HealthJust LifestyleLatest News

Salt: మీరు తినే ఉప్పు..నిజంగా స్లో పాయిజన్‌లా మారుతోందా?

Salt: ఎక్కువ ఉప్పు కేవలం రక్తపోటును మాత్రమే పెంచదు. అది శరీరంలోని ముఖ్య అవయవాలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది.

Salt

రుచి కోసం ఉప్పు ఎంత అవసరమో, అది మన శరీరానికి ఎంత హానికరమో చాలామందికి తెలీదు. ఒకప్పుడు చక్కెర కంటే ఉప్పు (Salt) డేంజర్ అనే మాట సరదాగా ఉండేది, కానీ ఇప్పుడు అది వాస్తవమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఉప్పును ఎందుకు తగ్గించుకోవాలో, తగ్గించకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

మూత్రపిండాలపై భారం పడుతుంది. మనం రోజుకు 10 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తింటే, మన మూత్రపిండాలు ఆ ఉప్పు మొత్తాన్ని బయటకు పంపలేవు. అప్పుడు ఉప్పు (Salt) రక్తంలోనే పేరుకుపోయి దాని గాఢతను పెంచుతుంది.

రక్తం గాఢత పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి శరీరంలో నీరు చేరుతుంది. దీనివల్ల రక్త పరిమాణం పెరిగి, గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. గుండె మరింత గట్టిగా, వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది.

రక్తనాళాలు ఈ ఒత్తిడికి తట్టుకోడానికి మొదట వ్యాకోచిస్తాయి. కానీ ఎక్కువ ఒత్తిడి వల్ల సాగే గుణం కోల్పోయి కుచించుకుపోతాయి. బెర్నౌలి నియమం ప్రకారం, రక్తనాళం వ్యాసం తగ్గితే ఒత్తిడి నాలుగు రెట్లు పెరుగుతుంది.

రక్తనాళాలపై పెరిగిన ఒత్తిడిని తట్టుకోడానికి గుండె కండరాలు లావుగా తయారవుతాయి. దీనివల్ల గుండె గదిలో రక్తం పంప్ చేసే స్థలం తగ్గిపోయి, గుండెకు రక్తం సరఫరా తగ్గుతుంది.

చిన్నపాటి శారీరక శ్రమ చేసినా గుండెకు రక్తం సరిపోక ఛాతీలో నొప్పి మొదలవుతుంది. క్రమంగా గుండెపోటు, మెదడులో రక్తనాళాలు పగిలి పక్షవాతం, చివరికి మతిమరుపు వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

ఎక్కువకాలం అధిక ఉప్పుతో మూత్రపిండాలు వాటి సామర్థ్యాన్ని మించి పనిచేసి అలసిపోతాయి. దీనివల్ల రక్తం వడకట్టడం ఆగిపోయి, నీరు శరీరంలోనే పేరుకుపోతుంది. అలాగే, ఊపిరితిత్తులు కూడా అలసిపోయి పనిచేయడం మానేస్తాయి, దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

వైద్యులు సూచించిన దాని ప్రకారం, మనం రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. కానీ చాలామంది 10 గ్రాములకు పైగానే తింటారు. దీనికోసం వంట చేసేటప్పుడు కావాల్సినంత ఉప్పు కాకుండా, కాస్త తక్కువ వేయడం అలవాటు చేసుకోండి. నెమ్మదిగా మీ రుచి మొగ్గలు అలవాటుపడతాయి.

కూరలు, చారుల్లో ఉండే ఉప్పు మాత్రమే సరిపోతుంది. మళ్లీ మజ్జిగ, పెరుగులో ఉప్పు కలుపుకోవడం మానేయండి. కొన్ని వంటకాల్లో ఉప్పుకు బదులు నిమ్మకాయ, మిరియాల పొడి వంటివి వాడి రుచిని పెంచుకోవచ్చు.

తెలుగువారికి ఆవకాయ, నిల్వ పచ్చళ్లు అంటే ఇష్టం. కానీ వీటిలో అధిక ఉప్పు(Salt) ఉంటుంది. అందుకే వారానికి ఒకసారి మాత్రమే తినండి. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పాప్‌కార్న్ వంటి వాటికి దూరంగా ఉండండి. వాటిలో కనిపించని ఉప్పు చాలా ఉంటుంది.

చివరిగా, ఎక్కువ ఉప్పు కేవలం రక్తపోటును మాత్రమే పెంచదు. అది శరీరంలోని ముఖ్య అవయవాలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button