Morning Habits:ప్రశాంతమైన రోజు కోసం.. ఉదయం నిద్రలేవగానే ఈ పనులు తప్పకుండా చేయండి
Morning Habits: మీ రోజును ఉత్సాహంగా , అందంగా మార్చుకోవడానికి ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పనిసరిగా కొన్ని మంచి అలవాట్లను అనుసరించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Morning Habits
మీరు రోజును ఎలా ప్రారంభిస్తారనే దానిపైనే ఆ రోజంతా మీ ఆలోచనలు, శక్తి స్థాయి , ఉత్సాహం ఆధారపడి ఉంటుంది. అందుకే, మీ రోజును సానుకూలంగా, ఉత్సాహంగా , అందంగా మార్చుకోవడానికి ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పనిసరిగా కొన్ని మంచి అలవాట్ల(Morning Habits)ను అనుసరించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు
మొబైల్ ఫోన్ వైపు చూడకండి (డిజిటల్ డిటాక్స్).. ఉదయం నిద్రలేవగానే మొబైల్ చూడటం అనేది మీ ఉదయపు ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేస్తుంది. కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే అనుకుని ఫోన్ పట్టుకుంటే, అది సోషల్ మీడియా నోటిఫికేషన్లు, ఈమెయిళ్లు లేదా వార్తల ద్వారా మీ మార్నింగ్ టైమ్‌ను త్వరగా లాగేసుకుంటుంది.
ఇది వెంటనే మీలో ఒత్తిడిని (Stress) , హడావుడి వాతావరణాన్ని సృష్టిస్తుంది. నిద్ర లేవగానే మొబైల్ చూడకుండా ఉండటం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది.
ధ్యానం, ప్రశాంతత (Mindfulness).. నిద్ర లేచిన వెంటనే ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఉదయం మనస్సు రిలాక్స్‌గా , నిశ్చలంగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో చేసే ధ్యానం పరధ్యానాలను నివారిస్తుంది. ఇది మీకు స్పష్టమైన ఆలోచనలు, మానసిక ఉల్లాసం , ఒత్తిడి లేకుండా రోజువారీ పనులు చేయడానికి మానసికంగా సిద్ధం చేస్తుంది. ఉదయపు ప్రశాంత వాతావరణం రోజంతా మీ మానసిక స్థితిని (Mood) సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.

తప్పకుండా నీరు తాగండి (హైడ్రేషన్).. రాత్రంతా నిద్రలో శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం చాలా ముఖ్యం. ఇది శరీరం నుండి విష వ్యర్థాలను (Toxins) తొలగించడంలో సహాయపడుతుంది, జీవక్రియ (Metabolism)ను పెంచుతుంది అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మరసం లేదా కొద్దిగా అల్లం కలిపి తాగడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.
చిన్న వ్యాయామం లేదా వాకింగ్..ఉదయాన్నే వ్యాయామం చేయడం లేదా కనీసం 20 నిమిషాలు వాకింగ్, జాగింగ్ వంటి చిన్నపాటి శారీరక శ్రమ చేయడం అలవాటు చేసుకోండి. ఇది శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఎండార్ఫిన్ల (Endorphins) విడుదలను ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్లు మీ మానసిక స్థితిని మెరుగుపరచి, రోజును కొత్త ఉత్సాహంతో ప్రారంభించడంలో సహాయపడతాయి.
కెఫీన్ జాగ్రత్తలు & ఆరోగ్యకరమైన అల్పాహారం..ఖాళీ కడుపుతో కెఫిన్ వద్దు. కొంతమంది నిద్ర లేచిన వెంటనే కాఫీ/టీ తాగుతారు. ఖాళీ కడుపుతో కెఫిన్ తాగడం వల్ల కడుపు ఉబ్బరం , అసిడిటీ (Acid Reflux) వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముందుగా గోరు వెచ్చని నీరు తీసుకుని..తర్వాత ఏదైనా అల్పాహారం తీసుకోవడం మంచిది.
బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే కడుపు ఉబ్బరం, అల్సర్ వంటి సమస్యలు రావచ్చు. ప్రోటీన్లు (Protein) , ధాన్యాలు (Whole Grains) కలిగిన ఆహారాలు తినడం వల్ల శరీరానికి రోజంతా అవసరమయ్యే శక్తి అందుతుంది.



