Just EntertainmentLatest News

Anveshana:నా అన్వేషణ టు నో అన్వేషణ.. 26 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్స్ అవుట్..

Anveshana:డిసెంబర్ 28 నుంచి 30వ తేదీ రాత్రి వరకు నిరంతరంగా సబ్‌స్క్రైబర్లు తగ్గిపోతూనే ఉన్నారు.

Anveshana

సోషల్ మీడియాలో ఎంత వేగంగా అభిమానం పెరుగుతుందో, అంతకంటే వేగంగా ద్వేషం కూడా ముంచుకొస్తుంది. అందుకే ఇది రెండు అంచుల కత్తి లాంటిది అంటారు. నోరుంది కదా అని ఏది పడితే అది.. ఎలా పడితే అలా మాట్లాడితే ఎంత వ్యతిరేకత ఫేస్ చేస్తారో అన్వేష్ ఒక ఉదాహరణగా మారాడు.

ప్రపంచ యాత్రికుడిగా, విభిన్న దేశాల సంస్కృతులను ఇంట్రడ్యూస్ చేసే వ్యక్తిగా తెలుగు ప్రజల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న నా అన్వేషణ(Anveshana) యూట్యూబర్ అన్వేష్ , తన నోటి దురద వల్ల ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లిపోయాడు.

కేవలం 2,3 రోజుల్లోనే దాదాపు 26 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్లను కోల్పోవడం అనేది ప్రపంచ యూట్యూబ్ చరిత్రలోనే ఒక అరుదైనదే కాదు షాక్ కలిగించే ఘటన. అసలు ఇంతటి భారీ స్థాయిలో వ్యతిరేకత ఎందుకు వచ్చింది, అన్వేష్ చేసిన తప్పేంటి అనే విషయాలను లోతుగా పరిశీలిస్తే, బాధ్యత లేని మాటలు ఒక కెరీర్‌ను ఎంతగా నాశనం చేస్తాయో అర్థమవుతుంది.

ఈ వివాదం మొత్తం నటుడు శివాజీ ఓ సినిమా ఫంక్షన్‌లో మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలతో మొదలైంది. ఆ కామెంట్లు విమర్శించే సమయంలో అన్వేష్(Anveshana) తనలోని విజ్ఞతను పూర్తిగా కోల్పోయాడు. శివాజీని తిట్టడానికి ఆయనకు హక్కు ఉండొచ్చు కానీ, హిందూ ధర్మాన్ని, పురాణ పురుషులను, దేవతలను కించపరచడం అస్సలు క్షమించరాని నేరంగా నెటిజన్లు పరిగణించారు.

ముఖ్యంగా ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఒక రేప్ సీన్ లాగా అభివర్ణించడం, సీతాదేవి , రావణాసురుడి పాత్రల గురించి అత్యంత అసభ్యకరమైన,జుగుప్సాకరమైన పోలికలు వాడటం కోట్ల మంది హిందువుల మనోభావాలను గాయపరిచింది. భారతీయ సంస్కృతిలో ప్రాణప్రదంగా భావించే పురాణాలను ‘బూతు’తో పోల్చడం ద్వారా అన్వేష్ తన పతనాన్ని తనే కొనితెచ్చుకున్నాడు.

Anveshana
Anveshana

దీనికి తోడు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుని కూడా అత్యంత నీచమైన భాషతో దూషించడం అగ్నికి ఆజ్యం పోసింది. గరికపాటి వయస్సులోనూ, విజ్ఞానంలోనూ ఎంతో పెద్దవారు. అటువంటి వ్యక్తిపై బూతులతో దాడి చేయడం వల్ల అన్వేష్ లో ఉన్న అహంకారం , డబ్బు గర్వం బయటపడిందని జనం భావించారు.

గతంలో అన్వేష్(Anveshana) తనకు తనే ఒక ‘క్లాసీ’ క్రియేటర్ అని, బూతులు వాడే ఇతర యూట్యూబర్లలా తాను చేయనని గొప్పలు చెప్పుకునేవాడు. కానీ ఈ వీడియోలో ఆయన వాడిన భాష చూశాక, అతనిలోని హిపాక్రిసీ అంటే కపటత్వం క్లియర్‌గా కనిపించింది. మేము నిన్ను ఆదరించి ఈ స్థాయికి తెస్తే, మా దేవుళ్లనే దూషిస్తావా? అనే కోపంతో నెటిజన్లు పెద్ద ఎత్తున ‘మాస్ అన్‌సబ్‌స్క్రైబ్’ ఉద్యమాన్ని చేపట్టారు.

