Just InternationalLatest News

Sheikh Hasina:షేక్ హసీనాకు మరణశిక్ష సరైన నిర్ణయమా? భారత్ ముందున్న సవాల్ ఏంటి?

Sheikh Hasina:ఈ తీర్పును హసీనా తీవ్రంగా ఖండించారు. తనకు న్యాయమైన విచారణ అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) విధించిన మరణశిక్ష, దేశ చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ, న్యాయపరమైన సంచలనంగా మారింది.

2024లో జరిగిన విద్యార్థి నేతృత్వంలోని తిరుగుబాటును అణచివేయడంలో భాగంగా సామూహిక హత్యలు, క్రైమ్స్ ఎగైనెస్ట్ హ్యుమానిటీ (మానవత్వానికి వ్యతిరేక నేరాలు)కు ఆదేశాలు ఇచ్చారన్న అభియోగాలపై కోర్టు ఈ నిర్ణయం వెలువరించింది.

విచారణలో, హసీనా(Sheikh Hasina) సుమారు మూడు ప్రధాన ఆరోపణలపై దోషిగా తేలారు. ఆరోపణల ప్రకారం:

భీకర దాడులకు ఆదేశాలు.. నిరసనకారులపై భీకర దాడులు చేయాలని ఆమె నేరుగా ఆదేశించారని అభియోగాలు.

ప్రాణాపాయ ఆయుధాల వినియోగం.. పౌరులపై డ్రోన్‌లు, హెలికాప్టర్‌లు మరియు ప్రాణాపాయం కలిగించే ఆయుధాలను ఉపయోగించాలని ఆదేశించినట్లు కోర్టు నిర్ధారించింది.

నివారణ చర్యలు తీసుకోకపోవడం.. అల్లర్లలో మరణాలు జరుగుతున్నా, వాటిని ఆపడానికి గానీ, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి గానీ ఆమె విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.

ఈ తీర్పును హసీనా తీవ్రంగా ఖండించారు. తనకు న్యాయమైన విచారణ అవకాశం ఇవ్వలేదని, ముహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని ప్రజాస్వామ్య విరుద్ధ మధ్యంతర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ శిక్షను వేయించిందని ఆమె ఆరోపించారు.

Sheikh Hasina
Sheikh Hasina

మరోవైపు ఈ తీర్పుపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు , న్యాయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

న్యాయపరమైన లోపాలు (Controversial Tribunal)..నిజానికి ఈ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్‌ను (ICT) హసీనానే 2009లో 1971 నాటి యుద్ధ నేరాల విచారణ కోసం ఏర్పాటు చేశారు.

అయితే, గతంలో హసీనా(Sheikh Hasina) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చిన నేతలను ఈ కోర్టు శిక్షించిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కోర్టులోనే హసీనాకు శిక్ష పడటం గమనార్హం.

చాలా మంది విశ్లేషకులు, విచారణలో సరైన న్యాయ ప్రమాణాలు పాటించలేదని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

హసీనా వాదన..వారు నా కేసును అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)కి ది హేగ్‌లో తీసుకెళ్లలేరు, ఎందుకంటే అక్కడ నాపై నిరూపించడానికి తగిన సాక్ష్యాలు లేవు. అందుకే ఈ కంగారూ కోర్టులో (Kangaroo Court – న్యాయం లేని కోర్టు) శిక్ష వేస్తున్నారు, అని హసీనా అరెస్ట్‌కు ముందే ఆరోపించారు.

ICT విధించిన మరణశిక్షలు గతంలో దేశంలో తీవ్ర హింసకు దారితీశాయి. 2013-2016 మధ్య కాలంలో, ఈ కోర్టు జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన అనేక మంది అగ్ర నాయకులకు 1971 యుద్ధ నేరాల కేసులో మరణశిక్షలు విధించింది.

ఆ తీర్పుల తర్వాత, బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా అల్లర్లు, హింస , బంద్‌లు జరిగాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత హసీనా కేసు తీర్పు, అంతకంటే తీవ్రమైన హింసాత్మక పరిణామాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అటు హసీనాకు శిక్ష పడటంతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమె పార్టీ అవామీ లీగ్ మంగళవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది.

కాగా 2024 ఆగస్టు 4న దేశం విడిచి వచ్చిన హసీనా ప్రస్తుతం భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు.దీంతో యూనుస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం, శిక్ష పడిన హసీనాను వెంటనే అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.

ఈ విషయంలో భారత్ ఇప్పటి వరకు స్పందించలేదు. భారతదేశం, పొరుగు దేశంతో సుహృద్భావ సంబంధాలు కొనసాగించేందుకు “నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని” (engage constructively) మాత్రమే ప్రకటించింది. అత్యంత కీలకమైన రాజకీయ నాయకురాలిని అప్పగించడం భారత విదేశాంగ విధానానికి సంక్లిష్టమైన సవాలుగా మారింది.

షేక్ హసీనాకు మరణశిక్ష అనేది కేవలం న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మాత్రమే కాదు, బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త అస్థిరతకు నాంది. ఈ తీర్పు అమలైతే దేశంలో హింస పెరిగే అవకాశం ఉంది, అదే సమయంలో ఆమెను భారతదేశం అప్పగిస్తే, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button