Food: తెలుగువారి షడ్రుచుల భోజనం..బ్రహ్మ చెప్పిన అమృతం..!
Food: సృష్టికర్త ఏదో ఒక ఉద్దేశంతో సృష్టించిన ప్రతి పదార్థాన్ని, తెలుగువారు తమ వంట నైపుణ్యంతో ఒక అద్భుతంగా మలచారు.

Food
అమృతం లాంటిది మరెక్కడైనా ఉందో అని దేవతలు ఒకసారి బ్రహ్మగారిని సందేహం అడిగితే… ఆ సృష్టికర్త కళ్లలో ఆనందం మెరిసిందట. చిరునవ్వుతో బ్రహ్మగారు దేవతలకు “అమృతానికి దీటైనది, ఈ సృష్టిలో తెలుగువారి భోజనం(Food) ఒక్కటేనని సమాధానం చెప్పారట. నిజమే ఆ మాటల్లో ఎంతో నిజం ఉంది! సృష్టికర్త ఏదో ఒక ఉద్దేశంతో సృష్టించిన ప్రతి పదార్థాన్ని, తెలుగువారు తమ వంట నైపుణ్యంతో ఒక అద్భుతంగా మలచారు.
మామిడికాయ సృష్టి.. పులుపు కోసమని బ్రహ్మ మామిడికాయను సృష్టిస్తే, దాన్ని తెలుగువారు కేవలం పండుగా తినకుండా… ఉప్పు,కారం,ఆవాలు,మెంతులు కలిపి ఊరబెట్టి, తరతరాలకు సరిపోయే అద్భుతమైన ఆవకాయను తయారు చేశారు. ఆ రుచికి కొన్ని యుగాల వరకు సర్వాధికారములు తెలుగువాళ్లకే దక్కుతాయనడంలో సందేహం లేదు.

కంద – బచ్చలి కలయిక.. పూజ చేసుకోవడానికే కదా అని బ్రహ్మ కందమొక్కని సృష్టిస్తే, తెలుగువారు దాని జిగురును పోగొట్టి, దానికి బచ్చలిని కలిపి కందబచ్చలి అనే అధ్భుతమైన సంతర్పణకూరను సృష్టించారు. దాని రుచికి ఏ పూజ అయినా ధన్యమే!
ఇక నల్లని పిల్లలా ఉండే వంకాయను సృష్టించి,దాన్ని కూరలకే మహారాణిని చేసి… అందులో కారం, కొత్తిమీర, మసాలా దట్టించి, గుత్తివంకాయగా తయారుచేశారు. ఆ గుత్తివంకాయ ఘుమఘుమలకు మరే కూర సరితూగగలదు.
పనసపొట్టు విందు.. జిగురు కారణంగా ఎవ్వరు ముట్టుకోరు కదా అని బ్రహ్మ గరుకుని జిగురుని కలిపి పనసను పుట్టిస్తే, దాన్ని కూడా వదల్లేదు ఈ భోజన రాజులు. దాని పొట్టుని ఆవ, ఉప్పు కారం కలిపి, మహా విందుల్లో పనసపొట్టు కూర , పనసకాయ పులావ్ లాగించేస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆకులు, పచ్చళ్ల దైవలోకం.. అంతేకాదు.. పిచ్చిపిచ్చి ఆకుల్లా ఆకుకూరలను సృష్టిస్తే, దానికి గోంగూర అని పేరుపెట్టి… పచ్చళ్లు, పులుసులతో వాటి పరిమళాన్ని దైవలోకాలదాక తాకేలా చేశారు.
ఒకటా రెండా! ఎన్నెన్ని ఆధరువులు. ఉప్పు, కారం, పులుపు, తీపి, చేదు, వగరు అనే షడ్రుచులను సమతుల్యం చేస్తూ తెలుగువారు చేసే ఈ అద్భుతాల వంటలు. రుచికరమైన ఇలాంటి భోజనం(Food) ఒక్కసారి రుచి చూచినామా, ఆ జన్మ ధన్యమైనట్టే! అమోఘం! అద్భుతం!
ఆ అమృతం వద్దని, ఎక్కడ వీటన్నిటిని దేవలోకంలో కూడా తయారు చేస్తారో అని, దేవేంద్రుడు కూడా తెలుగువారి భోజనాన్ని చూసి భయపడుతున్నాడంటే, దీని రుచి ఎంత గొప్పదో ఊహించుకోవచ్చని చమత్కరిస్తాయి పురాణాలు.
One Comment