Anoushka Shankar: నా శరీరం నాదే..సైబర్ వేధింపులపై అనుష్క ఘాటు సమాధానం
Anoushka Shankar :అనుష్క తన శరీరాన్ని ఒక సాధారణ వస్తువుగా కాకుండా, ఒక యుద్ధ యోధురాలుగా చెప్పుకున్నారు.

Anoushka Shankar
సంగీత ప్రపంచంలోనే కాదు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్న మహిళగా అనుష్క శంకర్ ఇప్పుడు కోట్లాదిమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు.సితార విధ్వాంసుడు పండిట్ రవి శంకర్ కుమార్తెగా ఆమెకు ప్రపంచ గుర్తింపు ఉన్నా కూడా, ఆమె జర్నీ మాత్రం ..తన ఐడెండిటీ కోసం, తన నిజమైన వ్యక్తిత్వం కోసం చేసిన పోరాటాలతోనే నిండి ఉంది.
ఇప్పుడు ఎక్కడచూసినా సోషల్ మీడియాలో.. సైబర్ వేధింపులు, మహిళల శరీరాలపై, వారి వ్యక్తిగత జీవితాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు సర్వసాధారణం అయ్యాయి. అలాంటి వాటిని ఎదుర్కొంటూ అనుష్క శంకర్ ఇచ్చిన సమాధానం, సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు ఇచ్చిన గట్టి వార్నింగ్ హాట్ టాపిక్ అయింది. “నా శరీరం నాదే, దానిపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదు” అని ఆమె చెప్పిన సమాధానం ప్రతి మహిళలోనూ ఫుల్ కాన్ఫిడెంట్‌ను నింపింది..

అనుష్క (Anoushka Shankar)తన శరీరాన్ని ఒక సాధారణ వస్తువుగా కాకుండా, ఒక యుద్ధ యోధురాలుగా చెప్పుకున్నారు. ఆ శరీరం ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందని, బాల్యంలో లైంగిక వేధింపుల నుంచి, నాలుగు పెద్ద శస్త్రచికిత్సల నుంచి బయటపడిందని ఆమె గుర్తు చేశారు. తీవ్రమైన పీరియడ్స్ నొప్పి, పీసీఓఎస్, మైగ్రేన్, ఆటోఇమ్యూన్ వ్యాధులతో పోరాడిందని, అలాగే వ్యసనాలను అధిగమించిందని, తన ప్రయాణంలో తన శరీరం తనతోనే నిలిచిందని ఆమె గర్వంగా చెప్పారు. ఈ అనుభవాల తర్వాతే తాను తన శరీరాన్ని పూర్తిగా ప్రేమించడం, గౌరవించడం నేర్చుకున్నానని ఆమె వివరించారు.

చాలామంది ఆమెను సిల్వర్ స్పూన్‌తో పుట్టారని, తండ్రి పేరు వల్లే గుర్తింపు వచ్చిందని విమర్శించారు. అయితే, రవి శంకర్ మరణం తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పులు, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, ఆ విమర్శలకు గట్టి సమాధానం. తండ్రి బ్రతికి ఉన్నప్పుడు తన వ్యక్తిగత బాధలను బహిరంగంగా పంచుకోవడానికి వెనుకడుగు వేసిన అనుష్క, నిర్భయ ఘటన తర్వాత తన మనసులోని భావాలను ధైర్యంగా బయటపెట్టారు.

అనుష్క శంకర్ (Anoushka Shankar) కేవలం గొప్ప సంగీతకారిణి మాత్రమే కాదు, ఆమె ఒక స్ఫూర్తిదాయకమైన మహిళా పోరాట యోధురాలు. అందుకే ఇప్పుడు ఆమె మాటలు, ఆమె ప్రయాణం, ప్రతి మహిళకు తనను తాను ప్రేమించుకోవడానికి, తనపై వచ్చే విమర్శలను ధైర్యంగా ఎదుర్కోవడానికి, తన జీవితాన్ని తన ఇష్టానుసారం నిర్మించుకోవడానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తున్నాయని మహిళలు, ఫెమినిస్టులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.