DISC:ఇందులో మీరు ఏ టైప్ వ్యక్తులు? ప్రతీ ఒక్కరూ దీనిగురించి తెలుసుకోవాల్సిందే!
DISC : మనుషుల ప్రవర్తనలో ఇన్ని తేడాలెందుకు ఉంటాయి? ముందుగా మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎదుటివాళ్ల మనస్తత్వాన్ని ఎలా కనిపెట్టాలి?
DISC
ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకేలా ఉండరు. ఒకరు ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఉంటే, మరొకరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఒకరు అందరితో బాగా కలిసిపోతే, ఇంకొకరు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. అసలు మనుషుల ప్రవర్తనలో ఇన్ని తేడాలెందుకు ఉంటాయి? ముందుగా మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎదుటివాళ్ల మనస్తత్వాన్ని ఎలా కనిపెట్టాలి? వీటన్నిటికీ సమాధానమే ‘DISC’ ప్రొఫైల్ అంటారు సైకాలజిస్టులు.
విలియం మౌల్టన్ మార్స్టన్ అనే సైకాలజిస్ట్ 1928లో ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ DISC మోడల్‌నే వాడుతున్నాయి. DISC అంటే నాలుగు రకాల ప్రవర్తనా శైలుల కలయిక అవేంటంటే D (Dominance), I (Influence), S (Steadiness), C (Conscientiousness). వీటి గురించి అందరూ వివరంగా తెలుసుకుంటే మంచిది.
Dominance.. ఆధిపత్యం – D టైప్.. వీరు చాలా ధైర్యవంతులు అలాగే ఫలితాలను ఆశించే వ్యక్తులు. వీరికి సవాళ్లు అంటే చాలా ఇష్టం. ఏదైనా పనిని వేగంగా పూర్తి చేయాలని చూస్తారు. వీరు నేరుగా విషయానికి వచ్చేస్తారు (Direct). వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వీరు కొన్నిసార్లు ఎదుటివారి భావాలను పట్టించుకోకుండా కఠినంగా వ్యవహరిస్తారు. నేను అనుకున్నది జరగాలనే తత్వం వీరిలో కనిపిస్తుంది. ఒక టీమ్‌లో వీరు ఉంటే పనులు వేగంగా జరుగుతాయి, కానీ తోటివారితో ఘర్షణలు వచ్చే అవకాశం ఉంటుంది.
Influence..ప్రభావం – I టైప్..వీరు చాలా ఉత్సాహవంతులు. అందరితో ఇట్టే కలిసిపోతారు (Out-going). వీరిని పీపుల్ పర్సన్స్ అని పిలవొచ్చు. మాటలతో ఎదుటివారిని వీరు ఇట్టే ఆకట్టుకుంటారు. వీరు ఎక్కడున్నా అక్కడ నవ్వులు పూయిస్తారు. వీరిలో ఆశావాదం (Optimism) ఎక్కువగా ఉంటుంది. అయితే, వీరిలో ఒక బలహీనత కూడా ఉంటుంది. అది వివరాలపై దృష్టి పెట్టకపోవడం. వీరు పని కంటే రిలేషన్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. విమర్శలను వీరు అస్సలు తీసుకోలేరు, అందరూ తమను ఇష్టపడాలని కోరుకుంటారు.

Steadiness స్థిరత్వం – S టైప్.. వీరు చాలా ప్రశాంతమైన,నమ్మదగ్గ వ్యక్తులు. ఏ పనినైనా నిలకడగా చేస్తుంటారు. వీరు మంచి వినే గుణం (Listeners) ఉన్నవారు. గొడవలకు దూరంగా ఉంటారు. టీమ్ వర్క్‌ను ఇష్టపడతారు. వీరు మార్పును (Change) త్వరగా అంగీకరించలేరు. జీవితంలో రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. ఎవరైనా తమను హడావిడి చేస్తే వీరు ఒత్తిడికి గురవుతారు. వీరివల్ల సమాజంలో లేదా ఆఫీసులో ఒక రకమైన బ్యాలెన్స్ ఉంటుంది. వీరు అందరికీ చాలా విధేయులుగా ఉంటారు.
Conscientiousness- నిబద్ధత – C టైప్..వీరు కచ్చితత్వాన్ని ఇష్టపడే వ్యక్తులు (Analytical). వీరికి క్వాలిటీ ముఖ్యం. ఏ పని చేసినా రూల్స్ ప్రకారం, పక్కాగా ఉండాలని కోరుకుంటారు. డేటా, లాజిక్ , ఫ్యాక్ట్స్ మీద వీరు ఆధారపడతారు. వీరు చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు, అంటే తక్కువగా మాట్లాడుతారు. వీరు చేసే పనుల్లో తప్పులు వెతకడం కష్టం. అయితే, వీరు అతిగా ఆలోచించడం (Overthinking) వల్ల కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. వీరిని ‘పర్ఫెక్షనిస్ట్’ అని పిలవొచ్చు.
అసలీ DISC ప్రొఫైల్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే..ఈ DISC ప్రొఫైల్ గురించి తెలుసుకోవడం వల్ల మన పర్సనల్ లైఫ్‌లో , కెరీర్‌లో అద్భుతమైన మార్పులు వస్తాయి. మొదటిది ‘స్వీయ అవగాహన’ (Self-Awareness). మనం ఏ కేటగిరీకి చెందుతామో తెలుసుకుంటే, మన బలహీనతలను ఎలా సరిదిద్దుకోవాలో మనకు అర్థమవుతుంది.
ఒకవేళ మీరు ‘D’ టైప్ అయితే, ఎదుటివారికి కొంచెం గౌరవం ఇవ్వడం, నెమ్మదిగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. రెండోదయిన ‘కమ్యూనికేషన్’. ఎదుటి వ్యక్తి ఏ టైప్ అని గ్రహిస్తే, వారికి నచ్చేలా మనం మాట్లాడొచ్చు. ఒక ‘C’ టైప్ వ్యక్తితో మాట్లాడేటప్పుడు లాజిక్ తో మాట్లాడాలి, అదే ఒక ‘I’ టైప్ వ్యక్తితో అయితే సరదాగా మాట్లాడాలి అని తెలుసుకుంటాము.
బిజినెస్ రంగంలో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒక సేల్స్ పర్సన్ తన కస్టమర్ మనస్తత్వాన్ని బట్టి తన సేల్స్ పిచ్‌ను మార్చుకోవాలి. మేనేజర్లు తమ టీమ్‌లోని వ్యక్తులను సరైన పనుల్లో పెట్టడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే రిలేషన్ షిప్స్ లో కూడా భాగస్వామి మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే..వారి మధ్య అనవసరమైన గొడవలు తగ్గుతాయి.
DISC ప్రొఫైల్ అనేది మనిషిని ఒక బాక్సులో బంధించడం కాదు, ఒక మనిషిలోని వివిధ కోణాలను అర్థం చేసుకుని, వారి ప్రవర్తనను మెరుగుపరచడానికో, మెరుగుపరచుకోవడానికి ఇచ్చే ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ప్రతి వ్యక్తిలో ఈ నాలుగు లక్షణాలు వేర్వేరు మోతాదుల్లో ఉంటాయి, కానీ ఒకటి లేదా రెండు లక్షణాలు మెయిన్‌గా (Dominant) కనిపిస్తాయి. అందకే మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి DISC ఒక అద్భుతమైన సాధనం అని అంతా తెలుసుకోవాలి.




One Comment