Giant Causeway: సైన్స్‌కి అందని అద్భుతం.. జెయింట్ కాజ్‌వే రహస్యం
Giant Causeway: సుమారు 40,000 రాతి స్తంభాలు ఒకదానితో ఒకటి అతుక్కుని, సముద్రం వైపు విస్తరించి ఉన్న దృశ్యం ఒక భౌగోళిక అద్భుతం. ఇవి చూడటానికి ఒక రాతి రహదారిలా, లేదా ఒక భారీ కట్టడంలా కనిపిస్తాయి.

Giant Causeway
ప్రకృతి ఎన్నో అద్భుతాలను తనలో దాచుకుంది. సైన్స్‌కి అంతుచిక్కని వాటిలో ఒకటి ఉత్తర ఐర్లాండ్‌లోని కౌంటీ ఆంట్రిమ్‌లో ఉన్న ‘జెయింట్ కాజ్‌వే’(Giant Causeway). ఈ ప్రాంతం చూడగానే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. సుమారు 40,000 రాతి స్తంభాలు ఒకదానితో ఒకటి అతుక్కుని, సముద్రం వైపు విస్తరించి ఉన్న దృశ్యం ఒక భౌగోళిక అద్భుతం. ఇవి చూడటానికి ఒక రాతి రహదారిలా, లేదా ఒక భారీ కట్టడంలా కనిపిస్తాయి. పెద్ద కొండను ఆనుకుని ఉన్న ఈ స్తంభాలు సముద్రం వైపు వెళ్లే కొద్దీ ఎత్తు తగ్గుతూ, చివరకు సముద్రంలో కలిసిపోయినట్లు కనిపిస్తాయి. దీని వెనుక సైన్స్‌తో పాటు అనేక పురాణ కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

సైన్స్ ప్రకారం, సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఆంట్రిమ్ అనే అగ్నిపర్వతం భారీగా బద్దలై ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అగ్నిపర్వతం నుంచి బయటికి వచ్చిన లావా సముద్రపు నీటిలోకి చేరి, చాలా వేగంగా చల్లబడడం వల్ల ఈ బసాల్ట్ రాళ్లు ఏర్పడ్డాయట. లావా వేగంగా చల్లబడినప్పుడు, అది సహజంగా నిలువు పగుళ్లను సృష్టించి, పిల్లర్లలా విడిపోతుంది. అయితే, ఈ పిల్లర్ల వెడల్పు, ఎత్తు లావా చల్లబడే సమయాన్ని బట్టి మారుతుంటాయి. ఈ రకమైన రాతి నిర్మాణాలను బాల్, సాకెట్ జెయింట్స్ అని కూడా పిలుస్తారు. కానీ, ఈ సిద్ధాంతం ఇప్పటికీ పూర్తిస్థాయిలో రుజువు కాలేదని చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తారు.
New rules:సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్
ఈ ప్రాంతంలోని కొన్ని రాళ్లు సాధారణ పిల్లర్లలా కాకుండా విచిత్రమైన ఆకారాల్లో ఉంటాయి. సముద్రపు అలల తాకిడి, కాలక్రమేణా సంభవించిన మార్పుల వల్ల కొన్ని రాళ్లు పెద్ద బూట్, హనీకోంబ్, జెయింట్ హార్ప్, చిమ్నీ స్టాక్స్, ఒంటె లాంటి రూపాలను సంతరించుకున్నాయి. ఇక్కడ సముద్రపు పక్షుల స్వర్గంగా పిలువబడే అనేక పక్షి జాతులు ఉన్నాయి. ఫల్మర్, పెట్రెల్, కార్మోరాంట్ వంటి పక్షులు నివసించడమే కాకుండా, సీ స్ప్లీన్‌వోర్ట్, ఫ్రాగ్ ఆర్కిడ్ వంటి అరుదైన సముద్రపు మొక్కలు కూడా కనిపిస్తాయి. ఈ ప్రాంతం తన అందంతో పాటు ప్రమాదకరమైనది కూడా. సముద్రంలో ఉన్న కొన్ని రాళ్లు బయటికి కనిపించకపోవడంతో, ఇక్కడ అనేక నౌక ప్రమాదాలు జరిగాయి.

జెయింట్ కాజ్‌వే (Giant Causeway)ప్రాముఖ్యతను గుర్తించి, 1986లో యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్’గా ప్రకటించింది. ఆ తర్వాత, 1987లో ఉత్తర ఐర్లాండ్ పర్యావరణ శాఖ దీన్ని ‘నేషనల్ నేచర్ రిజర్వ్’గా గుర్తించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న నాలుగు ప్రధాన సహజ అద్భుతాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది.