HealthJust LifestyleLatest News

Brain Fog: చిన్న విషయాలూ మర్చిపోతున్నారా? అయితే ఈ మాయను వదిలించుకోవాల్సిందే!

Brain Fog : చాలా మంది ఏదో కోల్పోయినట్లు ఉంది, దేనిమీద దృష్టి పెట్టలేకపోతున్నాను, చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నానని చెబుతుంటారు.

Brain Fog

ప్రస్తుత కాలంలో చాలా మంది ఏదో కోల్పోయినట్లు ఉంది, దేనిమీద దృష్టి పెట్టలేకపోతున్నాను, చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నానని చెబుతుంటారు. మెదడు చుట్టూ ఏదో పొగమంచు అలుముకున్నట్లు, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడాన్నే వైద్య భాషలో ‘బ్రెయిన్ ఫాగ్’ (Brain Fog) అంటారు.

ఇది ఒక వ్యాధి కాదు కానీ మన శరీరంలో ఏదో తేడా జరుగుతోందని చెప్పే ఒక బలమైన సంకేతం. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తోంది. అలాగే విపరీతమైన ఒత్తిడి, నిద్రలేమి, తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా మన మెదడును మొద్దుబారేలా చేస్తున్నాయి.

ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో ఎందుకు చేస్తున్నామో మర్చిపోవడం, ఎదుటివారు మాట్లాడుతుంటే అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడటం, సరైన పదాలు గుర్తుకు రాకపోవడం , ఎప్పుడూ అలసటగా అనిపించడం ఇవన్నీ బ్రెయిన్ ఫాగ్(Brain Fog) లక్షణాలే .

ఇది మన వృత్తిపరమైన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మెదడుకు కావాల్సిన శక్తి అందనప్పుడు లేదా మెదడులో వాపు (Inflammation) ఏర్పడినప్పుడు ఇలా జరుగుతుంది. మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్స్ , కెఫీన్ వంటివి టెంపరరీగా ఉత్సాహాన్ని ఇచ్చినా, దీర్ఘకాలంలో మెదడు పనితీరును మందగింపజేస్తాయి.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి ‘బి-కాంప్లెక్స్’ విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అత్యంత అవసరం. వాల్‌నట్స్, చియా సీడ్స్, ఆకుకూరలు , తాజా పండ్లను మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా రోజుకు 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర అవసరం.

Brain Fog
Brain Fog

మనం నిద్రపోతున్నప్పుడే మన మెదడు తనలోని వ్యర్థాలను శుభ్రం చేసుకుంటుంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఆ వ్యర్థాలు పేరుకుపోయి బ్రెయిన్ ఫాగ్ (Brain Fog)కి దారితీస్తాయి. అలాగే, నిరంతరం మల్టీ టాస్కింగ్ చేయడం మానుకోవాలి. ఒకే సమయంలో పది పనులు చేయాలనుకోవడం వల్ల మెదడుపై విపరీతమైన భారం పడుతుంది.

మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ లేదా యోగా చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. డిజిటల్ స్క్రీన్లకు (ఫోన్, ల్యాప్‌టాప్) వీలైనంత దూరంగా ఉండటం కూడా బ్రెయిన్ ఫాగ్ తగ్గడానికి సహాయపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

ప్రకృతిలో గడపడం, మొక్కలకు నీళ్లు పోయడం లేదా చిన్నపాటి నడక వంటివి మెదడుకు రీఫ్రెష్‌మెంట్‌ను ఇస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం (Hydration) కూడా చాలా ముఖ్యం. ఒక్కోసారి కేవలం డీహైడ్రేషన్ వల్ల కూడా మెదడు సరిగ్గా స్పందించదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి

నిజానికి బ్రెయిన్ ఫాగ్ అనేది మన శరీరం మనకు ఇస్తున్న ఒక ‘వార్నింగ్’. “కాస్త ఆగు, విశ్రాంతి తీసుకో, సరైన ఆహారం తిను” అని అది మనల్ని కోరుతోంది. ఈ లక్షణాలను అలాగే నిర్లక్ష్యం చేస్తే మాత్రం భవిష్యత్తులో అది తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు. అందుకే, మీ మెదడుకు కావాల్సిన విశ్రాంతిని, పోషణను అందించి మళ్లీ చురుగ్గా మార్చుకోవాలి. ఎందుకంటే స్పష్టమైన ఆలోచనలే విజయానికి పునాది.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button