CJI: సీజేఐపై దాడికి కారణం అదేనా ? లాయర్ రాకేష్ కిషోర్ లైసెన్స్ రద్దు
CJI: మరోవైపు దాడికి యత్నించిన రాకేష్ కిషోర్‌పై బార్ కౌన్సిల్ ఇండియా చర్యలు తీసుకుంది.

CJI
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(CJI) జస్టిస్ బీఆర్ గవాయిపై ఓ లాయర్ దాడికి ప్రయత్నించాడు. కోర్టులో విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే రాకేష్ కిషోర్ అనే లాయర్ బీఆర్ గవాయి బెంచ్ పైకి షూ విసిరాడు. ఆ షూ సీజేఐ (CJI)బెంచ్ కు దగ్గరలో పడింది. ఈ హఠాత్పరిమాణానికి షాక్ తిన్న ఇతర లాయర్లు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే దాడికి ప్రయత్నించిన లాయర్ ను పట్టుకున్నారు.
కోర్టు భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంటున్నప్పుడు రాకేష్ కిషోర్ సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని దేశం సహించదు అంటూ నినాదాలు చేసినట్టు సమాచారం. దాడి చేయడానికి వెనక ఉన్న కారణం ఏంటనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. షూ విసిరిన వెంటనే కోర్టులో హాలులో ఉన్న వారంతా షాక్ కు గురవగా…సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి మాత్రం కేసు విచారణను కొనసాగించాలని కోరారు. ఇలాంటి ఘటనను తనను ఏ విధంగానూ ప్రభావితం చేయలేవని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే ఈ దాడి వెనుక కారణాలను చూస్తే కొద్ది రోజుల ముందు ఒక కేసు విచారణ సందర్భంగా గవాయి చేసిన వ్యాఖ్యలను పలువురు ప్రస్తావిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఖజురహోలోని 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం పునర్నిర్మాణం కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించినప్పుడు దేవుడి దగ్గరకు వెళ్ళి ఏదైనా చేయమని అడగాలంటూ వ్యాఖ్యానించారు. సీజేఐ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. కానీ ఈ విమర్శలపై స్పందించిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తన వ్యాఖ్యలు వక్రీకరించారని, అన్ని మతాలంటే తనకు గౌరవమని వివరణ ఇచ్చారు.

మరోవైపు దాడికి యత్నించిన రాకేష్ కిషోర్‌పై బార్ కౌన్సిల్ ఇండియా చర్యలు తీసుకుంది.
అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాకేష్ కిషోర్ లైసెన్స్‌ను తక్షణమే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అతను దేశంలో ఏ కోర్టులోనూ వాదించడం, ప్రాక్టీస్ చేయడానికి అనర్హుడు. విచారణ పూర్తయి తర్వాతి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ప్రస్తుత నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. రాకేశ్ సస్పెన్షన్ ను వెంటనే అమలు చేయాలని ఢిల్లీ బార్ కౌన్సిల్ ను ఆదేశించింది. సస్పెన్షన్ ఎందుకు కొనసాగించకూడదో 15 రోజుల్లోగా జవాబివ్వాలని ఆదేశిస్తూ రాకేష్ కిషోర్‌కు షోకాజ్ నోటీస్ ఇచ్చింది.