Anemia:సైలెంట్‌గా అటాక్ చేసే రక్తహీనత.. చెక్ పెట్టే సీక్రెట్ ఫుడ్స్ ఇవే
Anemia: రక్తహీనతను నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఏకాగ్రత లోపం వరకు అనేక తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయంటున్నారు డాక్టర్లు.

Anemia
ఆఫీసులో పని చేస్తూ ఉన్నట్టుండి తల తిరుగుతుందా? రోజంతా నిద్రపోయినా ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తోందా? తరచుగా చిన్న చిన్న పనులకే ఆయాసం వస్తోందా? ఇవి కేవలం అలసట లక్షణాలు మాత్రమే కాదు, శరీరంలో రక్తహీనత (అనీమియా) పెరుగుతుందని సూచించే సంకేతాలు. మనలో చాలామంది ఈ లక్షణాలను తేలికగా తీసుకుంటారు. కానీ, ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఏకాగ్రత లోపం వరకు అనేక తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయంటున్నారు డాక్టర్లు.
అసలు రక్తహీనత (Anemia)ఎందుకు వస్తుందంటే..మన శరీరంలోని పెద్ద ఎముకల్లో హీమోగ్లోబిన్ అనే కీలకమైన ప్రొటీన్ తయారవుతుంది. ఈ ప్రక్రియకు ఐరన్ అనేది ప్రధాన పోషకం. శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉంటే, హీమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.దీనివల్ల రక్తం శరీరంలోని అన్ని భాగాలకు, కణాలకు తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయలేదు. ఆక్సిజన్ సరఫరా తగ్గితే మన శరీరం బలహీనపడి, పై లక్షణాలన్నీ కనిపిస్తాయి. మన చర్మం పాలిపోవడం, నాలుక, అరిచేతులు, గోళ్లు తెల్లగా మారడం కూడా హిమోగ్లోబిన్ లోపానికి ప్రధాన సూచనలు.
రక్తహీనత(Anemia)ను నివారించడానికి, పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అత్యంత కీలకం.ముఖ్యంగా ఆకుపచ్చని ఆకుకూరలు తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర, తోటకూర, మెంతికూర, గోంగూర వంటి తాజా ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో ఐరన్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి.
పండ్లలో దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లలో ఐరన్‌తో పాటు విటమిన్స్ కూడా ఉంటాయి. దానిమ్మలో సోడియం, మెగ్నీషియం, పొటాషియం వంటివి కూడా ఉండడం వల్ల రక్తవృద్ధికి ఎంతో సహాయపడుతుంది. ఒక ఆపిల్ రోజూ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదని పెద్దలు అంటుంటారు.

కూరగాయలలో ఎర్రగా కనిపించే బీట్‌రూట్ రక్తహీనతను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ శాతం, రక్తాన్ని వృద్ధి చేయడంలో దోహదపడుతుంది.
మాంసాహారులైతే మేక మాంసం, కోడి మాంసం, చేపలను తరచుగా తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్గాన్ మీట్స్, లివర్లో ఐరన్, విటమిన్ బి12, జింక్, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే, బోన్ సూప్ కూడా దీనికి ఒక మంచి పరిష్కారం.
ఖర్జూరాలు, బాదం, వాల్‌నట్స్ వంటి ఎండుఫలాలను రోజూ తింటే ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే, నువ్వులు, పల్లీలను బెల్లంతో కలిపి లడ్డూలుగా తీసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ ఆహారపు చిట్కాలను పాటిస్తూ, క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు చేయడం వల్ల రక్తహీనత(Anemia) సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఒకవేళ లక్షణాలు తీవ్రంగా ఉంటే, వైద్యుడిని సంప్రదించి సరైన సలహా తీసుకోవడం అవసరం.