దాటి ప్రయాణించగలిగింది.
ఆత్రేయపురం పూతరేకులు(Putharekulu) కావాలంటే.. ఆత్రేయపురంలో ఉన్న తయారీదారుల నుండి నేరుగా కొంటే మంచిది. ప్రస్తుతం, అనేక స్వీట్ షాపులలో, ఆన్‌లైన్ ద్వారా దేశవ్యాప్తంగా , అంతర్జాతీయంగా కూడా ఇవి అందుబాటులో ఉంటున్నాయి.



