H-1B visas : అమెరికా కలలకు బ్రేక్ ..?
H-1B visas :హెచ్-1బీ వీసాల (H-1B Visas) జారీ ప్రక్రియలో మరో కీలక మలుపు తిరుగుతోంది.

H-1B visas :హెచ్-1బీ వీసాల (H-1B Visas) జారీ ప్రక్రియలో మరో కీలక మలుపు తిరుగుతోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గం ఈ వీసా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. దీనికోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యూలేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ కార్యాలయానికి ఒక ప్రతిపాదనను పంపింది.
New rules for H-1B visas
ప్రస్తుతం, హెచ్-1బీ వీసాల జారీ పరిమితిని ప్రతి ఏడాది అమెరికా కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. ఈ సంఖ్య ప్రస్తుతం 85,000గా ఉంది. వీటిలో 20,000 వీసాలు మాస్టర్స్ డిగ్రీ చేసిన వారికి రిజర్వ్ చేశారు. ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాలకు జారీ చేస్తారు.
అయితే, 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ వీసా దరఖాస్తు ప్రక్రియను నిలిపివేసినట్లు తాజాగా యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించింది. 2026 వార్షిక పరిమితికి అవసరమైన దరఖాస్తులు ఇప్పటికే అందినందున ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో, 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చని తెలుస్తోంది. సాధారణంగా లాటరీ ద్వారా వీసా దరఖాస్తుదారులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత, ఎంపికైన కార్మికులు అక్టోబరు నాటికి విధుల్లో చేరడానికి ఆయా కంపెనీలు దరఖాస్తులను సమర్పిస్తాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు, ఆయన ‘బై అమెరికన్, హైర్ అమెరికన్‘ నినాదంతో కీలక మార్పులు తీసుకొచ్చారు. సదరు పోస్టుకు ఆఫర్ చేస్తున్న వేతనం ఆధారంగా హెచ్-1బీ వీసాలు జారీ చేసే విధానాన్ని అమలు చేశారు. కంపెనీలు ఉన్నత స్థాయి నిపుణులను మాత్రమే నియమించుకునేలా ప్రోత్సహించడానికి, తక్కువ జీతాలున్న పొజిషన్లలో విదేశీయుల నియామకాలను నియంత్రించడానికి ఈ విధానం ఉపయోగపడింది.
2021లో జో బైడెన్ అధికారంలోకి వచ్చాక, ఈ విధానాన్ని పక్కనపెట్టారు. అయితే, ఇప్పుడు డీహెచ్‌ఎస్ పంపిన కొత్త ప్రతిపాదనపై దాదాపు వెయ్యి వరకు పబ్లిక్ కామెంట్స్ వచ్చినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ మార్పుల వల్ల హెచ్-1బీ ఉద్యోగుల లభ్యత మరింత తగ్గిపోతుందని అంచనా.
నిజానికి ఏ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ, పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కువ దరఖాస్తులు చేసి ఎక్కువ వీసాలను దక్కించుకుంటున్నాయన్న విమర్శ ఉంది. ఈ లాటరీ విధానాన్ని తొలగించాలని ఈ ఏడాది జనవరిలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రెస్ అనే థింక్‌ట్యాంక్ సూచించింది. జీతం, సీనియారిటీ ఆధారంగా వీసాలు జారీ చేస్తే వాటి ఆర్థిక విలువ 88 శాతం పెరుగుతుందని తెలిపింది. ట్రంప్ కార్యవర్గం తీసుకురావాలనుకునన మార్పులు ఈ సిఫార్సులకు దగ్గరగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.