Punugulu: యూత్ నుంచి చిన్నపిల్లల వరకూ హాట్ ఫేవరేట్ స్ట్రీట్ ఫుడ్..పునుగులు
Punugulu: పునుగులకు ఒక ప్రత్యేకమైన నిర్మాణం రావడానికి, పులియబెట్టిన పిండిలో కొద్దిగా మైదా లేదా బొంబాయి రవ్వను కలుపుతారు.
Punugulu
కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత నగరాలకు వెళితే, అక్కడ వీధి చివర్లలో తప్పకుండా కనిపించే, నోరూరించే చిరుతిండి పునుగులు(Punugulu). ఇది ఇడ్లీ, దోశ పిండి మాదిరిగానే పులియబెట్టిన పిండితో తయారు చేసినా, దీని ఆకృతి ,రుచి చాలా భిన్నంగా ఉంటాయి. పునుగులు అంటే కేవలం ఒక స్నాక్ మాత్రమే కాదు, ఇది తీరప్రాంత జీవనశైలిలో , ఉదయం లేదా సాయంత్రం అల్పాహారంలో ఒక భాగంగా మారింది.
పునుగులు(Punugulu) అంటే గోధుమ రంగులో, బయట వైపు కొద్దిగా కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే చిన్న చిన్న గుండ్రని ఉండలు.
బియ్యప్పిండి , మినప్పప్పు (Rice and Black Gram Dal) దోశ లేదా ఇడ్లీ పిండికి వాడే ప్రధాన పదార్థాలు. ఈ పిండిని బాగా పులియబెట్టాలి.
పునుగుల(Punugulu)కు ఒక ప్రత్యేకమైన నిర్మాణం రావడానికి, పులియబెట్టిన పిండిలో కొద్దిగా మైదా లేదా బొంబాయి రవ్వను కలుపుతారు. ఇది పిండిని చిక్కగా చేసి, నూనెలో వేయించినప్పుడు అవి నూనె పీల్చకుండా, గుండ్రని ఆకారం వచ్చేలా సహాయపడుతుంది.

ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర , కరివేపాకును చిన్న ముక్కలుగా కట్ చేసి పిండిలో కలుపుతారు. పునుగులు తయారీకి పిండి యొక్క సాంద్రత (Consistency) కీలకం. పిండి పలచగా ఉంటే అవి నూనె పీల్చుతాయి. గట్టిగా ఉంటే లోపల పిండిగా ఉంటాయి.
ఇడ్లీ పిండి లేదా దోశ పిండిని తీసుకుని, దానిలో కొద్దిగా మైదా పిండి, ఉప్పు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి , జీలకర్ర కలిపి గంట లేదా రెండు గంటలు పక్కన ఉంచాలి. దీనివల్ల పిండి మరింత పులిసి, పునుగులు మెత్తగా వస్తాయి.
నూనెను బాగా వేడి చేసి, మంటను మధ్యస్థంగా ఉంచుతారు. అప్పుడు చేతితో లేదా స్పూన్‌తో చిన్న చిన్న ముద్దలను నూనెలో వేయాలి. ఇవి వేయగానే తేలికగా ఉండి పైకి తేలి, లోపల వరకు ఉడికి, బంగారు గోధుమ రంగులోకి మారతాయి.
పునుగుల యొక్క రుచి దాని అల్లం చట్నీ (Ginger Chutney) లేదా పల్లి చట్నీ (Groundnut Chutney)తో మరింత పెరుగుతుంది. ఈ చట్నీ సాధారణంగా తీపి, పులుపు ,ఘాటు రుచుల మిశ్రమంతో ఉంటుంది.
పునుగులు ఒకొప్పుడు తీరప్రాంతం యొక్క స్ట్రీట్ ఫుడ్‌గా మాత్రమే ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ వంటి సిటీలలో కూడా ప్రతి వీధిలోనూ, ప్రతి బడ్డీ కొట్టు దగ్గర పునుగులు అమ్ముతున్నారు. వేడిగా, వేగంగా తయారు చేయగలగడం దీని ప్రత్యేకత.

దీనిని సాధారణంగా ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం టీ సమయానికి తింటారు. యూత్ నుంచి చిన్నపిల్లల వరకూ కూడా వీటిని ఇష్టం తినడానికి కారణం ఇది తేలికగా ఉండి, కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇవ్వడమే.
దీనికి తోడు పునుగులు తయారు చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది.దీంతో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే ఆహారం అవడంతో అందరికీ హాట్ ఫేవరేట్ స్ట్రీట్ ఫుడ్ అయిపోయింది.



