HealthJust LifestyleLatest News

Bloating:కడుపు ఉబ్బరం ఎందుకు వస్తుంది? దీనికి చెక్ పెట్టలేమా?

Bloating: మన జీర్ణ వ్యవస్థ సరిగా పని చేయనప్పుడు లోపల గాలి లేదా జీర్ణం కాని ఆహారం వల్ల ఏర్పడిన గ్యాస్ ఎక్కువగా చేరుతుంది.

Bloating

భోజనం చేసిన తర్వాత, కొన్ని సార్లు భోజనానికి ముందు కూడా కడుపు బరువు(Bloating)గా అనిపించడం, ప్యాంట్ బిగుతుగా మారిన ఫీలింగ్ రావడం, గ్యాస్ నిండినట్టు అసౌకర్యంగా ఉండటం, కొన్నిసార్లు నొప్పి కూడా రావడం కనిపిస్తాయి. దీనినే కడుపు ఉబ్బరం (Bloating)అంటారు. చాలామంది దీన్ని చిన్న సమస్యగా తీసుకుంటారు. “గ్యాస్ లే” అని వదిలేస్తారు. కానీ నిజానికి కడుపు ఉబ్బరం అనేది మన శరీరం ఇచ్చే ఒక స్పష్టమైన హెచ్చరిక. మన జీర్ణ వ్యవస్థలో ఏదో తేడా వచ్చిందని చెప్పే ఒక సిగ్నల్.

అసలు కడుపు ఉబ్బరం (Bloating)ఎందుకు వస్తుంది? డాక్టర్లు చెప్పేది చాలా క్లియర్. మన జీర్ణ వ్యవస్థ సరిగా పని చేయనప్పుడు లోపల గాలి లేదా జీర్ణం కాని ఆహారం వల్ల ఏర్పడిన గ్యాస్ ఎక్కువగా చేరుతుంది. ఆ గాలే కడుపుని ఉబ్బినట్టు చేస్తుంది, అంటే బ్లోటింగ్‌కు కారణమవుతుంది.

దీనికి ప్రధాన కారణం మన తినే విధానం. మనం అతి వేగంగా తినడం, ఆహారాన్ని బాగా నమలకుండా మింగేయడం, లేక మాట్లాడుతూ తినడం..ఇవన్నీ తినే సమయంలో గాలి ఎక్కువగా లోపలికి వెళ్లేలా చేస్తాయి. ఆ గాలి బయటకు సరిగా వెళ్లకపోతే ఉబ్బరం మొదలవుతుంది. మనం తాగే సోడాలు, కూల్ డ్రింక్స్ లో ఉండే గ్యాస్ కూడా ఉబ్బరాన్ని పెంచుతుంది.

ఇంకో పెద్ద కారణం అసిడిటీ. ఎక్కువ మసాలాలు, నూనె ఎక్కువగా ఉన్న ఆహారం, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, రకరకాల జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్స్ ఎక్కువై గ్యాస్‌ని పెంచుతాయి. అప్పుడు కడుపు నిండిపోయినట్టు, బిగుసుకున్నట్టు అనిపిస్తుంది.

కానీ ఉబ్బరం అనేది తిన్న తర్వాత మాత్రమే కాదు. చాలామందికి ఉదయం లేవగానే లేదా తినడానికి ముందే కూడా కడుపు ఉబ్బిపోయినట్టు అనిపిస్తుంది. దీనికి కారణాలు కూడా చాలా ఉన్నాయి.

సమయానికి తినకపోవడం.. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మన కడుపు ఒక క్లాక్ లాగా పని చేస్తుంది. ప్రతి రోజు ఒకే సమయానికి ఆహారం వస్తుందని ఆశిస్తుంది. ఒకవేళ మీరు లంచ్ టైమ్‌లో లంచ్ చేయకుండా ఆలస్యం చేస్తే, కడుపు లోపల ఎంజైమ్‌లు, యాసిడ్‌లు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. జీర్ణం చేయడానికి ఆహారం లేకపోవడం వల్ల ఈ యాసిడ్‌లు గ్యాస్‌గా మారి, కడుపుని ఉబ్బిస్తాయి. అందుకే కొన్నిసార్లు ఖాళీ కడుపుతో ఉన్నా కూడా కడుపు ఉబ్బిపోయినట్టు అనిపిస్తుంది.

Bloating
Bloating

ఖాళీ కడుపుతో యాసిడ్ ఉత్పత్తి.. మీరు ఉదయం అల్పాహారం (Breakfast) స్కిప్ చేస్తే, దాదాపు 10 నుంచి 12 గంటల పాటు కడుపు ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో కూడా కడుపు ఆటోమేటిక్‌గా యాసిడ్‌ను విడుదల చేస్తుంది. ఈ యాసిడ్, గాలి బయటకు వెళ్లలేక లోపల ఇరుక్కుపోవడం వల్ల కూడా తిండి తినకముందే ఉబ్బరం వస్తుంది. దీనికి కారణం, కడుపులో విడుదలయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ (HCl) ఆహారం కోసం ఎదురుచూస్తూ ఉండటం. ఆహారం దొరకకపోవడంతో, ఆ యాసిడ్ లోపలే గ్యాస్‌ను పెంచుతుంది.

