Just LifestyleHealthLatest News

Doomscrolling:డూమ్ స్క్రోలింగ్ అంటే తెలుసా? మీకూ ఉంటే మాత్రం అర్జంటుగా చెక్ పెట్టండి..

Doomscrolling: సోషల్ మీడియాలో నెగటివ్ వార్త కనిపించగానే మన లోపల ఉండే అప్రమత్తత వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది.

Doomscrolling

ప్రస్తుత డిజిటల్ యుగంలో మనందరికీ ఒక అలవాటు కామన్‌గా మారిపోయింది . ఉదయం నిద్రలేవగానే మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకోవడం, సోషల్ మీడియా ఓపెన్ చేయడం సహజమే. అయితే పావుగంటో, అరగంటో అయితే ఓకే కానీ ఆవేళ్లు తమకు తెలీకుండానే మొబైల్ స్క్రీన్‌ను స్క్రోల్ చేస్తూనే ఉంటాయి.
అందులోనూ ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగిందనో,కొత్త రకం వ్యాధులు వస్తున్నాయనో చదివినప్పుడు, మనసు భయపడినా చూడకుండా ఆపలేం. ఇలా గంటల గంటలు చెడు వార్తలను, భయపెట్టే వీడియోలను చూస్తూ ఉండటాన్నే… మనస్తత్వ శాస్త్రంలో డూమ్ స్క్రోలింగ్ (Doomscrolling)అని పిలుస్తారు. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, మన మెదడును చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేసే ఒక మానసిక ఉచ్చు అని చెప్పొచ్చు.

మన మెదడు పరిణామ క్రమంలో ప్రమాదాల పట్ల చాలా అలర్ట్‌గా ఉండటం అలవాటు చేసుకుంది. పూర్వకాలంలో అడవిలో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే దాన్ని తెలుసుకోవడం వారి ప్రాణరక్షణకు అవసరం అయ్యేది. ఇప్పుడు అడవులు లేకపోయినా మన మెదడు మాత్రం అదే పాత పద్ధతిలోనే పనిచేస్తోంది.

అందుకే సోషల్ మీడియాలో నెగటివ్ వార్త కనిపించగానే మన లోపల ఉండే అప్రమత్తత వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఆ ప్రమాదం గురించి ఇంకా తెలుసుకోవాలి, దాని నుంచి మనం ఎలా తప్పుకోవాలో అర్థం చేసుకోవాలనే కుతూహలంతో ఆ వార్తలను మరీ మరీ చదివేలా చేస్తుంది. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. మనం చదివే ఆ నెగటివ్ వార్తల వల్ల మనకు రక్షణ దొరకకపోగా, మనలో ఆందోళన , ఒత్తిడి కలిగించే హార్మోన్లు విపరీతంగా విడుదలవుతాయి.

అంతేకాదు ఈ డూమ్ స్క్రోలింగ్(Doomscrolling) వల్ల కలిగే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్‌గా భయపెట్టే వార్తలను చూడటం వల్ల నిద్ర కరువవుతుంది. రాత్రి పడుకునే ముందు ఇలాంటివి చదవడం వల్ల మెదడు విశ్రాంతి తీసుకోలేక సరిగా నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇది కాలక్రమేణా డిప్రెషన్ లేదా తీవ్రమైన ఆందోళనకు దారితీసే అవకాశముందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

Doomscrolling
Doomscrolling

ప్రపంచం అంతా డేంజర్లో ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే అభద్రతా భావం ఇలాంటివారిలో పెరిగిపోతుంది. దీనివల్ల రెగ్యులర్ లైఫ్‌లో చిన్న చిన్న పనులపై కూడా ఆసక్తి తగ్గిపోతుంది. మన చుట్టూ ఉన్నవారితో గడిపే టైమ్‌ను కూడా ఈ ఫోన్ స్క్రీన్ మింగేస్తుంది.

దీని నుంచి బయటపడటానికి కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. మొదటగా ఇలాంటి వార్తలను చదవడానికి లేదా సోషల్ మీడియా చూడటానికో ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. ముఖ్యంగా పడుకోవడానికి కనీసం అర గంట ముందు అయినా ఫోన్‌ను పక్కన పెట్టేయాలి. మీ ఫోన్‌లో మీరు ఎక్కువగా చూస్తున్న నెగటివ్ కంటెంట్ ఇచ్చే పేజీలను లేదా ఛానెళ్లను అన్-ఫాలో చేయాలి.

ఇష్టమైన పుస్తకాలు చదవడమో లేదా ప్రకృతిలో నడవడం వంటివి అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన మెదడుకు కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ అందుతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అందరికీ అవసరమే, కానీ అది మీ మనశ్శాంతిని బలి ఇచ్చి మాత్రం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button