Just InternationalLatest News

Venezuela:మదురో అరెస్ట్ తర్వాత చమురు దేశంలో మూడు ముక్కల యుద్ధం

Venezuela: సుప్రీం కోర్టు డెల్సీ రోడ్రిగెజ్‌ను 90 రోజుల పాటు టెంపరరీ అధ్యక్షురాలిగా నియమించగా, శక్తివంతమైన వెనిజులా సైన్యం ఆమెకు మద్దతు తెలపడమే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయంగా మారింది.

Venezuela

నికోలస్ మదురోను అమెరికా దళాలు అత్యంత నాటకీయంగా అదుపులోకి తీసుకున్న తర్వాత, వెనిజులా (Venezuela) ఇప్పుడు తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సంధి కాలంలో ఉంది. ఒకవైపు అమెరికా వెనిజులా దేశాన్ని తామే నడిపిస్తామని బాహాటంగా ప్రకటిస్తుంటే, మరోవైపు కారాకస్‌లోని అధికార పీఠంపై మదురో అత్యంత నమ్మకస్తురాలు, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగెజ్ ఇప్పటికే పాగా వేసేశారు.

సుప్రీం కోర్టు ఆమెను 90 రోజుల పాటు టెంపరరీ అధ్యక్షురాలిగా నియమించగా, శక్తివంతమైన వెనిజులా సైన్యం ఆమెకు మద్దతు తెలపడమే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయంగా మారింది. డెల్సీ రోడ్రిగెజ్ కేవలం ఒక పొలిటికల్ నాయకురాలు మాత్రమే కాదు, చావిస్టా సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్న పెద్ద మొండిఘటం.

Venezuela
Venezuela

ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్వెజ్ నిన్నటి వరకు అమెరికాను తీవ్రంగా వ్యతిరేకించి..ఇప్పుడు అదే అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశాభివృద్ధి కోసం ఒక సహకారాత్మక అజెండాతో ముందుకు రావాలని ఆమె అమెరికా ప్రభుత్వానికి బహిరంగ ఆహ్వానం పలకడంతో అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

మదురో కుమారుడు నికోలస్ మదురో గువెరా మాత్రం మాత్రం దీనికి పూర్తి భిన్నమైన వైఖరిని అవలంబిస్తున్నారు. తాజాగా ఆయన రిలీజ్ చేసిన ఒక ఆడియో సందేశం సంచలనం సృష్టిస్తోంది. తమ సొంత ప్రభుత్వంలో ఉన్న కొందరు వ్యక్తులు అమెరికా కుట్రలో భాగస్వాములయ్యారని, ఇది వెన్నుపోటు అని ఆయన ఆవేదన చెందారు. ద్రోహులు ఎవరో చరిత్రే నిర్ణయిస్తుందని.. విశ్వాస ఘాతకుల పేర్లను కాలమే బయటపెడుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, వెనిజులా ప్రభుత్వంలో తీవ్రస్థాయిలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మదురో వారసుడిగా పిలవబడే ఆయన ఏకైక కుమారుడు నికోలాస్ మదురో , అలియాస్ ‘నికోలాసిటో’ ఆచూకీ ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. వెనిజులా సోషలిస్ట్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన నికోలాస్‌ మదురోపై కూడా అమెరికా ఇప్పుడు నార్కో టెర్రరిజం ఆరోపణలు మోపింది. మదురో అరెస్టుతో తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ఈ ‘రాజకుమారుడు’ ప్రస్తుతం అండర్ గ్రౌండ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

కొందరు ఆయన క్యూబా లేదా మెక్సికోకు పారిపోయి ఉండొచ్చని భావిస్తుంటే, అమెరికా ఏజెన్సీలు మాత్రం ఆయనే తమ తదుపరి టార్గెట్ అని సంకేతాలిస్తున్నాయి. ఒకవేళ నికోలాసిటో పట్టుబడితే వెనిజులాలోని చావిస్టా శ్రేణులు పూర్తిగా పట్టు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఆయన ఉనికి ఇప్పుడు వెనిజులా అంతర్గత రాజకీయాల్లో ఒక భారీ సస్పెన్స్ గా మారింది.

