Just SportsLatest News

T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో సంచలనం..నేపాల్ కు షాకిచ్చిన ఇటలీ

T20 World Cup : చరిత్రలో ఈ రోజు (ఫిబ్రవరి 12) చిరస్మరణీయంగా నిలిచిపోనుంది.ఇటలీ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తమ కంటే మెరుగైన నేపాల్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది.

T20 World Cup

భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచకప్(T20 World Cup) లో చిన్న జట్లు అదరగొడుతున్నాయి. పెద్ద జట్లకు గట్టి పోటీనిస్తున్న పసికూనలు తమ పై స్థాయి జట్లపైనా సంచలన విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా ఇటలీ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తమ కంటే మెరుగైన నేపాల్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ యూరోపియన్ టీమ్ తొలిసారిగా ప్రపంచకప్ లో తొలి విజయాన్ని రుచి చూసింది. ఇటలీ క్రికెట్ లో వరల్డ్ కప్ కు అర్హత సాధించడమే తొలిసారి. యూరోపియన్‌ క్వాలిఫయర్స్‌ లో అద్భుత ప్రదర్శన కనబరిచి టీ20 ప్రపంచకప్‌ 2026 బెర్త్‌ దక్కించుకుంది.

అరంగేట్రం చేసిన తొలి ఎడిషన్ లోనే ఆడిన రెండో మ్యాచ్‌లో ఇలాంటి అద్భుత విజయం సాధించడం గొప్ప విషయమే. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇటలీ 10 వికెట్ల తేడాతో నేపాల్ ను చిత్తు చేసింది. నేపాల్ ప్రపంచకప్ ఆడడం ఇది మూడోసారి. తమ తొలి మ్యాచ్ లో నేపాల్ అగ్రశ్రేణి జట్టు ఇంగ్లాండ్ ను దాదాపు ఓడించినంత పని చేసింది. అలాంటి జట్టుపై ఇటలీ గెలవడం అంటే మామూలు విషయం కాదు.

మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇటలీ తమ రెగ్యులర్ కెప్టెన్, కీలక ఆటగాడు మ్యాడ్ సన్ లేకుండానే ఈ మ్యాచ్ ఆడింది. స్కాట్లాండ్ పై ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన మ్యాడ్ సన్ టోర్నీకి దూరమయ్యాడు. ఈ పరిస్థితుల్లో ఇటలీ నేపాల్ పై అన్ని విభాగాల్లోనూ అదరగొట్టేసింది. బౌలింగ్ , ఫీల్డింగ్ , బ్యాటింగ్ లలో తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇటలీ నేపాల్ ను 123 పరుగులకే పరిమితం చేసింది. ఆ జట్టు స్పిన్నర్లు సమిష్టిగా రాణించి నేపాల్ బ్యాటర్లను తిప్పేశారు. అసలు క్రీజులో నిలదొక్కుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆరిఫ్ షేక్ చేసిన 27 పరుగులే నేపాల్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోర్ గా ఉంది.

T20 World Cup
T20 World Cup

కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌, దీపేంద్ర సింగ్‌ ఎయిరీ , కరణ్‌ కేసి పర్వాలేదనిపించారు. తర్వాత 124 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుందామనుకున్న నేపాల్ బౌలర్లకు ఇటలీ ఓపెనర్లు, అన్నదమ్ములు మోస్కా బ్రదర్స్ ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. నేపాల్ బౌలర్లను ఉతికారేశారు. ఫోర్లు, సిక్సర్లతో వీరిద్దరూ విరుచుకుపడ్డారు. ఫలితంగా ఇటలీ కేవలం 12.4 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. జస్టిన్‌ మోస్కా 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60.. ఆంథొని మోస్కా 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో మోస్కా బ్రదర్స్‌ చరిత్ర సృష్టించారు.

టీ20 ప్రపంచకప్‌(T20 World Cup) చరిత్రలో 100 పరుగులకు పైగా పార్టనర్ షిప్ నెలకొల్పిన అన్నదమ్ముల జోడీ రికార్డులకెక్కారు. కాగా ఈ విజయంతో ఇటలీ గ్రూపులో మిగిలిన జట్లకు టెన్షన్ పెంచిందనే చెప్పాలి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button