Heart attack: కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ ఒకటి కాదా? రెండింటి మధ్య తేడాలను ఎలా గుర్తించాలి?
Heart attack: హార్ట్ ఎటాక్ అనేది రక్త ప్రసరణ సమస్య కాగా, కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ సమస్య.

Heart attack
కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest) , హార్ట్ ఎటాక్ (Heart Attack) అనే రెండు పదాలు తరచుగా వినిపిస్తున్నా, చాలా మంది వీటిని ఒకటిగానే భావిస్తుంటారు. నిజానికి, ఈ రెండూ వేర్వేరు గుండె సమస్యలు. హార్ట్ ఎటాక్(Heart attack) అనేది రక్త ప్రసరణ సమస్య కాగా, కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ సమస్య.
హార్ట్ అటాక్ (Blood Flow Problem)..కరోనరీ రక్తనాళంలో అడ్డంకి లేదా బ్లాక్ ఏర్పడినప్పుడు, గుండెకు రక్తం చేరడం ఆగిపోతుంది. దీని కారణంగా తీవ్రమైన నొప్పి వచ్చి, గుండె పనిచేయడం మానేస్తుంది. ఇదే హార్ట్ అటాక్. సరైన సమయంలో చికిత్స అందకపోతే మరణం సంభవించవచ్చు
హార్ట్ ఎటాక్ లక్షణాలు..గుండె బాగా బరువుగా అనిపించడం,ఎడమ వైపు చేయి లాగడం,శ్వాస అందకపోవడం లేదా ఇబ్బందిగా ఉండటం, విపరీతంగా చెమటలు పట్టడం,వికారంగా అనిపించడం, నడిచినా, బరువులు ఎత్తినా ఛాతిలో నొప్పి రావడం, విశ్రాంతి తీసుకుంటే తగ్గడం.
కార్డియాక్ అరెస్ట్ అంటే… (Electrical Problem)..గుండెలో ఏర్పడే ఎలక్ట్రిక్ అలజడి లేదా అంతరాయం కారణంగా కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది. ఉన్నఫలంగా గుండె కొట్టుకునే వేగం విపరీతంగా పెరిగిపోయి, అది శరీర భాగాలకు రక్తాన్ని పంపు చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీంతో మనిషి అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకుంటాడు. దురదృష్టవశాత్తూ, కార్డియాక్ అరెస్ట్‌కు ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. ఇది సడెన్‌గా వస్తుంది, అందుకే ఎక్కువ మంది మరణిస్తారు.
గ్యాస్ట్రిక్ నొప్పి vs గుండె నొప్పి: ఛాతిలో వచ్చే ప్రతి నొప్పి గుండె సమస్య కాకపోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల కూడా ఛాతిలో నొప్పి వస్తుంది. గ్యాస్ట్రిక్ నొప్పి యాంటాసిడ్స్ వాడితే తగ్గిపోతుంది. కానీ, శారీరక శ్రమ (నడవడం, వ్యాయామం, బరువులు ఎత్తడం) చేసినప్పుడు నొప్పి పెరిగి, రెస్ట్ తీసుకుంటే తగ్గే నొప్పిని గుండె సమస్యగా పరిగణించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.

గుండె సమస్యలు వయసు మీద పడుతున్న వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మగవాళ్లకు, 50 ఏళ్లు పైబడిన ఆడవాళ్లకు రిస్క్ ఎక్కువ. అయితే, ఇటీవల 30 ఏళ్ల లోపు యువతలోనూ గుండె సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన అలవాట్లు, అలాగే జెనెటిక్ లోపం. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఊబకాయం (Obesity), పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
గుండె సమస్యలు మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి, ఛాతిలో నొప్పి, గుండె భారంగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తికి వెంటనే ఛాతి మీద చేతులు పెట్టి గట్టిగా నొక్కే సీపీఆర్ (CPR) ఇవ్వడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది.
గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే.. అతిగా తినకుండా, మితంగా, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.రోజూ ఒక అరగంట వ్యాయామం, మెడిటేషన్ చేయడం అవసరం. మరీ బరువులు ఎత్తే వ్యాయామాలు (Weight Lifting) గుండెపై ఒత్తిడి పెంచుతాయి, వాటికి దూరంగా ఉండాలి.
మానసిక ఒత్తిడి (Mental Stress) పెరగకుండా చూసుకోవాలి. పొగతాగడం, మద్యపానం వంటి ఆరోగ్యానికి హానిచేసే అలవాట్లకు దూరంగా ఉండాలి.
బరువు పెరగడానికి లేదా తగ్గడానికి ఎలాంటి సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ వాడకూడదు. బీపీ, షుగర్లను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. మీ కుటుంబంలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే, మీరు కూడా ముందుగానే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.