Copper:రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి..
Copper: రాగి పాత్రలో నీరు తాగడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అవి తెలియకపోతే ఆరోగ్యానికి లాభం కంటే నష్టమే ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు.
Copper
కరోనా తర్వాత చాలామందిలో హెల్త్ మీద విపరీతమైన శ్రద్ధ పెరిగింది.తినే తిండి నుంచి వాడే పాత్రల వరకూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ప్లాస్టిక్ బాటిల్స్ , బిందెలు, అల్యూమినియం పాత్రలు పక్కన పెట్టి రాగి (Copper)పాత్రలో నీళ్లు తాగుతున్నారు.
ఆయుర్వేదం ప్రకారం రాగి(Copper) పాత్రలో నీళ్లు తాగడం వల్ల శరీరంలోని మూడు దోషాలు (వాత, పిత్త, కఫ) సమతుల్యంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్ బాటిళ్లను వదిలి రాగి బాటిళ్లను వాడుతున్నారు. అయితే రాగి పాత్రలో నీరు తాగడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అవి తెలియకపోతే ఆరోగ్యానికి లాభం కంటే నష్టమే ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు.
రాగి పాత్ర(Copper)లో నీళ్లు కనీసం 8 గంటల పాటు నిల్వ ఉంచితేనే ఆ నీటిలోని కాపర్ అయాన్లు..ఆ నీటిలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది.

కొంతమంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే, రాగి పాత్రలో ఉన్న నీటిని తీసుకుని దానిలో నిమ్మరసం లేదా తేనె కలుపుకుని తాగుతారు. రాగి అనేది సిట్రిక్ యాసిడ్‌తో వెంటనే చర్య జరుపుతుంది. దీనివల్ల కడుపులో మంట, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.
అలాగే రోజు మొత్తం కూడా అలా రాగి నీటినే తాగకూడదు. శరీరంలో కాపర్ శాతం ఎక్కువైతే లివర్ , కిడ్నీలపైన ఒత్తిడి పెరుగుతుంది. రోజుకు కేవలం రెండు గ్లాసుల రాగి పాత్రలో నీళ్లు తాగితే సరిపోతుంది. ముఖ్యంగా రాత్రిపూట రాగి పాత్రలో నీరు పోసి, ఉదయం ఖాళీ కడుపుతో తాగడం అత్యంత ఉత్తమమైన పద్ధతి అంటారు నిపుణులు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రాగి పాత్రలను శుభ్రం చేసేటప్పుడు లోపల నల్లగా మారుతుంది. ఇది సహజమైన ప్రక్రియే కానీ, దాన్ని ఎప్పటికప్పుడు చింతపండు , నిమ్మకాయతో శుభ్రం చేస్తూ ఉండాలి. నల్లగా అయిన పాత్రలో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. సరైన పద్ధతిలో రాగి నీటిని తీసుకుంటేనే అది మీ రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని కాంతివంతంగా మార్చగలదు.



