Tomato Virus: మళ్ళీ టమాటా వైరస్ కలకలం మధ్యప్రదేశ్ లో పెరుగుతున్న కేసులు
Tomato Virus: ఈ టమోటా ఫ్లూ వైరస్ను హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ గా పేర్కొంటారని చెబుతున్నారు. కాక్స్సాకీ,ఎచినోకాకస్ అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుందని తెలిపారు.
Tomato Virus
కరోనా వైరస్ తర్వాత కొత్త కొత్త వ్యాధులన్నీ కలకలం రేపుతున్నాయి. తాజాగా దేశంలో టమాటా వైరస్ కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో టమాటా వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. చిన్నారుల్లో వేగంగా ఈ వైరస్ ప్రబలతుండడంతో అక్కడి వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పాఠశాలల్లో చదువుకునే చిన్నారుల్లో ఈ కేసులను ఎక్కువగా గుర్తించారు. వైరస్ సోకిన చిన్నారుల్లో శరీరం, చేతులు, కాళ్ళు, మెడ , నోటిలో ఎర్రటి దద్దుర్లు వస్తాయి. తర్వాత ఇవి పెద్ద పెద్ద బొబ్బలుగా, కాలిన గాయాల తరహాలో మారుతున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు దురద, మంట, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని పాఠశాల యాజమాన్యాలను ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆ చిన్నారులను స్కూల్స్ కు పంపించొద్దని స్పష్టం చేసింది. భోపాల్ లోని ప్రాథమిక పాఠశాలలతో పాటు ప్రీ స్కూల్ చిన్నారుల్లోనూ టమాటా వైరస్ కేసులు బయటపడ్డాయి. లక్షణాలు కనిపించిన చిన్నారులను వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కాగా టమాటా వైరస్ దేశంలో మొదటిసారి 2022 నెలలో కేరళలో వెలుగుచూసింది. తర్వాత తమిళనాడు, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో టమాటా వైరస్ కేసులు నమోదయ్యాయి. మలవిసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడంతో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుందని వైద్యులు గుర్తించారు. వైరస్ సోకిన చిన్నారులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లతో ఇతరులకు వ్యాపిస్తోంది. వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో దీని లక్షణాలు బయటపడతాయి. అయితే ఈ వ్యాధి ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి అంత ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు.

ఈ టమోటా ఫ్లూ వైరస్ను హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ గా పేర్కొంటారని చెబుతున్నారు. కాక్స్సాకీ,ఎచినోకాకస్ అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఆరు నెలల వయసున్న చిన్నారుల నుంచి 12 ఏళ్ళ వయసున్న చిన్నారుల్లో ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని గుర్తించినట్టు వెల్లడించారు. సాధారణంగా వచ్చే జ్వరం, ఇతర లక్షణాల తరహాలోనే ఉంటుందని, ఎటువంటి ప్రత్యేక చికిత్స అవసరం లేదంచున్నారు. పరిశుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే 7 నుంచి 10 రోజుల్లో వైరస్ తగ్గిపోతుందని వైద్యలు చెబుతున్నారు. అయితే ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలున్న చిన్నారుల్లో మాత్రం ఈ వైరస్ కు సంబంధించి చికిత్స విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.



