Just EntertainmentLatest News

8 Vasanthalu: 8 వసంతాలు ఒక మంచి సినిమా ..కానీ..!

8 Vasanthalu: చాలానే రాయాలి.. ఈమధ్య వస్తున్న కొన్ని సినిమాలలో అంశాలను కొంచెం బలంగానే చెప్పాలి.

8 Vasanthalu: చాలానే రాయాలి.. ఈమధ్య వస్తున్న కొన్ని సినిమాలలో అంశాలను కొంచెం బలంగానే చెప్పాలి. అన్ని పండ్లు సరిగ్గా పండవు కొన్ని చోట్ల పచ్చిపచ్చిగా ఉంటాయి. అయినా సరే అవి రుచిగా కూడా ఉంటాయి . 8 వసంతాలు సినిమా కూడా ఆ కోవకు చెందినదే.

8 Vasanthalu

అభ్యుదయ భావాలతో జెండర్ సెన్సిటివిటీ కోణంలో సినిమా తీస్తే ఏదో ఒక కొత్త ఫ్లేవర్ తీసుకువచ్చి విజయవంతం చేయాలి అని దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి  భావించటంలో తప్పేమీ లేదు. కానీ సాంప్రదాయ వలలోంచి బయటపడి సినిమాను తీసి ఒప్పించడం అనేది కొంతవరకు కష్టమే ! ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితుల ప్రభావం ఈ సినిమా మీద స్పష్టంగా కనిపిస్తుంటాయి.

సిద్ధి అయోధ్య పాత్ర మలచిన తీరు బాగున్నా కొన్ని ప్రాథమిక అంశాలు కొరవడిన తీరు మాత్రం ఈ పాత్రలో మనకు కనిపిస్తాయి. సినిమాని పొయిటిక్ గా తీయడంలో, మంచి ఫ్రేములలో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ప్రేమ దాని పర్యవసానాల పరంపరగా ఈ సినిమాను నడిపించడంలో కూడా దర్శకుడు సక్సెస్ అయ్యారు.

హీరోలు ఇద్దరు ఉన్నా వారి పాత్రలు కొంత నాటకీయంగా ప్రాక్టికల్ ప్రపంచానికి కాస్త దూరంగా కనిపిస్తూ ఉంటాయి.
మొదటి హీరో బ్రేకప్ మనకు ఏమాత్రం మింగుడుపడకపోయినా దాని చిత్రీకరణలో భాగంగా వచ్చే మాటలతో డైరెక్టర్ కాస్త సేవ్ అయ్యారు.
రెండో హీరోని కథకి లింక్ చేసే సందర్భంగా కొంత డ్రామా ఎక్కువ అయినట్లు స్పష్టమవుతూ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలి అంటే అష్ట దరిద్రాలు పీడిస్తూ ఉన్న పాత్రలు అన్నీ హీరోయిన్ చుట్టూ చేరితే సాగే కథే.. ఈ 8 వసంతాలు(8 Vasanthalu)

స్నేహితులు, గురువుగారు అందరూ హీరోయిన్ అనంతిక సునీల్ కుమార్‌ను జాలి ట్రాక్ నుంచి ఏమాత్రం పక్కకు వెళ్లకుండా చూసే పాత్రలుగా మాత్రమే మిగిలిపోతాయి.
వారణాసి ఎపిసోడ్ రక్తి కడుతున్న సమయంలో తప్పు చేసిన వాడి భార్య తాళిబొట్టు చూసి వదిలేయటం అనే ఆలోచన దర్శకుడి లో ఉన్న కే. విశ్వనాతిజాన్ని బయట పెడుతుంది. అలా ఆగిపోవచ్చా అంటే దర్శకుడు చెప్పే లాజిక్ నాకూ వినాలని ఉంది.

రెండో హీరో సినిమాలో రాసిన కథ ఏమాత్రం కొత్తగా అనిపించకపోయినా హీరోయిన్ మొదటి బ్రేకప్ సందర్భంగా చెప్పిన డైలాగ్ సెకండ్ వర్షన్ దర్శకుడికి బహుశా ఇక్కడ బాగా ఉపయోగపడి ఉంటుంది.

హీరోయిన్ అంత ప్రోగ్రెసివ్‌గా కనబడి ఇంకో ఏడాదికన్నా ఎక్కువ బతకలేదు అని చెప్పిన వారి అమ్మగారి కలలకోసం ప్రేమించిన వ్యక్తిని ఎవరండీ మీరు అన్నట్లు చూడటం కొంత పాత్రను మలిచే క్రమంలో జాగ్రత్తలు తీసుకోకపోవటమే అని భావించాలి. రెండో హీరో గురించి స్నేహితులు చెప్పటం.. వారి అమ్మగారు స్వయంగా పోస్ట్ మ్యాన్ లా ఎన్వలప్ ప్రపోజల్స్ మోసుకురావడం విశ్వనాథ్ గారి ఇంగువ సినిమాల వాసన మీ ముక్కు దూలాలు పగిలేలా పీల్చక మానదు.

మొత్తంగా చెప్పాలి అంటే అందమైన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రేములతో తీసిన సినిమా 8 వసంతాలు. చాలా తప్పులు ఉన్నా సరే కొన్ని అంశాలలో ఈ సినిమాని ఒప్పుకోక తప్పదు. మాటలు బాగున్నాయి.. స్క్రీన్ ప్లే కూడా పెద్దగా తప్పులు లేవు. హీరోయిన్ మాత్రం తన పాత్రను అద్భుతంగా పోషించింది. మొదటి హీరో కొత్త పర్వాలేదు అనిపించాడు. రెండో హీరో జుట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఎందుకో బోజ్పురి సినిమా పాటల్లో పట్నం నుంచి వచ్చే హీరోల్లా అనిపించాడు. అతని ఎక్స్ప్రెషన్ నాకు హీరోనా విలనా అన్న సందేహం క్లైమాక్స్ దాకా కలిగింది.

పొయిటిక్ గా తీయాలని డైరెక్టర్ చేసిన ప్రయత్నాన్ని మనసారా ఆహ్వానిస్తూనే సినిమాలో పాత వాసనలు లేకుండా చూసుకుంటే బాగుండేది అనిపించింది. ఏది ఏమైనా సినిమాటోగ్రఫీ, వాహద్ సంగీతాన్ని మనం బాగా ఎంజాయ్ చేయవచ్చు. కాశ్మీర్ ను దర్శకుడు ఇంకాస్త బాగా చూపించి ఉండాల్సింది అనిపించింది. మొత్తానికి ఈ సినిమా కొత్తతరం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. షుగర్ కోట్ వేసిన స్త్రీవాద కథ కాబట్టి లోపలికి వెళ్లి విశ్లేషించే శక్తి అందరికీ ఉండదు కాబట్టి ఈ సినిమా తప్పక నచ్చాలి అందరికీ.

నా రేటింగ్ 3/5.

8 వసంతాలు ఒక ఈతరం కోసం తీసిన సినిమా !
-క్రాంతి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button