Vijay: మీ డబ్బులు మాకొద్దు.. విజయ్ కు బాధిత కుటంబం షాక్
Vijay: నష్టపరిహారంగా తమ అకౌంట్ లో జమ చేసిన మొత్తాన్ని తీసుకోవడం ఇష్టంలేదని, అందుకే వెనక్కి పంపించినట్టు చెప్పుకొచ్చారు
Vijay
తమిళనాడు రాజకీయాల్లో తనదైన మార్క్ చూపించాలని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నటుడు విజయ్(Vijay) కు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి, ముఖ్యంగా కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గత నెల 27న విజయ్ నిర్వహించిన ర్యాలీ తొక్కిసలాటకు దారితీసింది. ఈ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
విజయ్(Vijay) ర్యాలీకి ఆలస్యంగా రావడం, సరైన ఏర్పాట్లు చేయలేకపోవడం, పోలీసుల అనుమతి వంటి అంశాలపై తీవ్ర దుమారం రేగింది. అధికార పార్టీ, ఇతర పార్టీలు, టీవీకే పార్టీ ఒకరిపై ఒకరు పరస్పన విమర్శలు గుప్పించుకున్నాయి. నటుడు విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది. ఇదిలా ఉంటే ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించాలని అనుకున్నప్పటకీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో విజయ్ మౌనంగా ఉండక తప్పలేదు.

తర్వాత ఒక రిసార్ట్ బుక్ చేసి బాధిత కుటుంబాలను అక్కడికి పిలిపించి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున విజయ్ చెక్కులను అందజేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా చెక్కుల తీసుకున్న కుటుంబాల్లో ఒక కుటుంబం విజయ్ ఇచ్చిన డబ్బులను వెనక్కి తిరిగి పంపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య సంఘవి ఈ డబ్బులు మాకొద్దంటూ తిరిగి టీవీకీ అధినేత విజయ్ కు పంపించేశారు.
దీనికి కారణం కూడా ఆమె వెల్లడించారు. తొక్కిసలాట తర్వాత వీడియో కాల్ లో మాట్లాడి ఓదార్చిన విజయ్ నేరుగా వచ్చి పరామర్శిస్తారని చెప్పారన్నారు. ముందు ఆర్థిక సాయం తీసుకోవాలని కోరారని తెలిపారు. తమకు డబ్బులు ముఖ్యం కాదని, పుట్టెడు దుఃఖంలో ఉన్న తమను విజయ్ వచ్చి ఓదారుస్తారని భావించామన్నారు. అందుకే మహాబలిపురంలో సమావేశానికి తాము దూరంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. అయితే టీవీకీ పార్టీకి చెందిన కొందరు నేతలు తమ అత్త, ఆడపడుతు, మరికొందరు కుటుంబసభ్యులను తీసుకెళ్ళారని చెప్పారు.
నష్టపరిహారంగా తమ అకౌంట్ లో జమ చేసిన మొత్తాన్ని తీసుకోవడం ఇష్టంలేదని, అందుకే వెనక్కి పంపించినట్టు చెప్పుకొచ్చారు. విజయ్ ను కలిసేందుకు తమ కుటుంబసభ్యులను తీసుకెళ్ళేటప్పుడు కూడా తమను సంప్రదించలేదని సంఘవి తెలిపారు. ఈ పరిణామాలు తమకు తీవ్ర బాధను కలిగించాయని, డబ్బుల కోసం తాము ఎదురుచూడలేదన్నారు.
విజయ్(Vijay) వ్యక్తిగతంగా వచ్చి ఓదార్చి ఉంటే తమకు ఎంతో భరోసాగా ఉండేదని చెప్పుకొచ్చారు. తన భర్త విజయ్ ను విపరీతంగా అభిమానించారని, దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారని కన్నీరు మున్నీరుగా విలపించారు. కరూర్ జిల్లా కొడంగిపట్టికి చెందిన రమేశ్ తొక్కిసలాట ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ రిసార్టులో బాధిత కుటుంబాలను పరామర్శించిన విజయ్ వారందరికీ క్షమాపణలు చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి ఘటన జరిగి ఉండకూడదన్నారు. బాధిత కుటుంబాలకు టీవీకే పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.



