ED : గూగుల్, మెటాను కూడా వదలని ఈడీ
ED : టెక్ దిగ్గజాలకు సమన్లు జారీ చేయడం ద్వారా, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రచారంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ బాధ్యతపై దేశవ్యాప్తంగా ఒక కీలకమైన చర్చ మొదలైంది.

ED: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌తో సాగుతున్న అక్రమ లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును ఊపందుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలను ప్రశ్నించిన ఈడీ(ED), ఇప్పుడు ఏకంగా టెక్ దిగ్గజాలైన గూగుల్ , మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ)లకు సమన్లు జారీ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల జులై 28న ఈ కంపెనీల ప్రతినిధులు ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు వెళ్లాయి.
ED Investigation
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ‘ఎక్స్’ , షేర్‌చాట్, స్నాప్‌చాట్ వంటి పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ బెట్టింగ్ యాప్స్‌ను సెలబ్రిటీలు యథేచ్ఛగా ప్రమోట్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ ప్రచారం వెనుక భారీ ఎత్తున మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్‌లే ఈ దర్యాప్తునకు ప్రధాన ఆధారాలుగా మారాయి.
ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు సహా మొత్తం 29 మంది నటీనటులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పాత్రపైనా ఈడీ లోతుగా ఆరా తీస్తోంది. ఈ లిస్ట్‌లో హీరోలు నాని, విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా,ప్రకాశ్ రాజ్, అలాగే నటి మంచు లక్ష్మి వంటి ప్రముఖ స్టార్స్ పేర్లు ఉన్నట్లు వార్తలు రావడంతో సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేగుతోంది. వీరిలో చాలామందికి ఇప్పటికే ఈడీ నుంచి నోటీసులు అందినట్లు తెలుస్తోంది.
అయితే ఇంత సీరియస్‌గా తాము ఈ బెట్టింగ్ వ్యవహారంపై విచారణ జరుపుతున్నా కూడా..గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాల ప్లాట్‌ఫామ్స్‌పై ఈ బెట్టింగ్ యాప్స్ ప్రచారం ఎందుకు ఆగడం లేదని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కంపెనీలు బెట్టింగ్ యాప్స్ ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే కాకుండా, వాటి వెబ్‌సైట్ లింకులను కూడా అందుబాటులో ఉంచాయని ఈడీ పేర్కొంది.
తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి ఎంతోమంది ప్రజలు లక్షలాది రూపాయలు పోగొట్టుకోవడమే కాకుండా, కొందరు తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయని విచారం వ్యక్తం చేసింది. ఈ జూదాన్ని విచ్చలవిడిగా ప్రమోట్ చేయడం వల్ల ప్రజలు ఆకర్షితులై, జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఈడీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని నిర్ధారించుకున్న ఈడీ, ఈసీఐఆర్ (Enforcement Case Information Report) నమోదు చేసింది. ఇది పోలీసుల ఎఫ్.ఐ.ఆర్. లాంటిదే. టెక్ దిగ్గజాలకు సమన్లు జారీ చేయడం ద్వారా, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రచారంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ బాధ్యతపై దేశవ్యాప్తంగా ఒక కీలకమైన చర్చ మొదలైంది. ఈ దర్యాప్తు ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన నిజాలు బయటపడే అవకాశం ఉంది.