కొన్ని సార్లు తిన్నది జీర్ణం కాకపోవడమే ఉబ్బరానికి ప్రధాన కారణం. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి కడుపుకు కొంత సమయం కావాలి. కానీ ఆ సమయం మధ్యలో మళ్లీ మళ్లీ తింటే, జీర్ణ వ్యవస్థ కన్ఫ్యూజ్ అవుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాక లోపల ఫర్మెంటేషన్ (పులిసిపోవడం) జరుగుతుంది. అదే గ్యాస్‌గా మారి, కడుపును ఉబ్బిస్తుంది.

ఇంకో విషయం ఏమిటంటే స్ట్రెస్. ఎక్కువ టెన్షన్‌లో ఉన్నవాళ్లకు కడుపు సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే మన మెదడు (Brain), కడుపు (Gut) రెండూ నరాల ద్వారా ఒకదానికొకటి గట్టిగా కనెక్ట్ అయ్యుంటాయి. దీన్నే డాక్టర్లు గట్-బ్రెయిన్ యాక్సిస్ అంటారు. మనసు బాగోలేకపోతే జీర్ణం కూడా సరిగ్గా జరగదు. అందుకే ఆఫీస్ టెన్షన్, కుటుంబ సమస్యలు, నిద్రలేమి (Sleeplessness) ఉన్నవాళ్లకు ఉబ్బరం తరచుగా కనిపిస్తుంది.

మన శరీరం కదలకుండా ఉండటం కూడా ఒక సమస్య. రోజుకు కనీసం కొద్దిసేపైనా నడక (Physical Movement) ఉండాలి. ఫిజికల్ మూవ్‌మెంట్ లేకపోతే గ్యాస్ లోపలే నిలిచిపోయి, బయటకు వెళ్లడానికి కష్టపడుతుంది. అది కూడా ఉబ్బరానికి దారితీస్తుంది. నీళ్లు తక్కువ తాగడం వల్ల కూడా జీర్ణం నెమ్మదిస్తుంది, అది కూడా ఉబ్బరానికి కారణం అవుతుంది.

కడుపు ఉబ్బరం ఎప్పుడు సీరియస్ అంటే.. భోజనం తర్వాత కొద్దిసేపు ఉబ్బరం ఉండి, ఆ తర్వాత అదే తగ్గిపోతే అది సాధారణమే. కానీ, రోజూ ఉబ్బరం ఉంటే, తిన్న కాసేపటికే వెంటనే నొప్పి వస్తే, వాంతులు, దీర్ఘకాలిక మలబద్ధకం (Constipation) లేదా డయేరియా (Diarrhea) ఉంటే, కారణం లేకుండా బరువు తగ్గిపోతుంటే అవి మాత్రం లైట్‌గా తీసుకోకూడదు. అప్పుడు వెంటనే డాక్టర్‌ని కలవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది పేగుల్లో ఇన్ఫెక్షన్, లేదా మరేదైనా పెద్ద సమస్యకు సంకేతం కావచ్చు.

కడుపు ఉబ్బరం వచ్చినప్పుడు మనం ఇంట్లో ఏం చేయాలి? మొదట నెమ్మదిగా కూర్చోవాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. కొద్దిసేపు నెమ్మదిగా నడవడం లేదా అటు ఇటు తిరగడం గ్యాస్ కదలడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీళ్లు తాగడం జీర్ణాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, అల్లం టీ, జీలకర్ర (Cumin), సోంపు (Fennel Seeds) లాంటివి గ్యాస్ తగ్గించడంలో, జీర్ణ వ్యవస్థకు ఉపశమనం ఇవ్వడంలో చాలా ఉపయోగపడతాయి.

కానీ అసలు పని ఉబ్బరం రాకుండా చూసుకోవడం. డాక్టర్లు చెప్పే గోల్డెన్ రూల్స్ ఇవే:
1. తినేటప్పుడు నెమ్మదిగా తినాలి. ఒక్కో ముద్దను బాగా, ఓపికగా నమలాలి. మాట్లాడకుండా తింటే గాలి లోపలికి వెళ్లదు.
2. తిన్నాక వెంటనే టీ, కాఫీ తాగకూడదు, తిన్న వెంటనే పడుకోవద్దు.
3. టైమ్ పాటిస్తూ తినాలి. కడుపుకు ఒక క్రమశిక్షణ నేర్పాలి. నిర్ణీత సమయాల్లో అల్పాహారం, లంచ్, డిన్నర్ తీసుకోవడం వల్ల అదనపు యాసిడ్ ఉత్పత్తిని నివారించొచ్చు.
4. రోజుకు కనీసం కొద్దిసేపైనా నడక, లేదా తేలికపాటి వ్యాయామం ఉండాలి.
5. నీళ్లు బాగా తాగాలి. నీళ్లు తక్కువ తాగితే జీర్ణం నెమ్మదిస్తుంది.
6. రాత్రి ఆలస్యంగా తినడం, హెవీగా తినడం చేయకూడదు. రాత్రి తేలికగా తినాలి, నిద్రకు ముందు కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి.

మొత్తానికి చెప్పాలంటే, కడుపు ఉబ్బరం అనేది ఒక్కరోజులో వచ్చిన సమస్య కాదు. మన అలవాట్లు, మనం పాటించే జీవనశైలి (Lifestyle) ఫలితం. మనం తినే విధానం, జీవించే విధానం మారితే మన కడుపు సమస్యలు కూడా మారుతాయి. శరీరం ఇచ్చే చిన్న చిన్న సిగ్నల్స్‌ను వినగలిగితే, డాక్టర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండానే మనం ఆరోగ్యంగా ఉండగలం.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button