China :పెళ్లి కాకుండానే పిల్లలను కనే వింత ఆచారం
China : ఇక్కడ స్త్రీ, పురుషులు లైంగిక సంబంధాలు కలిగి ఉంటారు, పిల్లలను కూడా కంటారు, కానీ ఆ పిల్లలకు తండ్రులతో ఎటువంటి అనుబంధం ఉండదు; తండ్రులు వారి పోషణ బాధ్యత తీసుకోరు.

China: ప్రపంచంలో అనేక విభిన్నమైన, అద్భుతమైన సంస్కృతులు, ఆచారాలు ఉన్నాయి. మనం సాధారణంగా చూసే సామాజిక నియమాలకు పూర్తిగా భిన్నంగా జీవించే కొన్ని తెగలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఒక విలక్షణమైన తెగ ‘మొసువో(Mosuo tribe_’. ఈ గిరిజన తెగ టిబెట్‌కు ఆనుకొని ఉన్న చైనా(China)లోని యున్నాన్, సిచువాన్ ప్రాంతాల్లో నివసిస్తుంది. వారి వైవాహిక సంబంధాలు, కుటుంబ వ్యవస్థలు నిజంగా ప్రత్యేకమైనవి. ఇక్కడ స్త్రీ, పురుషులు లైంగిక సంబంధాలు కలిగి ఉంటారు, పిల్లలను కూడా కంటారు, కానీ ఆ పిల్లలకు తండ్రులతో ఎటువంటి అనుబంధం ఉండదు; తండ్రులు వారి పోషణ బాధ్యత తీసుకోరు.
China
ఈ తెగలో అనుసరించే విచిత్రమైన ఆచారాన్ని ‘జౌ హున్’ లేదా ‘వాకింగ్ మ్యారేజ్'(Walking Marriage) అని పిలుస్తారు. అంటే, వివాహం చేసుకుని ఎవరికి వారు స్వతంత్రంగా జీవించడం. ఈ వ్యవస్థలో, ఒక పురుషుడు రాత్రివేళ తనకు నచ్చిన స్త్రీ ఇంటికి వెళ్లి, ఆమె అనుమతితో ఏకాంతంగా సమయం గడుపుతాడు. అయితే, సూర్యోదయం కాకముందే అతను తన ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. ఈ సంబంధం కేవలం లైంగిక ఆనందం కోసమే. ఇందులో ఎటువంటి వివాహ బంధం లేదా శాశ్వత అనుబంధం ఉండదు.
మొసువో తెగ ఒక సంపూర్ణ మాతృస్వామ్య సమాజం. ఇక్కడ స్త్రీలే సర్వశక్తిమంతులు. మహిళల అనుమతి లేకుండా పురుషులు ఏ పనీ చేయరు. పూర్తిగా స్త్రీల పెత్తనమే నడుస్తుంది. ఆస్తి వారసత్వం కూడా తల్లి నుంచి కుమార్తెకే సంక్రమిస్తుంది. వ్యవసాయ పనులు, ఇంటి బాధ్యతలన్నీ మహిళలే చూసుకుంటారు. ఇంటి పెద్దగా అమ్మమ్మలు (Grandmothers) ఉంటారు. కుటుంబానికి సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలను వారే తీసుకుంటారు.
వాకింగ్ మ్యారేజ్ ద్వారా పుట్టిన పిల్లలకు వారి తండ్రులతో ఎటువంటి సంబంధం ఉండదు. ఇక్కడి పిల్లలు తల్లికి మాత్రమే రక్త సంబంధీకులు. తండ్రిని కేవలం వీర్యదాతగా మాత్రమే భావిస్తారు. పిల్లల బాగోగులను తల్లి లేదా తల్లి సోదరుడు (అంటే మేనమామ) మాత్రమే చూసుకుంటారు. మేనమామలు ఇక్కడ పిల్లల పెంపకంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు, ఎందుకంటే వారు తమ సొంత అక్క లేదా చెల్లెలి పిల్లలను తమ సొంత రక్తంగా భావిస్తారు. తల్లి, మేనమామలే ఇక్కడి పిల్లలకు లోకం.
ఇక్కడ మరో ఆసక్తికరమైన ఆచారం కూడా ఉంది. మహిళలు తనకు నచ్చిన ఒకే పురుషుడితో జీవితాంతం ఉండాలనే నియమం లేదు. తనకు నచ్చిన వారితో ఎవరితోనైనా ఏకాంతంగా గడపొచ్చు. ఈ సంప్రదాయాన్ని ‘యాక్సియా’ అని పిలుస్తారు. ఒకవేళ ఆ పురుషుడి వల్ల మహిళ గర్భం దాల్చితే, దాన్ని వాకింగ్ మ్యారేజ్‌గా పరిగణిస్తారు. యాక్సియా సమయంలో, స్త్రీ తన ఇంటి ముందు పురుషుడి టోపీని తగిలిస్తుంది. దీని అర్థం ఇతర పురుషులు తన ఇంట్లోకి ప్రవేశించకూడదని. ఇది ఒకరికొకరు గౌరవం ఇచ్చుకునే పద్ధతిని సూచిస్తుంది.
మొసువో తెగ ప్రపంచం మన పురుషాధిక్య సమాజాలకు పూర్తిగా భిన్నం. ఇక్కడ ఆస్తి వారసత్వం పూర్తిగా స్త్రీలకు మాత్రమే చెందుతుంది. లైంగిక స్వేచ్ఛ కూడా నియంత్రణ లేకుండా కాకుండా, ఒక పద్ధతిలో సాగుతుంది. అలాగే, వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవిస్తారు.
ప్రస్తుతం, మొసువోలో పరిస్థితులు మారుతున్నాయి. చైనా ప్రభుత్వం ఈ గ్రామాలకు రహదారులు, ఇతర మౌలిక వసతులను కల్పించింది. ఈ తెగ ప్రజలు కొందరు చైనాలోని వివిధ నగరాలకు వలస వెళ్లారు, బయటి ప్రపంచంతో వారి సంబంధాలు పెరుగుతున్నాయి. అయితే, వాకింగ్ మ్యారేజ్ సంప్రదాయం మాత్రం ఇంకా కొనసాగుతోంది. బయటి ప్రపంచంలో వైవాహిక జీవితాల గురించి వారికి ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. మొసువో తెగ ఒక అద్భుతమైన సామాజిక నమూనా అనే చెప్పొచ్చు. ఇది కుటుంబం, సంబంధాల గురించి మనకున్న సాధారణ ఆలోచనలను ప్రశ్నిస్తుంది.