వెనిజులాలో (Venezuela) ప్రజల పరిస్థితిని గమనిస్తే, అక్కడవారు ఒక వింతైన గందరగోళంలో ఉన్నారు. మదురో పాలనలో ఆర్థికంగా చితికిపోయిన మధ్యతరగతి ప్రజలు ఆయన పోకను వేడుకగా జరుపుకుంటుంటే, నిరుపేదలు , ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తున్నారు. అమెరికా తమ దేశాన్ని ‘రన్’ చేస్తుందని ట్రంప్ చేసిన ప్రకటన అక్కడి ప్రజల్లో చమురు వలసవాదం (Oil Colonization) అనే భయాన్ని రేకెత్తించింది.

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న తమ దేశాన్ని.. అమెరికా కేవలం పెట్రోల్ బంక్ లా వాడుకుంటుందేమోనని సగటు వెనిజులన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. డెల్సీ రోడ్రిగెజ్ ఈ జాతీయవాద సెంటిమెంట్‌ను అస్త్రంగా వాడుకుని, అమెరికా వ్యతిరేకతను పెంచడం ద్వారా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు.

ఆర్థికంగా వెనిజులా ఇప్పటికే పాతాళంలో పడిపోయింది. హైపర్ ఇన్‌ఫ్లేషన్ వల్ల కరెన్సీ కాగితాల కంటే తక్కువ విలువకు పడిపోయింది. ఇప్పుడు జరిగిన సైనిక దాడుల వల్ల చమురు ఉత్పత్తి కేంద్రాలు చాలా దెబ్బతినడం ఆ దేశ ఆర్థిక వెన్నెముకను విరిచేసినట్లయింది. ట్రంప్ చెబుతున్నట్లు అమెరికన్ కంపెనీలు వెనిజులా చమురు క్షేత్రాలను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో లాభం ఉండొచ్చు .

కానీ, ప్రస్తుతానికి మాత్రం దేశం ఆహార , మందుల కొరతతో అల్లాడుతోంది. ఈ మానవతా సంక్షోభం వల్ల మరో 70 లక్షల మంది ప్రజలు పొరుగు దేశాలకు వలస వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. బ్రెజిల్, కొలంబియా సరిహద్దుల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

అంతర్జాతీయ చట్టాల పరంగా కనుక చూస్తే, వెనిజులా (Venezuela) సార్వభౌమాధికారం ఇప్పుడు ఒక గ్లోబల్ బేరసారాల అంశంగా మారిపోయింది. ఒక స్వతంత్ర దేశాన్ని అమెరికా తన గుప్పిట్లోకి తీసుకోవడంపైన రష్యా, చైనా వంటి దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇది రూల్-బేస్డ్ వరల్డ్ ఆర్డర్‌కు చావుదెబ్బ అని, రేపు ఏ దేశంపై అయినా అమెరికా ఇలాంటి దాడులకు పాల్పడొచ్చనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. వెనిజులా భవిష్యత్తు అయితే ఇప్పుడు కేవలం ఆ దేశ ప్రజల చేతుల్లో లేదు, అది వాషింగ్టన్ , కారాకస్ మధ్య సాగే ఒక భారీ రాజకీయ జూదంలో చిక్కుకుందని చెప్పొచ్చు.

చివరగా వెనిజులా (Venezuela) ఇప్పుడు ఒక దేశంగా కాకుండా ఒక ప్రయోగశాలగా మారిపోయిందన్నది నిజం. ఒక దేశాధినేతను తొలగించి, అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని చెప్పే అమెరికా ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేక వెనిజులా మరో ఆఫ్ఘనిస్తాన్ లేదా ఇరాక్ లాగా అరాచకత్వంలోకి జారిపోతుందా అనేది వేచి చూడాలి.

డెల్సీ రోడ్రిగెజ్ నాయకత్వంలోని టెంపరరీ గవర్నమెంట్ కేవలం 90 రోజుల పాటేనా లేక ఇది సుదీర్ఘ అంతర్యుద్ధానికి నాంది పలుకుతుందా అన్నది ఆ దేశ సైన్యం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా, వెనిజులా సార్వభౌమత్వానికి తగిలిన ఈ గాయం అంతర్జాతీయ రాజకీయాల చిత్రపటాన్ని శాశ్వతంగా మార్చేయబోతోందన్నది మాత్రం వాస్తవం.

NTR-Neel :ఎన్టీఆర్-నీల్ మూవీలో ‘డ్రాగన్’ తాండవం.. హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button