ఈ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందంటే, డిసెంబర్ 28 నుంచి 30వ తేదీ రాత్రి వరకు నిరంతరంగా సబ్‌స్క్రైబర్లు తగ్గిపోతూనే ఉన్నారు. మొదటి 24 గంటల్లో ఏకంగా మూడు లక్షల మంది పోగా, ఆ తర్వాత అది ఊహించని విధంగా 26 లక్షల మార్కును చేరుకుంది. కేవలం యూట్యూబ్‌లోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లక్షలాది మంది అతడిని అన్‌ఫాలో చేశారు.

పరిస్థితి చేయి దాటిపోవడంతో, చట్టపరమైన కేసులు , అరెస్ట్ భయంతో అన్వేష్ ఒక వినాయకుడి గుడికి వెళ్లి క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. కానీ ఆ వీడియో కూడా మరింత నెగిటివిటీకి కారణమైంది. ఆ క్షమాపణలో కూడా నిజాయితీ లేదని, కేవలం కేసులు తప్పించుకోవడానికే సారీ చెబుతున్నాడని నెటిజన్లు ఇంకా ఫైరయ్యారు. ముఖ్యంగా ద్రౌపది గురించి చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడానికే మళ్లీ చూడటంతో.. తన తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా కోల్పోయాడు.

అన్వేష్ విదేశాల్లో ఉంటూ మన దేశం గురించి, ఇక్కడి సంస్కృతి గురించి గతంలో కూడా చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో అతని ట్రావెల్ వీడియోల మీద ఉన్న ఇష్టంతో జనం వదిలేశారు. కానీ ఈసారి మతపరమైన మనోభావాలను, దైవచింతనను టచ్ చేయడంతో జనాలు అస్సలు ఊరుకోలేదు.

సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ నా అన్వేషణ’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వడమే కాకుండా, హిందూ సంఘాలు విశాఖపట్నం , హైదరాబాద్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. అన్వేష్ ఇండియాకు రాగానే అరెస్ట్ చేస్తామనే సంకేతాలు పోలీసులు ఇవ్వడంతో ఈ వివాదం చట్టపరమైన మలుపు కూడా తిరిగింది.ఇటు స్పాన్సర్లు కూడా తమ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో అన్వేష్ తో ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు.

మొత్తానికి ఈ ఘటన తెలుగు డిజిటల్ ప్రపంచంలో ఒక గుణపాఠంలా మిగిలింది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడితే, అదే ఫాలోవర్స్ మిమ్మల్ని భూస్థాపితం చేస్తారని ఈ ఉదంతం నిరూపించింది. మతం, సంస్కృతి , జాతీయ గౌరవం వంటి అంశాలపై మాట్లాడేటప్పుడు ప్రతి క్రియేటర్ ఎంత బాధ్యతగా ఉండాలో అన్వేష్ పతనం ఒక పెద్ద లెసన్ అయింది.

ఒక వ్యక్తి సాధించిన విజయం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ విజయంతో పాటు వచ్చే బాధ్యతను నిలబెట్టుకోలేకపోతే ఎలాంి వారైనా పడిపోవాల్సిందే. అన్వేష్ తిరిగి తన పాత వైభవాన్ని పొందడం ఇప్పుడు ఇక ఇంపాజబుల్ అనే చెప్పాలి, ఎందుకంటే ఈ రేంజ్‌లో వెళ్లి పోయిన సబ్‌స్క్రైబర్లను మళ్లీ పొందొచ్చేమో కానీ, పోయిన నమ్మకాన్ని , గౌరవాన్ని తిరిగి పొందడం చాలా కష్టం.

ఈ ఎపిసోడ్ నుంచి ప్రతి క్రియేటర్ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరుల నమ్మకాలను కించపరచడం, అవమానించడం కాదు. ముఖ్యంగా మతం, సంస్కృతి, సెంటిమెంట్స్ వంటి అంశాలను టచ్ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. వైరల్ అవ్వాలనే ఆరాటంలో లక్ష్మణ రేఖ దాటితే అన్వేష్‌(Anveshana)లా కెరీర్ అంతం అవుతుంది.

Letting Go: జీవితంలో సంతోషం కావాలంటే .. అవి వదిలేయడం నేర్చుకోండి!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button