Just NationalJust InternationalLatest News

Javelin: భారత రక్షణ రంగంలో గేమ్-ఛేంజర్.. అమెరికా నుంచి జావెలిన్ క్షిపణి

Javelin: భారత్‌కు రాబోయే ఆయుధాల జాబితాలో 100 జావెలిన్ క్షిపణులు, ఒక జావెలిన్ క్షిపణి, 25 తేలికపాటి కమాండ్ లాంఛ్ యూనిట్లు (CLU) , ఇతర విడి భాగాలు ఉన్నాయి.

Javelin

భారత రక్షణ సామర్థ్యాలను మరింత పటిష్టం చేసే దిశగా, అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 9.3 కోట్ల డాలర్ల (సుమారు రూ.825 కోట్ల) విలువైన అత్యాధునిక ఆయుధ సామాగ్రిని భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ఆయుధ సామాగ్రిలో ఎక్స్-క్యాలిబర్ గైడెడ్ ఫిరంగి గుళ్లతో పాటు, ప్రముఖంగా చెప్పుకోదగినది జావెలిన్ (Javelin) యుద్ధ ట్యాంకుల విధ్వంసక వ్యవస్థ (Anti-Tank Guided Missile – ATGM).

భారత్‌కు రాబోయే ఆయుధాల జాబితాలో 100 జావెలిన్ (Javelin) క్షిపణులు, ఒక జావెలిన్ క్షిపణి, 25 తేలికపాటి కమాండ్ లాంఛ్ యూనిట్లు (CLU) , ఇతర విడి భాగాలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవస్థలో జావెలిన్ మిస్సైల్ సిస్టమ్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉంది.

జూవెలిన్ (FGM-148 Javelin) అంటే ఏమిటి?.. FGM-148 జావెలిన్ (Javelin)అనేది ఒక మనిషి సులభంగా మోయగలిగే (Man-Portable) యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ATGM) వ్యవస్థ. దీనిని ప్రధానంగా శత్రువుల యుద్ధ ట్యాంకులను విధ్వంసం చేయడానికి రూపొందించారు. దీనిని ఒక పెద్ద తుపాకీలా భుజంపై ఉంచుకుని, శత్రు ట్యాంకులపై ఖచ్చితమైన గురిపెట్టి ప్రయోగించవచ్చు.

ఈ అధునాతన క్షిపణి వ్యవస్థను అమెరికాకు చెందిన ప్రముఖ రక్షణ రంగ సంస్థలైన రేథియాన్ (Raytheon) మరియు లాక్‌హీడ్ మార్టిన్ (Lockheed Martin) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

ఇటీవల రష్యాతో జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్‌కు ఈ జావెలిన్ క్షిపణి ఒక దేవదూతలా పనిచేసింది. ఈ ఆయుధం కొన్ని వందల సంఖ్యలో రష్యన్ ట్యాంకులను సమర్థవంతంగా పేల్చివేయడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ క్షిపణుల దాడుల నుంచి రక్షించుకోవడానికి రష్యా సైతం తమ ట్యాంకులపై ఇనుప బోన్లను అమర్చే ప్రయత్నం చేసింది.

Javelin
Javelin

జావెలిన్(Javelin) యొక్క ప్రత్యేకతలు: సెన్సర్లకు చిక్కని మెరుపు దాడి..జావెలిన్ క్షిపణి సుమారు మూడున్నర అడుగుల పొడవు ఉంటుంది. ఇది డిస్పోజబుల్ లాంఛ్ ట్యూబ్‌లో ఉంచబడుతుంది మరియు కమాండ్ కంట్రోల్ యూనిట్ (CLU) వంటి పరికరాలను కలిగి ఉంటుంది. దీనిని సాంప్రదాయ క్షిపణుల కంటే భిన్నంగా, అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగించడానికి వీలు కల్పించే అనేక ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి:

ట్యాండమ్ వార్‌హెడ్ (Tandem Warhead).. ఈ క్షిపణిలో రెండు పేలుడు పదార్థాలను అమర్చుతారు. మొదటిది, ట్యాంకులపై ఉండే రియాక్టివ్ ఆర్మర్ (Reactive Armor) రక్షణ కవచాలను ఛేదిస్తుంది, ఆ తర్వాత రెండోది ట్యాంకు యొక్క ప్రధాన బాడీని ధ్వంసం చేస్తుంది. ఇది అత్యంత పటిష్టమైన కవచాలను సైతం ఛేదించగలదు.

