Tirumala:తిరుమల భక్తులకు అదిరిపోయే న్యూస్.. ఆధ్యాత్మిక కేంద్రాలకు డైరెక్ట్ ఫ్లైట్స్
Tirumala: గల్ఫ్ దేశాల నుంచి వచ్చే శ్రీనివాసుని భక్తులు చెన్నై లేదా బెంగళూరు ఎయిర్ పోర్టుల్లో దిగి, అక్కడి నుంచి గంటల తరబడి రోడ్డు మార్గంలో ప్రయాణించి తిరుపతి చేరుకుంటున్నారు.
Tirumala
తిరుమల(Tirumala) ఏడుకొండలవాడిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికీ ఒక కోరిక ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశ విదేశాల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు వెంకన్న కొండ మీదకు వెళ్తూనే ఉంటారు. అయితే ఇప్పటివరకు విదేశాల నుంచి, ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే శ్రీనివాసుని భక్తులు చెన్నై లేదా బెంగళూరు ఎయిర్ పోర్టుల్లో దిగి, అక్కడి నుంచి గంటల తరబడి రోడ్డు మార్గంలో ప్రయాణించి తిరుపతి చేరుకుంటున్నారు.
అయితే వీరి ప్రయాణ కష్టాలను గుర్తించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తిరుపతి వాసులకు , భక్తులకు శుభవార్తను వినిపించారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు, అలాగే దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలకు డైరక్టుగా విమానాలను నడపబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
శ్రీకాళహస్తి క్షేత్రాన్ని ఈరోజు అంటే ఫిబ్రవరి 23న దర్శించుకుని..తర్వాత ఈ కీలక విషయాలను వెల్లడించారు. తిరుపతి నుంచి కేవలం మన దేశంలోని వివిధ నగరాలకే కాకుండా, గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని, అందుకే రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా గల్ఫ్ దేశాలకు సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
దీనివల్ల ఎంతో మంది ఎన్ఆర్ఐలకు జర్నీ టైమ్ ఆదా అవ్వడమే కాకుండా, శ్రమ కూడా తగ్గుతుంది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఇతర నగరాల్లో దిగి.. టాక్సీలు మాట్లాడుకుని తిరుపతి రావడానికి వేల రూపాయలను అదనంగా ఖర్చు చేసేవారు. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులోకి వస్తే ఆ ఖర్చు గణనీయంగా తగ్గడంతో పాటు టైమ్ చాలా సేవ్ అవుతుంది.

అంతేకాకుండా, తిరుమల(Tirumala) దర్శనం తర్వాత కొంతమంది భక్తులు కాశీ, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. ప్రస్తుతం తిరుపతి నుంచి ఈ ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ కానీ, రెండు రోజుల రైలు ప్రయాణం కానీ తప్పనిసరిగా ఉండేది. కానీ రాబోయే రోజుల్లో తిరుపతి నుంచి డైరక్టుగా ఈ ఆధ్యాత్మిక నగరాలకు ప్లైట్స్ నడపడం వల్ల భక్తులు కేవలం 2,3 గంటల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. ఇది ముఖ్యంగా వృద్ధులకు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఎంతో ఊరటనిచ్చే విషయం.
కాగా కేంద్ర బడ్జెట్‌లో విమానయాన రంగానికి పెద్దపీట వేయడం వల్ల.. ఈ ప్రాజెక్టులు చాలా త్వరగానే పట్టాలెక్కే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి తిరుపతి ఎయిర్పోర్ట్ ఒక గ్లోబల్ హబ్‌గా మారడం వల్ల భక్తులకే కాకుండా, లోకల్‌గా రవాణా, హోటల్ రంగాల్లో ఉన్న వారికి కూడా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఈ నిర్ణయంతో ఏపీ పర్యాటక రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతుంది.



