Clay Pots:మోడ్రన్ కిచెన్‌లో మట్టి పాత్రల సందడి..మళ్లీ ఎందుకు ఇవి ట్రెండ్ అవుతున్నాయి?
Clay Pots: ఒకప్పుడు పల్లెటూళ్లకే పరిమితమైన మట్టి పాత్రలు, మట్టి కుండలు ఇప్పుడు సిటీల్లోని మోడ్రన్ కిచెన్లలోనూ తళుక్కుమంటున్నాయి.
Clay Pots
నైలాన్ గరిటెలు, నాన్-స్టిక్ పాన్లు, మైక్రోవేవ్ ఓవెన్ల కాలంలో కూడా మళ్లీ మట్టి పాత్రలు(Clay Pots) మన వంటగదిలోకి అడుగుపెడుతున్నాయి. ఒకప్పుడు పల్లెటూళ్లకే పరిమితమైన ఈ మట్టి పాత్రలు, మట్టి కుండలు ఇప్పుడు సిటీల్లోని మోడ్రన్ కిచెన్లలోనూ తళుక్కుమంటున్నాయి. అసలు టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా అంతా వెనక్కి ఎందుకు వెళ్తున్నారు? ఆరోగ్య నిపుణులు అన్నట్లు మట్టి పాత్రల్లో వండిన ఆహారం అమృతంలా ఎందుకు ఉంటుందో.. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
పోషకాలు భద్రం (Retention of Nutrients)..మట్టి పాత్రలు వేడిని సమానంగా ప్రసరింపజేస్తాయి. లోహపు (Metal) పాత్రల్లో వండినప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల ఆహారంలోని పోషకాలు నశిస్తాయి. కానీ, మట్టి పాత్రలు నెమ్మదిగా వేడెక్కుతాయి. దీనివల్ల ఆహారంలోని తేమ ఆవిరి కాకుండా లోపలే ఉండి విటమిన్లు, ఖనిజాలు అలాగే ఉంటాయి.
తక్కువ నూనెతో వంట..మట్టి పాత్రలకు ఉండే సహజమైన గుణం వల్ల, వంట చేసేటప్పుడు ఆహారం అడుగంటదు. దీనివల్ల మనం వాడే నూనె పరిమాణం కూడా చాలా వరకూ తగ్గుతుంది.ఇది గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వరం అంటారు నిపుణులు.
అల్కలీన్ గుణం (pH Balance)..మట్టికి సహజంగానే ‘అల్కలీన్’ (Alkaline) గుణం ఉంటుంది. మనం వండే ఆహారంలో యాసిడ్ అంటే ఆమ్లం ఎక్కువగా ఉంటే, మట్టి పాత్ర ఆ యాసిడ్‌తో రియాక్టయ్యి ఆహారం యొక్క pH విలువను సమన్వయం చేస్తుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ రాకుండా ఉంటాయట.

ప్రత్యేకమైన సువాసన.. మట్టి పాత్రలో వండిన పప్పు అయినా, చేపల పులుసు అయినా కూడా ఆ రుచే వేరు. మట్టికి ఉండే మట్టి వాసన (Earthiness) ఆహారానికి అదనపు రుచిని, మంచి సువాసనను ఇస్తుంది. ఇది ఏ లోహపు పాత్రలోనూ మనకు దొరకదంటారు నిపుణులు.
మోడ్రన్ కిచెన్‌లో మట్టి పాత్రల(Clay Pots) నిర్వహణ ఎలానో చాలామందికి సరిగ్గా తెలియదు. ఇంకా చెప్పాలంటే మట్టి పాత్రలు వాడటానికి భయపడతారు. అవి త్వరగా పగిలిపోతాయని లేదా క్లీన్ చేయడం కష్టమని అనుకుంటారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం గ్యాస్ స్టవ్‌ల మీద కూడా వాడగలిగేలా గట్టిపరిచిన మట్టి పాత్రలు అందుబాటులోకి వచ్చేసాయి. అయితే వీటిని సోప్ వాటర్ కాకుండా, కేవలం వేడి నీరు , నిమ్మరసంతో శుభ్రం చేస్తే సరిపోతుంది.
అమ్మమ్మల కాలం నాటి పద్ధతులను పాటించడం వెనుక పక్కా శాస్త్రీయ కోణం ఉంది. ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వారంతా మోడ్రన్ కిచెన్‌లో మట్టి పాత్రలకు చోటు కల్పిస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ పాతని కొత్తగా మార్చుకోవడమే నిజమైన ట్రెండ్ అని ఫాలో అయిపోతున్నారు.