ఫైర్ అండ్ ఫర్గెట్ (Fire-and-Forget).. జావెలిన్ వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశం ఇదే. లక్ష్యాన్ని లాక్ చేసిన తర్వాత, ప్రయోగించిన వ్యక్తి వెంటనే ఆ ప్రదేశం నుంచి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఇది ప్రయోగించిన తర్వాత పూర్తిగా స్వయంచాలకంగా లక్ష్యం వైపు దూసుకుపోతుంది.

సెన్సర్లకు చిక్కని విధానం.. సాధారణ ట్యాంక్ విధ్వంసక ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు ఆ ప్రదేశం నుంచి పొగ, వేడి వెలువడతాయి. ప్రత్యర్థులు వీటిని హీట్ సెన్సర్ల ద్వారా గుర్తిస్తారు. కానీ జావెలిన్‌లో, తొలుత ఒక మోటార్ క్షిపణిని ట్యూబ్ నుంచి కొంత దూరం విసురుతుంది. ఆ తర్వాతే క్షిపణి మోటార్ పనిచేయడం మొదలుపెట్టి లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. దీనిని కంప్యూటర్‌తో నియంత్రించడం వలన, క్షిపణిని ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువులకు అర్థం కాదు.

జావెలిన్ క్షిపణి రెండు ప్రధాన రకాల దాడి మోడ్‌లను కలిగి ఉంటుంది, ఇది లక్ష్య స్వభావాన్ని బట్టి దాడి చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

టాప్ అటాక్ మోడ్ (Top Attack Mode).. ఈ విధానంలో క్షిపణి నింగిలోకి దాదాపు 500 అడుగుల ఎత్తు వరకు పైకి లేచి, అక్కడి నుంచి ట్యాంకు యొక్క పైభాగాన్ని లక్ష్యంగా చేసుకుని దూసుకొస్తుంది. సాధారణంగా ట్యాంకు పైభాగంలో కవచం అంత పటిష్టంగా ఉండదు, కాబట్టి ఈ మోడ్ ట్యాంకులను అత్యంత సమర్థవంతంగా ధ్వంసం చేస్తుంది.

డైరెక్ట్ అటాక్ ఆప్షన్ (Direct Attack Option).. ఈ విధానంలో క్షిపణి సూటిగా వెళ్లి లక్ష్యాన్ని తాకుతుంది. ఈ ఆప్షన్‌ను బంకర్లు, భవనాలు లేదా సమీపంలోని సైనిక వాహనాలను ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారు.

జావెలిన్ వ్యవస్థలో క్షిపణితో పాటు ఉండే రీయుజబుల్ కమాండ్ లాంచ్ యూనిట్ (CLU), పగలు, రాత్రి చూడగలిగే అధునాతన ఇమేజింగ్ వ్యవస్థలను కలిగి ఉంటుంది. అందువల్ల ఈ అస్త్రాన్ని రాత్రి సమయాల్లో లేదా భిన్న రకాల వాతావరణ పరిస్థితుల్లో సైతం అత్యంత సమర్థవంతంగా వినియోగించవచ్చు.

జావెలిన్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన , అధునాతన ATGM వ్యవస్థలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ప్రస్తుతం అమెరికాతో పాటు, యునైటెడ్ కింగ్‌డమ్ (UK), ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఉక్రెయిన్, జోర్డాన్, న్యూజిలాండ్, తైవాన్ వంటి సుమారు 20కి పైగా దేశాలు ఉపయోగిస్తున్నాయి. భారత్‌కు ఈ వ్యవస్థ రాకతో సరిహద్దు భద్రత, ముఖ్యంగా యుద్ధ ట్యాంకుల బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కొత్త శక్తి లభిస్తుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button